బజ్‌బాల్‌ ఫలించేనా?!

ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌లో జపిస్తున్న మంత్ర బజ్‌బాల్‌. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ఇయాన్‌ మోర్గాన్‌ ఇంగ్లాండ్‌ క్రికెట్‌లో గుణాత్మక మార్పు తీసుకొచ్చాడు. భయమెరుగని బ్రాండ్‌ క్రికెట్‌ను పరిచయం చేశాడు. కివీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ శైలి స్ఫూర్తితో మోర్గాన్‌ సరికొత్త దారిలో నడిచాడు. బెన్‌ స్టోక్స్‌ సారథ్యంలోని ఇంగ్లాండ్‌ జట్టుకు చీఫ్‌ కోచ్‌గా వచ్చిన బ్రెండన్‌ మెక్‌కలమ్‌.. ఐదు రోజుల ఆటలో బజ్‌బాల్‌ను ప్రవేశపెట్టాడు. నయా దూకుడు వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ను అందించగా.. మరి టెస్టుల్లోనూ బజ్‌బాల్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ అందిస్తుందా? అని క్రికెట్‌ విశ్లేషకులు చర్చిస్తున్నారు.
బజ్‌బాల్‌ అంటే.. దూకుడు తారాస్థాయికి చేరటం. టెస్టుల్లో ఇంగ్లాండ్‌ అదే ఆట ఆడుతోంది. ఎటువంటి ఆలోచనలు, భయం లేకుండా తొలుత ప్రత్యర్థిపై పంజా విసురుతోంది. ఈ క్రమంలో కిందపడినా.. బెంగపడటం లేదు. మళ్లీ లేచి పంజా విసిరేందుకు చూస్తోంది. కానీ ఎక్కడా జాగ్రత్త వహిస్తూ ఆడుదామనే వ్యూహమే కనిపించదు. ఇటీవల ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌లో బజ్‌బాల్‌ దూకుడుతో 0-2తో వెనుకంజ వేసినా..బజ్‌బాల్‌ను వదల్లేదు. ఆ ఫార్ములాతోనే సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది. బెన్‌స్టోక్స్‌, మెక్‌కలమ్‌ జోడీ బజ్‌బాల్‌ ఆటతో 18 టెస్టులు ఆడారు. ఇందులో ఇంగ్లాండ్‌ 13 టెస్టుల్లో విజయాలు సాధించింది. నాలుగు పరాజయాలు, ఓ డ్రా ఉన్నాయి. న్యూజిలాండ్‌పై 3-0తో, దక్షిణాఫ్రికాపై 2-1తో టెస్టు సిరీస్‌లు సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంటే తొలి రోజే భారీ స్కోర్లు బాదటం, 60 ఓవర్ల ఆట అనంతరమే ఇన్నింగ్స్‌ డిక్లరేషన్‌ ఇవ్వటం ఇంగ్లాండ్‌కే సాధ్యమైంది. ఇక ఛేదనలోనూ బజ్‌బాల్‌ ప్రకంపనలు రేపింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ ఏకంగా 250 ప్లస్‌ లక్ష్యాలను ఐదుసార్లు విజయవంతంగా ముగించింది.
ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ జోరు బజ్‌బాల్‌ ప్రభావం ఏంటో చూపిస్తుంది. జనవరి 2022 తర్వాత టెస్టుల్లో ఇంగ్లాండ్‌ రన్‌రేట్‌ 4.82. సగటున ప్రతి ఓవర్‌కు 4.82 పరుగులు సాధిస్తూ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 3.48 రన్‌రేటుతో భారత్‌ నాల్గో స్థానంలో నిలిచింది. బజ్‌బాల్‌ వేగం అందుకునేందుకు రోహిత్‌సేన.. ధనాధన్‌ దూకుడు చూపించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లో సంప్రదాయ బ్యాటర్‌ జో రూట్‌. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లోనే టెస్టు క్రికెట్‌ ఆడతాడనే విమర్శ అతడిపై ఉండేది. కానీ బజ్‌బాల్‌ రాకతో జో రూట్‌ స్ట్రయిక్‌రేట్‌ 54.65 నుంచి 75.63కు చేరుకుంది. ర్యాంప్‌, అప్పర్‌కట్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లను జో రూట్‌ టెస్టుల్లో అలవోకగా ఆడేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ టెస్టు జట్టులో బజ్‌బాల్‌ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు ఇది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో భారత్‌తో సిరీస్‌లో ప్రయోగించేందుకు ఇంగ్లాండ్‌ రంగం సిద్ధం చేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లపై ఫలించిన బజ్‌బాల్‌.. భారత్‌పైనా విజయాన్ని అందిస్తుందనే దీమా ఇంగ్లాండ్‌ నాయకత్వంలో కనిపిస్తోంది.
గంట మోగనుంది!
టెస్టు క్రికెట్‌లో ప్రతి సెషన్‌ను గంట కొట్టి ఆరంభించటం చారిత్రక లార్డ్స్‌లో, ఈడెన్‌గార్డెన్స్‌లో చూస్తుంటాం. ఇప్పుడు ఆ గంట సంప్రదాయం హైదరాబాద్‌కూ వచ్చేసింది. భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సందర్భంగా హెచ్‌సీఏ ‘గంట’ను ప్రవేశపెట్టనుంది. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ గంట కొట్టి నేడు తొలి టెస్టు ఆటను లాంఛనంగా ప్రారంభించనున్నారు.