సిట్టింగులకే సీట్లు అనే సీఎంకు దమ్ముందా?

– షర్మిలకు ఏముందని పొత్తు పెట్టుకుంటాం
– రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌ గ్యారంటీ ఇవ్వలేం
– డీకే అరుణ బీజేపీకి అధ్యక్షులైతే…
– ఆ పార్టీని కాంగ్రెస్‌ నడిపించినట్టే.!
– ఇష్టాగోష్టిలో రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌కు సిట్టింగులకు సీట్లు ఇస్తామంటూ ప్రకటించే దమ్ముందా? అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అని సవాల్‌ విసిరారు. డీకే అరుణ బీజేపీ అధ్యక్షులైతే ఆ పార్టీని కూడా కాంగ్రెస్‌ వాళ్లే నడిపించినట్టు అవుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వైఎస్‌ షర్మిలకు ఏముందని పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌ అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌ ఇష్టాగోష్టిలో విలేకర్లతో మాట్లాడారు. బీజేపీని నడిపే బలం ఆ పార్టీ నాయకులకు లేదని ఒప్పుకున్నట్టేనన్నారు. మనిషికి కోడి గుడ్డు అంత బంగారం ఇస్తానంటూ సీఎం కేసీఆర్‌ చెప్పినా బీఆర్‌ఎస్‌కు ఓటు వేయరని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరూ అని కేటీఆర్‌ అడుగుతున్నారంటూ తాము సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ చేసుకుంటుందా..? అని ప్రశ్నించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ‘పోరాటం చేసే సమయంలో పొత్తులు…పోత్తుల సమయంలో పోరాటాలు ఉండవు’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో ఐదు శాతం కాంగ్రెస్‌ ఓట్‌ షేర్‌ పెరిగిందన్నారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చు కానీ టికెట్‌ మాత్రం గ్యారంటీ ఇవ్వబోమని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరినా ఇదే వర్తిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు..నిధులు..నియామకాల స్లోగన్‌ ఇప్పుడు.. లీకులు.. లిఫ్టులు.. లిక్కర్‌ గా మారింది.