‘నకిలీ విత్తన’ బెడద తగ్గేనా?

‘విత్తు ముందా..? చెట్టు ముందా..?’ అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుందో.. లేదోకానీ ‘విత్తు కన్నా నకిలీ ముందు’ అనే విషయం మాత్రం ప్రతియేటా ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి ముందు బహిర్గతమవుతోంది. వానాకాలం సీజన్‌ ప్రారంభానికి ముందు పోలీసు, వ్యవసాయశాఖ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాల ద్వారా తనిఖీలు, పట్టుబడితే పీడీ యాక్టులు నమోదు చేస్తున్నా… డూప్లి’కేటుగాళ్ల’ ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడంతో మరింత దృష్టి సారించాలని ఈ నెల 18వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంతో రైతుల్లో ఆందోళన
– ఏటా మార్కెట్లోకి విచ్చలవిడిగా నకి’లీల’లు
– టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు నిర్వహిస్తున్నా ఆగని డూప్లి’కేటుగాళ్ల’ ఆగడాలు
– మంత్రివర్గ సమావేశంలోనూ చర్చ.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీలు
– విత్తన కొనుగోలుపై నియంత్రణ ఎత్తివేత… కృత్రిమ కొరతకూ యత్నాలు
నవతెలంగాణ-నిజామాబాద్‌, ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధులు
మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమవుతుండ టంతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాల బెడద రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. నైరుతి పలకరించగానే రైతాంగం ఒక్కసారిగా సాగులోకి వెళ్తుంది. దాంతో సీజన్‌ ఆరంభంలో కొంత విత్తన కొరత ఏర్పడుతోంది. ఇదే అదునుగా దళారులు నకిలీ విత్తనాలను రైతులకు అంట గడుతున్నారు. నకిలీ విత్తన తయారీదారులపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ, పోలీసుశాఖ అడపాదడపా చర్యలు చేపడుతున్నా కట్టడి కావడం లేదు. ప్రతి ఏటా కేసులు నమోదవుతున్నా చర్యలు ఉండటం లేదు. సాధారణంగా ప్రతి జిల్లాలో నకిలీ విత్తనాల గుర్తింపు కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఈ ఆగడాలు ఆగడం లేదు. ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌లో తీవ్రంగానే చర్చించింది. ఎవరైనా నిబంధనల కు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడీ యాక్టు పెట్టాలని ఆదేశిం చింది. అయితే ఇది ఎంతవరకు అమలవుతుంది. కేసుల తోనే సరిపుచ్చుతారా, నకిలీలను అడ్డుకట్టు వేయగలు గుతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బురిడీ కొట్టిస్తున్న దళారులు
ఖరీఫ్‌ సీజన్‌లో నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 5,12,738 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశమున్నట్టు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో వరి 4,17,943 ఎకరాల్లో, సోయాబీన్‌ 58,798 ఎకరాల్లో, మొక్కజొన్న 32,542 ఎకరాల్లో సాగవనున్నట్టు ప్రాథమిక అంచనా వేశారు. వరి తరువాత అత్యధికంగా సోయాబీన్‌ పంట సాగవుతుంది. వరి, సోయాబీన్‌ పంటలకు ఎకరాకు 30 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మొక్కజొన్న ఎక రాకు 8 కిలోల విత్తనాలు నాటుతారు. ఈ లెక్కన వరికి 1,25,382 క్వింటాళ్లు, సోయాకు 17,615 క్వింటాళ్లు విత్తనాలు అవసరమవుతాయి. జిల్లాలో పెద్దఎత్తున విత్తన వినియోగం జరుగుతుండటంతో రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం 75 విత్తన కంపెనీలు, 568 విత్తన విక్రయ దుకాణాలు ఉన్నా యి. అయితే విత్తన కొనుగోలుపై నియంత్రణ లేక పోవడం తో రైతులు పక్క రాష్ట్రాల నుంచి విత్తనాలు కొను గోలు చేస్తున్నారని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. ఫలితంగా నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోవడం ఇబ్బంది గా మారిందని అంటున్నారు.. లైసెన్స్‌ దుకాణాల్లో విత్తనాల కోసం ఎదురుచూస్తే పంట సాగు ఆలస్యమవు తుందనే ఉద్దే శంతో రైతులు తమ వద్దకు వచ్చిన విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. దళారులు పంట దిగుబడి భారీగా వస్తుందని రైతులను నమ్మిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు.
ఆన్‌లైన్‌ ప్రక్రియతో అక్రమాలకు అడ్డుకట్ట
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి నకిలీ విత్తన నియంత్రణలో భాగంగా విత్తనాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ తదితర అంశాలను ఆన్‌లైన్‌ చేసింది. ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ముగింపు దశలో ఉన్న ఈ ఆన్‌లైన్‌ ప్రక్రియ ఈ ఏడాది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌, మే మాసాల్లో అధికారులు డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది మే ముగింపు దశకు వచ్చినా పలు జిల్లాల్లో ఈ సమావేశాలు ఇంకా నిర్వహించకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో వచ్చేవారం విత్తన డీలర్లతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
సిద్ధమవుతున్న టాస్క్‌ఫోర్స్‌ టీంలు
జూన్‌ మొదటివారం విత్తనాలు నాటే సమయం కావడంతో రైతులు ముందుగానే విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో నకిలీల బారిన పడకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ టీంలను అందుబాటులోకి తెస్తోంది. ఈ టీంలో జిల్లా వ్యవసాయ అధికారితో పాటు తెలంగాణ విత్తన సీడ్‌ అధికారి, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసు అధికారి, ఇద్దరు ఏవోలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో మాట్లాడింది.
ధరలు, బ్లాక్‌ మార్కెట్‌పైనా దృష్టి
రాష్ట్రంలో వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి విత్తనాల్లోనే నకిలీలు ఎక్కువగా చోటు చేసుకుంటు న్నాయి. మిరప విత్తనాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. డిమాండ్‌ ఉన్న విత్తనాల కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు చేప డుతున్నారు. నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలపైనా దృష్టి సారించారు. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక ఈ ఏడాది విత్తనాల ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అధిక ధరలకు విత్తనాలు అమ్మకుండా కూడా చర్యలు చేపడుతున్నారు.
విక్రయ దుకాణాల నుంచి శాంపిల్స్‌ సేకరణ
నిజామాబాద్‌ జిల్లాలో నకిలీ విత్తనాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రతియేటా విత్తన విక్రయ దుకాణాల నుంచి 450 శాంపిల్స్‌ సేకరించి టెస్టులకు పంపుతున్నామని చెబుతున్నారు. శాంపిల్స్‌లో విత్తన ప్రమాణాలు పాటించని కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ లెక్కన మూడేండ్లలో జిల్లాలో 21 కేసులు నమోదు చేశారు. రెక్టిఫైడ్‌ మిస్టేక్స్‌ (సరిచేసుకునే తప్పులు) స్టాక్‌ ఎంట్రీ, విత్తన సోర్స్‌ సర్టిఫికేట్‌, ధరల పట్టిక లేకుంటే నోటీసులు ఇచ్చి 21 రోజుల్లో ఆయా తప్పులను సరి చేసుకోవాలని ఆదేశిస్తు న్నారు. ఇక అన్‌రెక్టిఫైడ్‌ మిస్టేక్స్‌(సరిదిద్దలేని తప్పుల)కు కేసులు నమోదు చేస్తున్నారు.
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్రతియేటా శాంపిల్స్‌ సేకరించి విత్తనాల నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తున్నాం.
అందులో సరైన ప్రమాణాలు పాటించని విత్తనాలు ఉంటే వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం.
రైతులు లైసెన్స్‌ పొందిన విత్తన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి.

నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్‌

నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్‌తో నిఘా
నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌ టీం ద్వారా తనిఖీలు చేపడుతున్నాం.
హైదరాబాద్‌ నుంచి కూడా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు జిల్లాల్లో తిరుగుతున్నాయి.
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా హైదరాబాద్‌ బృందం తనిఖీలు చేపడుతోంది.
విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి