తలసరి, స్థూల ఉత్పత్తి పెరుగుదల దారిద్య్రాన్ని నిర్మూలిస్తుందా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా 2023-24లో ఇది రూ.3,17,115లకు పెరిగినట్లు 2023 ఫిబ్రవరి 6న ఆర్థికమంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ఉపన్యాసంలో ప్రకటించారు. భారతదేశంలోనే తలసరి ఆదాయం పెరుగుదలలో రాష్ట్రం 3వ ర్యాంకులో ఉందని, ఇంత పెద్దఎత్తున ఆర్థిక వనరులు పెరిగిన రాష్ట్రం, స్థూల ఉత్పత్తి పెరిగిన రాష్ట్రం మరొకటిలేదని సగర్వంగా ప్రకటించారు. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.13.59లక్షల కోట్లు కాగా 2021-22లో రూ.11.48లక్షల కోట్లకు తగ్గిపోయింది. తిరిగి 2022-23 సంవత్సరానికి రూ.13.28లక్షల కోట్లకు పెరిగినట్లు స్టాటిస్టికల్‌ నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలతో ముడిపెట్టి తలసరి ఆదాయం పెరిగినట్లు, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. తలసరి ఆదాయం పెరిగినపుడు అంతకుముందు ఉన్న దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ఎగువకు రావాలి. ఆదాయం పెరిగినప్పుడు ఆ కుటుంబం విద్య-వైద్య సౌకర్యాలకు వ్యయం చేస్తారు. కానీ, గత 10 ఏండ్లుగా రాష్ట్రంలో అక్షరాస్యత 66.6శాతానికి మించలేదు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లలేక సాధారణ జబ్బులతో ప్రజలు చనిపోతున్నారు. ముఖ్యంగా గిరిజన, దళిత మహిళలు కనీస వైద్య సౌకర్యాలకు నోచుకోవడం లేదు. దారిద్య్ర రేఖకు ఎగువకు వెళితే తప్పనిసరిగా ఆ కుటుంబం విద్యా, వైద్యం మీద ఖర్చు చేయాలి. కానీ, రంగాలపై వ్యయం పెరిగినట్లు ఎలాంటి గణాంకాలు లేవు. కనీసం ఆవాసం కూడా లేని కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో 19శాతం ఉన్నట్లు తేలింది. ఆవాసం కాదుగదా ఆవాసానికి కావల్సిన భూమి కూడా లేని వారి సంఖ్య గణనీయంగా ఉన్నది. రాష్ట్ర ప్రజలను దారిద్య్రం నుండి ఎగువకు తేవడంతో పాటు ఉపాధి కల్పన జరగాలి. 2014 నుండి నేటివరకు పరిశీలిస్తే, దారిద్య్రరేఖకు ఎగువకు చేరినవారి సంఖ్య లేకపోగా దారిద్య్రరేఖకు దిగువకు వెళ్ళినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. 2016లో రాష్ట్రంలో 27.5శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉండగా, 2022-23లో 31శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఇందుకు మరో ఉదాహరణను కూడా పరిగణించాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి రేషన్‌కార్డులు (తెల్ల కార్డులు) ఇస్తారు. ప్రభుత్వం 2017లో చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.02కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 89.47లక్షల మందికి రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈమధ్య 12లక్షల మందిని డబుల్‌ కార్డులు ఉన్నాయనే పేరుతో తొలగించి, కొత్తగా 13.57లక్షల మందికి రేషన్‌కార్డులు ఇచ్చారు. ఈవిధంగా దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నపుడు రేషన్‌కార్డులు తగ్గించవచ్చు గదా? రేషన్‌కార్డులు పెంచుతున్నారంటేనే దారిద్య్రరేఖకు లోబడినవారి సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించాలి.
దారిద్య్రరేఖ అంటే ఏమిటి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక వ్యక్తి ఆదాయం సంవత్సరానికి రూ.27,000లకు లోపు ఉన్నట్లయితే, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు పరిగణించారు. 2013లో ఆహార భద్రతా చట్టం తెచ్చినపుడు, దారిద్య్రరేఖ ఆదాయాన్ని మార్చారు. గ్రామీణ ప్రాంతాలలో ఒక కుటుంబానికి రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2లక్షలు గీటురాయిగా నిర్ణయించారు. భూమి అయినచో, ఒక కుటుంబానికి 3.5ఎకరాల తరి (మాగాణి) లేదా 7.5ఎకరాల మెట్ట లోపు ఉన్నవారికి జాతీయ ఆహారభద్రతా కార్డు ఇస్తామని నిర్ణయించారు. రేషన్‌కార్డు పొందినవారికి కిలో బియ్యం చొప్పున తలసరి 4కిలోలు, కుటుంబానికి 20కిలోల సీలింగ్‌ వరకూ బియ్యం ఇవ్వవచ్చు. జాతీయ ఆహార భద్రతలో 10మంది కుటుంబసభ్యులకు 60కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ విభజన జరిగిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి రూ.76,800 (నెలకు రూ.6400), పట్టణాలలో రూ.1,42,200 (నెలకు రూ.11850) వార్షిక ఆదాయం లోపు ఉన్నవారిని దారిద్య్రరేఖకు దిగువగా నిర్ణయించారు. ఇంతవరకూ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఎంత ఆదాయం ఉండాలనే స్పష్టత రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ లేదు. ఒక్కో కమిషన్‌ ఒక్కొక్క నిర్ణయం చేస్తున్నది. టెండూల్కర్‌ కమిషన్‌ గ్రామీణ ప్రాంతాలలో రోజుకు తలసరి రూ.24, పట్టణాలలో రూ.36 ఆదాయానికి తగ్గితే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు ప్రకటించింది. ఈ స్కేల్‌ ప్రకారం 5శాతం దారిద్య్రరేఖనుండి ఎగువకు వచ్చినట్లు పేర్కొంది. వాద్వా కమిషన్‌ రోజుకు రూ.50 ఆదాయాన్ని లెక్కగట్టింది. ఆర్బీఐ మాజీ అధ్యక్షుడు రంగరాజన్‌ కమిషన్‌ రోజుకు రూ.100 ఆదాయం ఉండాలని, అంతకులోపు ఉన్నవారు తెలంగాణలో 50శాతం ఉన్నారని ప్రకటించింది. నేటికీ ఈ మూడు కమిషన్లను వివిధ సందర్భాలలో ఉపయోగిస్తున్నారే తప్ప కచ్చితమైన ఆదాయాన్ని మాత్రం నిర్ణయించలేదు. ఆహారభద్రతకు, విద్యాహక్కుకు, హాస్పిటల్‌ సౌకర్యానికి వివిధ ఆదాయ గీటురాళ్ళను నిర్ణయించి అమలుచేస్తున్నారు. తలసరితో పాటు సగటు నిర్ణయం కూడా భ్రమలు కల్పించేవే.
2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 25శాతం ప్రభుత్వ రుణార్హత అనగా, రూ.2.05లక్షల కోట్లుగా ఉంది. 2022-23 సంవత్సరానికి జీడీపీలో 24.3శాతం మాత్రమే రుణం తీసుకుని, రూ.3.22లక్షల కోట్లకు పెరిగింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగడం వలన అందులో సగటు 25శాతం అయినప్పటికీ రాష్ట్ర అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో 18శాతం వడ్డీల కింద చెల్లిస్తున్నాము. తలసరిగానీ, సగటు కానీ ప్రకటించడం అంటే వాస్తవాలను భ్రమింపజేయడానికే ప్రభుత్వ ఆర్థికవేత్తలు నివేదికలు రూపొందిస్తున్నారు. ఒకవైపు దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ దారిద్య్రం పెరిగిపోతూనే ఉంది. పట్టణాలలో 8శాతం నిరుద్యోగం ఉండగా నేడు అది 12.92శాతానికి పెరిగింది. గ్రామాలలో 25శాతం నుండి 38శాతానికి నిరుద్యోగం పెరిగింది. గ్రామీణ ప్రాంతాలలో పాక్షిక ఉద్యోగం అనగా సంవత్సరంలో 120రోజులు మాత్రమే పని లభించే కుటుంబాలు 70శాతం వరకూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం తలసరి ఆదాయం పెరుగుతున్నదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోనే మెరుగ్గా ఉన్నదని చెపుతున్నారు. అలా మెరుగ్గా ఉన్నపుడు 2014-15లో రూ.77వేల కోట్లు ఉన్న రాష్ట్ర రుణం, 2023-24 నాటికి రూ.4.35లక్షల కోట్లకు ఎలా పెరిగింది. రుణం పెరగడం కూడా దారిద్య్ర నిర్మూలనలో భాగమేనా?
రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలను కూడా ఉటంకించి అభివృద్ధి జరిగినట్లు ప్రకటించారు. 2021-22లో 11.55లక్షల కోట్లుకాగా, 2022-23లో 13.5లక్షల కోట్లకు పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొద్ది మంది పెట్టుబడిదారుల వ్యవస్థలో ఉత్పత్తి పెరగడం – గత సంవత్సరంపై ధరలు పెరగడం వలన స్థూల ఉత్పత్తి రేటు పెరుగుతుంది. దీనిని కూడా తలసరి ఆధాయం లాగా రాష్ట్ర పెరుగుదలకు గుర్తింపుగా ప్రకటిస్తారు. స్థూల ఉత్పత్తి పెరిగినప్పుడు రాష్ట్రంలో దారిద్య్రం శాతం తగ్గాలి. కానీ దారిద్య్రం పెరుగుతూనే ఉంది. తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల ఈ రెండు అంశాలను ప్రభుత్వాలు పదే, పదే ప్రచారం చేసుకుంటాయి. కానీ వీటివలన రాష్ట్రంలోగాని, దేశంలోకానీ దారిద్య్ర శాతం తగ్గినట్లు ఎక్కడ ఆధారాలు లేవు.
అనుత్పాదక రంగంపైనే వ్యయం
రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలను, ప్రణాళికలను ఉత్పత్తి రంగం కాకుండా అనుత్పాదక రంగంపై వ్యయం చేయడంతో ఆశించిన పెరుగుదల రావడం లేదు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలు కాగా టూరిజంతో పాటు మిగిలినవన్నీ అనుత్పాదక రంగాలకు చెందినవే. వాటినుండి వచ్చే ఆదాయం ఒక్కోసారి 70శాతంగా ఉండగా మరోసారి 30శాతానికి పడిపోతుంది. అది స్థిరమైన ఆదాయం కాదు. కానీ ఉత్పత్తి రంగం స్థిరంగా పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తికి వ్యవసాయ రంగం నుండి 15శాతం ఆదాయం వస్తుండగా పారిశ్రామిక రంగం నుండి 28శాతం ఆదాయం వస్తున్నది. ఏనాటికైనా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగినప్పటికీ అందులో ఉపాధి దినదినం తగ్గిపోతున్నది. యాంత్రీకరణ పెరగడం ద్వారా పారిశ్రామిక ఉపాధి శాతం పెరగడంతో పాటు వ్యవసాయ ఉపాధి శాతం తగ్గిపోతున్నది. తమ అవసరాలకు మించి అదనపు ఉత్పత్తి జరిగినప్పటికీ అమెరికా వ్యవసాయ ఉత్పత్తి దేశ స్థూల ఉత్పత్తిలో 1.2శాతం మాత్రమే. మన దేశంలో కూడా వ్యవసాయ యాంత్రీకరణ జరగడం వలన ఉత్పాదకత పెరగడంతో పాటు దేశ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం కాంట్రిబ్యూషన్‌ తగ్గుతున్నది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధానాలనే వివిధ పేర్లతో అనుసరిస్తున్నారు తప్ప మౌలిక మార్పులు చేసి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పాదకతను పెంచి, ఉపాధి కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. యాంత్రీకరణ ద్వారా వ్యవసాయరంగంలో ఉపాధి కోల్పోయి దరిద్రనారాయణుల సంఖ్య పెరుగుతున్నది. నేటికీ 40శాతం మంది ప్రజలు ఒక్కపూట భోజనానికి కూడా ఆదాయం సంపాదించుకోలేకపోతున్నారు. ఆర్థికవేత్తలు చెప్పిన గణాంకాల లెక్కలు చూసినపుడు దారిద్య్రం పెరుగుతున్నది. అయినప్పటికీ తలసరి ఆదాయం పెరుగుతున్నదని, సగటు ఆదాయం పెరుగుతున్నదని బడ్జెట్లలో భ్రమలు కల్పించే పదాలు ఉటంకిస్తున్నారు. సాధారణ బిచ్చగాడి ఆదాయం, రిలయన్స్‌ కంపెనీ ఆదాయం కలిపి సగటు చేస్తే బిచ్చగాడి ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది. అందువల్ల కనీస అందుబాటులో ఉన్నవారి సగటు ఆదాయాన్ని ప్రకటించాలి తప్ప పొంతనలేని ఆదాయాలను ప్రకటించడం ప్రజలను మభ్యపుచ్చడమే అవుతుంది. ఆ పని చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో తమ ఆర్థిక నైపుణ్యతను ప్రదర్శిస్తుంటారు. కానీ అవి వాస్తవం కాదని ఎందరికి తెలుసు? ఆర్థికవేత్తలు వాస్తవ పెరుగుదలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పే బాధ్యతను వహించాలి.
సారంపల్లి మల్లారెడ్డి