– కాంగ్రెస్‌కు హిందీ రాష్ట్రాలే కీలకం
– పార్టీ స్కోరు సెంచరీ దాటితేనే ఇండియాకు అధికారం
– అసెంబ్లీ ఎన్నికలలో ఓడినా తగ్గని హస్తం ఓటుబ్యాంక్
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అన్ని పార్టీల దృష్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల పైనే ఉంది. బీజేపీలో మూడు హిందీ రాష్ట్రాలను గెలుచుకున్న ఉత్సాహం కన్పిస్తుంటే కాంగ్రెస్‌లో నైరాశ్యం అలముకుంది. తెలంగాణలో విజయం సాధించడం ఒక్కటే ఆ పార్టీకి కొంత ఊరట ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమిని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ బలాన్ని రెండంకెల సంఖ్యకే పరిమితం చేయాల్సి ఉంటుందన్న విషయం బీజేపీకి తెలుసు. మరోవైపు ఇండియా కూటమిని విజయ తీరాలకు చేర్చాలంటే తన బలాన్ని 52 నుండి పెంచుకొని, సెంచరీ దాటించాలని కాంగ్రెస్‌కూ తెలుసు. సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి విజయం సాధించడానికి హిందీ ప్రాంతంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఎంతో కీలకం అవుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలేవీ ఉనికిలో లేవు. కాబట్టి ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలు ఉండగా గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు కేవలం ఒకే ఒక స్థానం లభించింది. మిగిలిన 28 సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. మొత్తం 25 స్థానాలలో బీజేపీ 24 స్థానాలు గెలుచుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ రెండింటితో సరిపెట్టుకోగా మిగిలిన 9 సీట్లు బీజేపీకి వచ్చాయి. అంటే గత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఈ మూడు రాష్ట్రాలలో దాదాపు వంద శాతం సీట్లు సాధించిందన్న మాట. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఈ రాష్ట్రాలలో మంచి ఫలితాలు సాధిస్తేనే ఇండియా కూటమికి అవకాశం ఉంటుంది. గత పది సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని, ఈ రాష్ట్రాలలో బీజేపీ కనీసం 30-40% సీట్లు కోల్పోయే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ నేతలు తొలుత అంచనా వేశారు.
ఓటుబ్యాంక్ చెదరలేదు కానీ…
కానీ ఈ మూడు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయాలను చూసిన కాంగ్రెస్ శిబిరం పునరాలోచనలో పడింది. ఎవరు అవునన్నా, కాదన్నా హిందీ రాష్ట్రాలలో మోడీ గాలి తగ్గలేదని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. పరాజయ భారం నుంచి త్వరగా తేరుకొని, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచి ముందుకు కదలకపోతే కాంగ్రెస్‌కు మళ్లీ అవే ఫలితాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటుబ్యాంక్ చెక్కుచెదరలేదు. రాజస్థాన్‌లో 0.5% పెరిగింది కూడా. ఈ మూడు రాష్ట్రాలలో ఇదే ఓటుబ్యాంకును నిలుపుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ 20కి పైగా లోక్‌సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే అదంత తేలిక కాదు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలలో మోడీ మ్యాజిక్ పనిచేయవచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల శాతంలో చాలా తేడా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ 58-60% ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 34% మాత్రమే. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 50%, కాంగ్రెస్‌కు 30% ఓట్లు వచ్చాయి. ఓబీసీలలో బీజేపీకి ఆదరణ అధికంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కులగణన రాజకీయాలపై దృష్టి సారించినందున ఆయా వర్గాలలో ఆ పార్టీకి కూడా కొంత ఆదరణ లభించే అవకాశం ఉంది.
బీజేపీ ఓటుబ్యాంక్ చీలుతుందా?
రాహుల్ గాంధీ ఆధారపడుతున్న కులగణన రాజకీయాలు బీహార్ మినహా మిగిలిన హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఓట్లు రాలుస్తాయా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎస్సీ, ఎస్టీలలో కాంగ్రెస్‌కు మంచి ఆదరణే ఉంది. ఈ వర్గాల ఓటుబ్యాంకును బీజేపీ ఏ మేరకు కొల్లగొడుతుందో తెలియదు. ఓబీసీలు ఇప్పటికీ మోడీ జపం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కులగణనకు కాంగ్రెస్ ఇస్తున్న మద్దతు ఆ పార్టీకి ఏ మేరకు లాభిస్తుందో చూడాల్సి ఉంది.
బీహార్ మినహా మిగిలిన హిందీ రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నడుస్తుంది. ఇప్పుడు కులగణనకు కాంగ్రెస్ మద్దతు తెలిపినందున ఆ పార్టీకి కొంతమేర సానుకూల వాతావరణం ఏర్పడవచ్చు. బీజేపీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. ఓబీసీలకు మోడీ ఇప్పటికే చేయాల్సిందంతా చేశారని, కాబట్టి ఆయన తన అర్హతలను నిరూపించుకోవడానికి కులగణనపై ఆధారపడాల్సిన అవసరం లేదని సుశీల్ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలలో కులగణన రాజకీయాలు పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలోని ఓబీసీలలో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోవడం గమనార్హం. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు అండగా ఉండే ఓబీసీలు ఈసారి కాంగ్రెస్‌కు జై కొట్టారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనారిటీలలో కూడా కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోగలిగింది.
సంఫ్ ఉచ్చులో ఓబీసీలు
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే దక్షిణాది రాష్ట్రాలలో సామాజిక సాధికారత రాజకీయాలు బాగా వేళ్లూనుకుపోయాయి. అందువల్ల కులగణన రాజకీయాలకు పెద్దగా ఆస్కారం ఉండదు. కానీ హిందీ రాష్ట్రాలలో అలా కాదు. ఉత్తరాదిన మండల్ కమిషన్ నివేదిక అమలు తర్వాత వెనుకబడిన కులాల సాధికారత రాజకీయాలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. మండల్‌కు ప్రతిగా బీజేపీ హిందూత్వను ముందుకు తెచ్చింది. దీంతో హిందీ రాష్ట్రాలలోని ఓబీసీలు ఆ పార్టీకి మద్దతు పలికారు. మండల్ సమీకరణకు వ్యతిరేకంగా సంఫ్‌ు పరివార్ ఉద్దేశపూర్వకంగానే ఓబీసీలను సమీకరించి, రామమందిర నిర్మాణానికి అనుకూలంగా వారితో ప్రచారం చేయించింది. ఉత్తరాదిన మెజారిటీ ఓబీసీలు సంఫ్‌ు పరివార్ ఉచ్చులో పడి హిందూత్వ రాజకీయాల వైపు మళ్లారు. హిందీ బెల్ట్‌లో బీజేపీకి వెన్నుదన్నుగా ఉంటున్న ఓబీసీల ఓటుబ్యాంకును చీల్చి, తన వైపు తిప్పుకోవడమే ఇప్పుడు ఇండియా కూటమి ముందున్న పెద్ద సవాలు. కులగణన రాజకీయాలు ఈ కార్యాన్ని నెరవేరుస్తాయా? ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇండియా కూటమి ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి? లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి ఈ అంశంపై త్వరితగతిన ఏదో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది.