– రైతు వ్యతిరేక బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారు?: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులకు నష్టం జరుగుతుంటూ సినిమా తీసిన చిరంజీవి…నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఢిల్లీలో ధర్నా చేసే వారికి మద్దతు ఎందుకివ్వలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. పవన్, చిరంజీవి ఇద్దరూ బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. రైతుల కష్టాలపై సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారే తప్ప రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోడీకి మద్దతివ్వడం ఎంతవరకు సబబు? అని నిలదీశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేయడంతో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలకు రాత్రి నిద్ర పట్టకపోవచ్చనన్నారు. ఆగస్టు15లోపు రూ.2 లక్షల మాఫీ అయిపోతుందని తెలిపారు. పదేండ్లలో మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రైతులకు ఇచ్చింది రూ.26 వేల కోట్లేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో రైతులకు ఇచ్చింది మాత్రం రూ.31వేల కోట్లు అని వివరించారు. ఇంకా నాలుగున్నర ఏండ్ల సమయం ఉన్నా ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చామని పునరుద్ఘాటించారు.