‘ఆమె’కు ఇంట్లోనూ హింసేనా..?

Is there violence at home for 'her'?కుటుంబం..ఓ ధైర్యం. ప్రేమకు పునాది. ‘నా’ అనే వారు ఉన్నారని చెప్పుకునే ఓ భరోసా. అలాంటి కుటుంబమే నేడు స్త్రీలపై జరుగుతున్న హింసకు నెలవవుతోంది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో దీన్ని స్పష్టం చేసింది. ఇటీవలె ఐరాస కొన్ని లెక్కలు విడుదల చేసింది. గతేడాది సగటున రోజుకు నూటనలభై మంది మహిళలు, బాలికలు వారి భాగస్వాములో, బంధువుల చేతుల్లోనో మరణించారని ఆ నివేదికలు తేల్చిచెప్పాయి. సరిగ్గా ఇరవై ఏండ్ల కిందట కూడా ఐరాస మహిళలపై జరుగుతున్న హింస గురించి ఇలాగే ఆందోళన వ్యక్తం చేసింది. ఏండ్లు గడుస్తున్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు సరికదా హింస మరింత పెరిగింది. అంటే ఈ భూమిపై మహిళ మనుగడ ఎంతటి ప్రమాదంలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. అందునా ఇల్లే ఆమెకు అత్యంత ప్రమాద కరమైన ప్రదేశంగా మారిపోయింది.
‘జీవితమే పెనుమంటలు చెలరేగే ఓ మేలిముసుగు’ అని స్వాతంత్ర సమర యోధురాలు సరోజినీనాయుడు అన్నట్టు ఆ మేలిముసుగుల కింద దగ్ధమవుతున్న మహిళలు ఎందరో! ఐరాస నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మహిళా, ప్రతిచోటా తన జీవిత కాలంలో ఏదో ఒక దశలో లైంగికదాడులకో, వేధిం పులకో, శారీరక, మానసిక హింసకో గురవుతోంది. ఇక బాలికల్లో ప్రతి నలుగురిలో ఒకరు హింసకు బాధితులుగా నిలుస్తున్నారు. అందుకే ‘ఏ స్త్రీలు తమను తామే కాపాడు కుంటారో వారే సురక్షితం గా ఉన్నట్టు’ అని వందేండ్ల కిందటే బండారు అచ్చమాంబ అన్నారు.
యుఎన్‌ వుమెన్‌, యుఎన్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ అనే రెండు సంస్థల తాజా నివేదికల ప్రకారం 2023లో ప్రపంచ వ్యాప్తంగా 51,100 మంది మహిళలు కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి పది నిమిషాలకు ఓ మహిళ తాను నమ్మిన, తనకు కావాల్సిన, తనను కాపాడాల్సిన వారి చేతుల్లోనే బలైపోయింది. అందుకే ‘క్షమించొద్దు… మహిళల పట్ల హింసను నిర్మూలించేందుకు చేతులు కలుపుదాం’ అంటూ ఐరాస పిలుపునిచ్చింది. స్త్రీల పట్ల దాష్టికాలు ప్రధానంగా సామాజిక, కుటుంబ, రాజ్యహింస రూపంలో జరుగుతున్నాయి. ఇవి తరతరాలుగా కొన సాగుతూనే ఉన్నాయి. అలాగే పేద రికం, మద్యపానం, మూఢ నమ్మకాలు… ఇవన్నీ కలిసి తల్లిదండ్రుల చేతుల్లోనో, భాగస్వామి చేతుల్లోనో మహి ళలు హింసకు గురవుతూనే ఉన్నారు. ఇవిగాక సైబర్‌ బెదిరింపులు, అక్రమరవాణా, లైంగిక దోపిడీ వంటి సామాజిక హింసనూ మౌనంగా భరిస్తున్నారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం దాదాపు ముప్ప్తె శాతం మహిళలు కుటుంబహింస బాధితులే. గర్భిణులుగా ఉన్నప్పుడు కూడా హింసను భరించారని ఆ సర్వేలు చెబుతున్నాయి. ఈ హింసకు పురుషాధిక్య భావజాలం ఓ కారణమైతే.. స్త్రీ కూడా సాటి మనిషే అనే అవగాహన కల్పించడంలో, మహిళల ప్రాథమిక హక్కులను రక్షించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవ్వడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సమానత్వం గురించి మాట్లాడకపోగా ‘స్త్రీ పుట్టిందే మగవాడికి సేవ చేసేందుకు. భర్త తిట్టినా కొట్టినా మౌనంగా భరించాల్సిందే. పొరపాటున ఎదిరించి మాట్లాడితే ఆ ఆడది అసలు పతివ్రతే కాదు’ అని చెప్పే మనుధర్మ శాస్త్రాన్ని నేటి బీజేపీ పాలకులు పరమ పవిత్రంగా పూజిస్తున్నారు. భుజాలకెత్తుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. కట్టుబాట్లు, సంప్రదాయాల పేరిట మహిళలను ఇంకా పురుషాధిక్య సంకెళ్లకే పరిమితం చేస్తున్నారు. మన పాలకుల విధానాలు ఇలా ఉన్నాయి కాబట్టే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ – 2021 ప్రకారం మొత్తం 156 దేశాల్లో జెండర్‌ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఇండియా 140వ స్థానంలో ఉంది. ఇక మూఢవిశ్వాసాలు రాజ్యమేలుతున్న మనదేశంలో అమ్మాయిల పుట్టుకే ప్రశ్నార్థకంగా మారిపోయింది. లింగ నిష్పత్తిలో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. మహిళా అభివృద్ధి, సమానత్వం, సాధికారత అంటూ పాలకులు చెప్పుకుంటున్న నినాదాల్లోని డొల్లతనాన్ని ఇవి స్పష్టం చేస్తున్నాయి. మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు సైతం ఆచరణలో అమలు కాకపోవడం శోచనీయం. వాటిని అమలు చేసుకునేందుకు కూడా పోరాడాల్సిన స్థితి దాపురించడం బాధాకరం.
ఏదిఏమైనా హింసను నివారించడం, బాధితులకు రక్షణ కల్పించి, జీవితంలో నిలదొక్కుకునేందుకు సాయపడటం, దోషులను శిక్షించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. స్త్రీ-పురుష సమానత్వ ప్రాముఖ్యం గురించి పాఠ్యాంశాల్లో చేర్చాలి. మహిళలను గౌరవించాలి అనే సంస్కృతిని విద్యార్థి దశ నుండే అబ్బాయిలకు నేర్పించాలి. అందుకు తగ్గట్టు ప్రభుత్వాలు సమగ్రమైన విధానాలను రూపొందించాలి. దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మహిళపై జరుగుతున్న హింసను సమూలంగా నివారించాల్సిందే. అప్పుడే ‘మహిళా అభివృద్ధి, సమానత్వమే సామాజిక ప్రగతికి ప్రమాణికం’ అన్న అంబేద్కర్‌ మాటలు సార్థకయ్యేది.