– అమరజ్యోతి యాత్ర స్వాగత కార్యక్రమంలో జగ్గారెెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనడంగానీ, దేశం కోసం త్యాగం చేసిన చరిత్రగానీ బీజేపీకుందా? అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ దేశ ప్రజల కోసం బలిదానమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని పెరంబుదూర్ నుంచి వచ్చిన ‘రాజీవ్‌గాంధీ అమరజ్యోతి యాత్ర’కు బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ ఉపయోగిస్తున్న టెక్నాలజీ కూడా రాజీవ్‌గాంధీ దూరదృష్టితో తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ గురించి దేశ ప్రజలకు తెలిసేలా దొరై ఆధ్యర్యంలో పెరంబుదూర్ నుంచి ఢిల్లీ వరకు అమరజ్యోతి యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఇండియాను ప్రపంచ దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలనుకున్నారని గుర్తు చేశారు.
18 ఏండ్లు నిండిన వారికి ఆయన ఓటు హక్కును కల్పించారని తెలిపారు. రాజీవ్‌గాంధీ అడుగు జాడల్లో నడుస్తూ రాహుల్‌గాంధీ కులగణనకు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ ఓబీసీ అని చెబుతారనీ, కానీ వెనకబడిన వర్గాలకు ఆయన ఎప్పుడూ ఏమీ చేయలేదని విమర్శించారు. రాజీవ్ అమర జ్యోతి ఆర్గనై జర్ దొరై మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు సాగుతుందని చెప్పారు.