సంపూర్ణ ఆరోగ్యం అంటే కేవలం అనారోగ్యం, బలహీనతలు లేకుండా వుండటం కాదు. శారీరకంగా, మానసికంగా యెటువంటి సమస్యలు లేకుండా దృఢంగా, వుత్తేజంగా వున్నప్పుడే వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులని అంటారు. నాణ్యమైన జీవితం గడపాలంటే ప్రతి వ్యక్తికి శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం. ఇప్పటికీ మన సమాజంలో మానసిక సమస్యలు, రుగ్మతల పట్ల చాలామంది ప్రతికూల దృక్పథంతోనే వుంటున్నారు. దానికి కారణం సరైన అవగాహన లేకపోవటమే. ఈ కారణంగానే చాలామంది తమ సమస్యల్ని బయటికి చెప్పుకోలేక పోతున్నారు. మనకి శారీరక అనారోగ్యం ఎంత సహజమో మానసిక అనారోగ్యం కూడా అంతే సహజం. మనిషి ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలో వచ్చే మార్పులనే మానసిక సమస్యలు లేదా రుగ్మతలు అంటారు. ఏవైనా ప్రతికూల పరిస్థితులవల్ల, సంఘటనలవల్ల, ప్రత్యేక కారణాలవల్ల మనసుకి గాయమైనప్పుడు వాళ్లు మానసిక రుగ్మతలకి లోనవుతారు. వంశపారంపర్యంగా కూడా ఈ రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. వాటిని గమనించిన వెంటనే మానసిక నిపుణులు లేదా వైద్యుల సలహా, సహాయం తీసుకుంటే వాటినుంచి త్వరగా బయటపడే అవకాశం వుంటుంది. ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’గా (ఔవీనణ) జరుపుకుంటున్నాం. అవగాహన కలిగించడంతో పాటు మానసిక సమస్యలతో బాధపడే వారికి సరైన సహకారం అందించే దిశగా సమాజాన్ని చైతన్య పరిచి తద్వారా ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యంలో సానుకూలత తీసుకురావటం ఔవీనణ లక్ష్యం. మానసిక ఆరోగ్యం మంచిగా ఉంటేనే జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం.
‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ సంస్థ 1992 లో అక్టోబర్ 10 వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినంగా ప్రకటించింది. ”ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్యు.హెచ్.ఒ.) దానికి మద్దతు తెలిపింది. 1994 నుంచి ప్రతి యేట డబ్యు.హెచ్.ఒ. అక్టోబర్ 10న ఒక థీమ్‌ని రూపొందించటం ప్రారంభించింది. 2023 సవత్సరానికి రూపొందించిన థీమ్ ‘మానసిక ఆరోగ్యం – సార్వత్రిక మానవ హక్కు!’
థీమ్ ఉద్దేశ్యం :
ఏ వ్యక్తి సంపూర్ణాభివృద్ధి అయినా వారి మానసిక ఆరోగ్యం పైనే ఆధారపడి వుంటుంది.
మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. మన హక్కుని పరిరక్షించు కోవటంతో పాటు ఎదుటివారి హక్కుని కూడా పరిరక్షించవలసిన బాధ్యత ప్రతిఒక్కరి మీదా వుంది. కాబట్టి మానసిక సమస్యలతో బాధపడే వారికి అవసరమైన సహకారాన్ని అందించాలన్నది ఈ థీమ్ యొక్క ఉద్దేశ్యం.
డబ్యు.హెచ్.ఒ. నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7 లక్షల మందికి పైగా వ్యక్తులు ఒత్తిడి, ఆందోళన, నిరాశ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో అధిక శాతం టీనేజర్స్, యువత వుండటం దురదృష్టకరం.
మన దేశంలో కూడా చాలా మంది పిల్లలు, యువత మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయినా కూడా వాళ్ళు నిపుణుల సలహా, సహాయాలు పొందటానికి వెనకాడుతున్నారు. మానసిక సమస్యలపై సమాజంలో వున్న అపోహలు, ప్రతికూల దృక్పథాలే అందుకు కారణం.
వయసు, జెండర్‌తో నిమిత్తం లేకుండా ప్రతి యేట పెరుగుతున్న మానసిక రుగ్మతలకు కారణం మారుతున్న సామాజిక, కుటుంబ విలువలని కూడా చెప్పచ్చు.
కుటుంబ సభ్యుల మధ్య రోజురోజుకి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లోపిస్తోంది. గాడ్జెట్స్‌తో సాంగత్యం పెరిగిపోయి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా ఎవరికి వారు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఎమోషనల్ షేరింగ్, ఎమోషనల్ సపోర్ట్ అనేవి లేకపోవటంతో వ్యక్తుల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. దానివల్ల ఏ చిన్న సమస్య వచ్చినా మానసిక ఆందోళనకి, ఒత్తిడికి లోనవుతున్నారు.
కుటుంబంలో తరచూ తల్లిదండ్రుల మధ్య జరిగే కొట్లాటలు, ఘర్షణలు పిల్లల్ని భయానికి గురిచేస్తున్నాయి. వారు మానసికంగా తల్లితండ్రులకు దూరమై పోతున్నారు. పిల్లలకి ఆ వయసులో తల్లిదండ్రుల నుంచి పొందవలసిన ప్రేమ, ఆప్యాతలతో పాటు సరైన గైడెన్స్ కూడా దొరకటం లేదు. దానివల్ల స్కూల్లో గానీ, తోటి పిల్లల వల్లగానీ వాళ్లకేమైన ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పుకోలేక పోతున్నారు.
భార్యాభర్తల మధ్య సర్దుబాటు లోపించటం వల్ల విడాకుల సంఖ్య పెరుగుతోంది. ఒంటరిగా జీవించే ఆడవాళ్లు సమాజం నుంచి అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. మానసికంగా దృఢంగా వుండి వాటిని ఎదుర్కొనే వారి సంఖ్య కన్నా నిరాశ, నిస్పృహలకు లోనయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
యువతలో పెరుగుతున్న మానసిక, శారీరక అనారోగ్యాలకు కారణం అధిక పని ఒత్తిడి, శక్తికి మించిన పని భారం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాళ్లు పడే శ్రమ వాళ్ళు పొందే ప్రతిఫలం కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటోంది. అది వారి ఆర్థిక పరిస్థితుల్ని కూడా ప్రభావితం చేస్తోంది. వీటికి తోడు పనిచేసే చోట సరైన సహకారం, శ్రమకి తగిన గుర్తింపు లభించక పోవటం వల్ల వారిలో నిరాశ పెరుగుతోంది. ఈ కారణాల వల్ల వారు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా సంతృప్తిగా గడపలేక పోతున్నారు.
శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవటం, సమయానికి సరైన ఆహారం, నిద్ర కొరవడటం, పని ఒత్తిడి నుంచి మెదడుకి ఉపశమనం కోసం అని అర్ధరాత్రి దాటేవరకు స్క్రీన్ వాచింగ్, తీసుకోవాల్సిన మోతాదులో మంచి నీళ్ళు తాగకపోవటం వంటి జీవన శైలి కూడా మానసిక రుగ్మతలు ఏర్పడటానికి కారణం అవుతున్నాయి.
వృద్ధుల్లో 47 శాతం మంది అల్జీమర్స్, డేమెన్షియా, యాంగ్జైటి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. దానికి కారణం ఒకరిపై ఆధారపడి బతకాలేమో అన్న భయం, అభద్రతా భావమే అని నిపుణులు చెపుతున్నారు. వృద్ధాప్యం అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో మనవలతో, మనవరాళ్ళతో ఆనందంగా గడుపుతూ విశ్రాంతి తీసుకోవటం. ఎవరికి వారు యాంత్రికంగా జీవిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అదే వారిని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తోంది.
ఇవే కాకుండా – నిరుద్యోగం, ఆర్థికపరిస్థితులు, డ్రగ్స్ – మత్తుపదార్ధాలు – వివాహేతర సంబంధాలు వంటి వ్యసనాలు కూడా మానసిక పెరగటానికి దోహద పడుతున్నాయి.
ఇండియాస్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ నివేదిక ప్రకారం మన దేశంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్యతో పోల్చినట్టయితే వారికి సహాయం అందించవలసిన మానసిక నిపుణులు, వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మానసిక రుగ్మతల్ని మూఢనమ్మకాలతో ముడిపెట్టి, వారిని శారీరకంగా హింసించే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది.
అవగాహన కలిగించాల్సిన అంశాలు :
నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకి డాక్టర్ని ఎలా సంప్రదిస్తామో మానసిక సమస్యలు వచ్చినప్పుడు కూడా అలాగే డాక్టర్ని సంప్రదించటం అవసరం అన్న విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పాలి.
ఇతర ఆరోగ్య సమస్యలకి, మానసిక ఆరోగ్య సమస్యలకి చాలా వ్యత్యాసం ఉంది. ఇవి కేవలం టైంకి మందులు వాడటం లేదా శస్త్ర చికిత్సల వల్ల తగ్గేవి కాదు. వారికి కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి పూర్తి సహకారం అవసరం. మందులు, కౌన్సెలింగ్ వల్ల సమస్య 40 శాతం తగ్గితే, కుటుంబం, సమాజం అందించే సహకారం వల్ల 60 శాతం తగ్గుతుంది. అప్పుడే దానినుంచి త్వరగా బయటపడతారు.
గుండె జబ్బులకు కార్డియాలజిస్ట్‌ని , శ్వాసకోశ వ్యాధులకి పల్మనాలజిస్ట్‌ని, చర్మ వ్యాధులకి డెర్మటాలజిస్ట్‌ని ఎలా సంప్రదిస్తామో అలాగే మానసిక సమస్యలు వచ్చినప్పుడు సైకాలజిస్ట్‌ని కలవాల్సి వుంటుందని వాళ్లకి వివరించాలి.
మానసిక అనారోగ్యం వ్యక్తిగత వైఫల్యం కాదు. కేవలం పరిస్థితులవల్ల ఏర్పడిన స్థితి మాత్రమే అన్న నమ్మకం వారిలో కలిగించాలి.
మానసిక సమస్యలు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇతరులకన్నా ఏ విషయంలోనూ కూడా తక్కువ కాదు అన్న భావన వారిలో కలిగించాలి.
వాళ్లు తమ సమస్యల్ని మనతో పంచుకున్నప్పుడు ఆ వివరాలేవీ బయటకి ప్రచారం కావు అన్న నమ్మకం వారిలో కలిగించినట్టయిటే వారు నిస్సంకోచంగా సమస్య గురించి మాట్లాడగలరు.
ఎంత త్వరగా మానసిక నిపుణుల్ని లేదా వైద్యుల్ని సంప్రదిస్తే అంత త్వరగా మామూలు స్థితికి రాగలరని, భవిష్యత్తులో వాళ్ళు సాధించవలసిన విజయాలు ఎన్నో ఉన్నాయనే ఆశని ప్రేరేపించాలి.
నిజానికి స్కూల్ స్థాయి నుంచే ఇలాంటి అవగాహన పిల్లల్లో కల్పించాలి. చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాలపైన అవగాహన వుంటే వారిలో మానసిక దృఢత్వం ఏర్పడి ఎలాంటి సమస్యలని అయినా ధైర్యంగా ఎదుర్కోగలరు. ఎటువంటి రుగ్మతలకు, ఒత్తిళ్లకు లోనవరు.
మానసిక అనారోగ్యం కారణంగా చాలామంది సమాజ జీవితం నుంచి దూరంగా ఉంచబడుతున్నారు. అనేక రకాల వివక్షకు కూడా గురౌతున్నారు.
ఒకసారి మానసిక రోగులుగా ముద్ర పడ్డాక వ్యాధి నయం అయి, వాళ్ళు పరిపూర్ణంగా మానసిక ఆరోగ్యం పొందినా కూడా ఈ సమాజమే కాదు, సొంత కుటుంబ సభ్యులు కూడా వారికి ఆశ్రయం ఇవ్వటం గానీ, ఆదరించడం గానీ చేయటం లేదు. ముఖ్యంగా స్త్రీలు, వృద్ధుల్లో ఈ నిరాదరణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది వారిని మరింత మానసిక వేదనకు గురిచేస్తోంది. వాళ్ళు హోమ్స్ లో తలదాచుకోవలసి వస్తోంది.
సయోధ్య వంటి చీ+ఉ లు ఇటువంటి స్త్రీలకి షెల్టర్ ఇవ్వటంతో పాటు, వారిలోని నైపుణ్యాలను గుర్తించి వారికి జీవనోపాధిని కూడా కల్పిస్తున్నారు. దానివల్ల వారు తిరిగి సామాజిక జీవితాన్ని కొనసాగించ కలుగుతున్నారు.
– గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్ సైకాలజిస్ట్,
ఫ్యామిలీ కౌన్సిలర్