కమిషన్లతో పనయ్యేనా..?

Does it work with commissions?‘మా ఇంటికొస్తే ఏం తెస్తరు..? మీ ఇంటికొస్తే ఏమిస్తరు..?’ అన్నట్టుంది కేంద్ర ప్రభుత్వ తీరు. రాష్ట్రంలో పర్యటించిన పదహారో ఆర్థిక సంఘం అదే కోవలో వ్యవహరించింది. అప్పుల భారాన్ని మోయలేక పోతున్నాం.. వడ్డీలు కట్టలేక సచ్చిపోతున్నాం.. ఆదుకోండి మహాప్రభో అని రాష్ట్ర ప్రభుత్వం వేడుకుంటే.. ఠాఠ్‌… అలా కుదరదంటే కుదరదు, కచ్చితంగా నియమ నిబంధనల ప్రకారమే ముందు కెళతాం, తలసరి ఆదాయం, జనాభా ప్రాతిపదికన్నే నిధుల కేటాయింపులపై కేంద్రానికి సిఫారసులు చేస్తామంటూ బల్లగుద్ది మరీ చెప్పారు ఆర్థిక సంఘం చైర్మెన్‌ డాక్టర్‌ అరవింద్‌ పనగారియా. అంతకు మించి ఆయన ఏం చెప్పగలరులే పాపం… విధానపరమైన నిర్ణయాలన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని, ఆ తర్వాత ఏదో నామ్‌కే వాస్తేగా కమిషన్లను పర్యటనల కోసం పురమాయిస్తున్న తరుణంలో పనగారియా స్థానంలో ఎవరున్నా చేసేదేమీ లేదు.
రెండు రోజులపాటు హైదరాబాద్‌లో భేటీల మీద భేటీలు నిర్వహించిన పనగారియా బృందం… సెస్‌లు, సర్‌ఛార్జీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అనేకాంశాలపై చేతులెత్తేసింది. వాస్తవానికి పన్నులకు కాల పరమితి అనేదేమీ ఉండదు. ఆ రూపంలో సమకూరిన సొమ్మును ప్రభు త్వాలు తమ అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. కానీ సెస్‌, సర్‌ఛార్జీల ఉద్దేశం అది కాదు. నిర్ణీత కాల వ్యవధిలో, నిర్దిష్టమైన అంశం కోసం వాటిని విధించి, ఆ తర్వాత ఎత్తేయాలి. ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలు సంభవించినప్పుడు ఆయా ప్రత్యేక సందర్భాల కోసం వాటిని వసూలు చేసి, విధిగా వాటి కోసమే వాడాలి. కానీ మన మోడీ సర్కారుకు మాత్రం సెస్‌లు, సర్‌ఛార్జీలు వాడేందుకు ఎలాంటి సందర్భం అక్కర్లేదు, నిర్దిష్ట కాల పరిమితి కూడా అవసరం లేకపోవటాన్నిబట్టి అది ప్రజలను ఏ విధంగా పీడిస్తోందో, రాష్ట్రాలకు వాటాలివ్వకుండా ఎలా తిప్పలు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. 2014 నుంచి ఇప్పటి దాకా సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో రూ.20 లక్షల కోట్లను కేంద్రం వసూలు చేసినట్టు ప్రాథమిక అంచనా. ఈ మొత్తాన్ని గుండుగుత్తగా కేంద్రం వాడుకోవటం, రాష్ట్రాలకు ఒక్కపైసా విదల్చక పోవటం దాని ఆర్థిక నియంతృత్వానికి నిదర్శనం.
మరోవైపు గత మూడు నాలుగు దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ పద్ధతు లను బుద్ధిగా పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు నిధులు, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఆర్థిక సాయాలు, గ్రాంట్లలో కోతలు పెట్టటం మోడీ సర్కారుకే చెల్లింది. అదేమంటే… ‘జనాభా ప్రాతిపదికన నిధులిస్తున్నాం…’ అని కేంద్రం బుకాయించటం దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణకు నిజంగా ఆశనిపాతమే. ‘జనాభా తక్కువున్న దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు, ఎక్కువున్న ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, మహా రాష్ట్ర లాంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులు…’ అని చెప్పటం ఏ న్యాయ సూత్రమో కేంద్ర ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. అంటే కు.ని.ఆపరేషన్లను విజయవంతంగా చేసి, కేంద్రం చెప్పినట్టు జనాభాను నియంత్రిం చటం దక్షిణాది రాష్ట్రాలకు వరమా?శాపమా? అర్థంగాని పరిస్థితి. ఈ రకంగా చూస్తే ఉత్తరాది రాష్ట్రా లకు ఏటేటా నిధులు పెరుగుతూ పోతుంటే, దక్షిణాదికి నానాటికీ తగ్గిపోవటం విస్తుగొలిపే అంశం.
వీటితో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఎగ్గొట్టటం కేంద్రా నికి పరిపాటిగా మారింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం… తెలంగాణకు పీఎంఏవై కింద రూ.1,200 కోట్లు, అదనపు లెవీ బియ్యాన్ని సేకరించినందుకు రూ.1,500 కోట్లు, జాతీయ ఆరోగ్యమిషన్‌ కింద రూ.323 కోట్లు, ఇవిగాక మిగతా రకరకాల అంశాల కింద మరో రూ.2,200 కోట్లు రావాలని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. వీటిపై మోడీ ప్రభుత్వం నోరు మెదపకపోవటం తెలంగాణ పట్ల దానికున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
ఇలాంటి అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొరపెట్టుకున్నా ఆర్థిక సంఘం మనసు కరగలేదు. వీటికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అంకెలు, సంఖ్యలు, గణాంకాలతో సహా పవర్‌ పాయింట్‌ ప్రజం టేషన్‌ ఇచ్చినా.. ‘మా దగ్గర ఎలాంటి పవర్స్‌’ లేవంటూ పనగారియా పరోక్షంగా చెప్పేశారు. తద్వారా కేంద్రం తనంతట తానుగా ఇస్తే తప్ప ఎలాంటి ఆర్థిక సాయాలు, వెసులుబాట్లు ఉండబోవు, ఆ రకంగా తాము సిఫారసులు చేయలేమంటూ తేల్చేశారు. అందుకే కమిషన్లతో పని కానప్పుడు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు కేంద్రంపై కార్యాచరణ ప్రకటించటమే అత్యుత్తమ మార్గం. వామపక్షాల ఏలుబడిలో ఉన్న కేరళ ఇప్పుడు చేస్తున్నదదే.