– రైతు బంధును కాటగలిపిన కాంగ్రెస్
– కాంగ్రెస్ హస్తం దరిద్రాలకు నేస్తం..
– తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకే ఓటు వేయాలి
– రోడ్ షోల్లో కేటీఆర్
నవతెలంగాణ-చెన్నూర్ /హుజురాబాద్/ ములుగు/ ఏటూరు నాగారం
మార్పు కావాలనే నినాదంతో ప్రజల వద్దకు వస్తున్న కాంగ్రెస్ నాయకులు అధికారం వచ్చాక ఆరు గంటల కరెంటు ఇవ్వడమేనా మార్పు అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టారని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. పొరపాటున వారు అధికారంలోకి వస్తే రైతుబంధును పూర్తిగా ఎత్తెస్తారని ఆరోపించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూర్, ములుగు, పెద్దపల్లి నియోజకవర్గాల్లో సోమవారం నిర్వహించిన రోడ్ షోల్లో కేటీఆర్ మాట్లాడారు. మార్పు అంటే నిండు కుండాలా మారిన చెరువులను ఎండిపోయేలా చేటమేనా.. రైతులకు పెట్టుబడి సాయం కింద అందుతున్న రైతుబంధును ఎగ్గొట్టడమేనా అని ప్రశ్నించారు. 55 ఏండ్లలో 11 సార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ నాయకులు పదవులు అనుభవించారే కాని ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. గతంలో రూ.400 ఉన్న గ్యాస్ సిలెండర్ ధరను రూ.1200కు పెంచిన మోడీ సర్కార్ పేదోడి పొట్టగొట్టిందని విమర్శించారు. ప్రజలను మోసం చేసే పార్టీలను నమ్మొదని, అధికారం వచ్చాక ఎమ్మెల్యేను కలవాలంటే హైదరాబాద్‌కు బస్సు వేసుకొని పోయే పరిస్థితి వస్తుందని అన్నారు.
ములుగు జిల్లాకు బంగారు భవిష్యత్తు
ములుగు నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే ములుగు జిల్లాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఎక్కడ సమావేశం జరిగినా పార్టీ అభిమానులు, ప్రజలు కిక్కిరిసిపోతున్నారని ఇదే ఉత్సాహాన్ని ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కూడా చూపించాలని కోరారు. అధికారంలోకి రాగానే ఏటూరు నాగారంకు బస్సు డిపో, మారుమూల గ్రామాల్లోనూ మోడల్ కాలనీలు, మంగపేట మండలం నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు కరకట్ట నిర్మాణం, కొండయి బ్రిడ్జి నిర్మాణం.. తదితర అభివృద్ధి పనులను బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ములుగులో రెండు రోజులు ఉండి సమస్యలపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. జనవరి నుంచి కొత్త పింఛన్లు, అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. పేద కూలీలకు తెల్ల రేషన్ కార్డుపై ఐదు లక్షల జీవిత బీమా ఎల్‌ఐసీ ద్వారా అందించనున్నట్టు తెలిపారు. వందేండ్ల పాలనలో ఏ ప్రభుత్వమూ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేదని, కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు.
రాష్ట్ర భవిష్యత్తుకే ఓటు వేయాలి
ఇప్పుడు జరిగే ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదని రాజకీయ పార్టీల మధ్యనే.. మీరు వేసే ఓటు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి మార్పు కోసం వేయాలని కేటీఆర్ అన్నారు. మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్టుగా మళ్లీ రాసే పరీక్షలు ఇవి కావని రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని అన్నారు. సోషల్ మీడియా, ఇతర పద్ధతుల్లో అసత్యప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోతే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు వస్తాయని, కాంగ్రెస్ హస్తం దరిద్రాలకు నేస్తం లాంటిదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెడితే.. ఇప్పుడు రావాల్సిన డబ్బులను కాంగ్రెస్ కుట్రల వల్ల ఎన్నికల కమిషన్ ఆపేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములు ఉన్నవారికి త్వరలోనే పట్టాలు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారని అన్నారు. రుణమాఫీ కాని కొంతమందికి ఎన్నికల అయిన తర్వాత వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.