డబుల్‌ ఇండ్ల సర్వేకు తొమ్మిదేండ్లు పడుతుందా!

– ఇన్నేండ్లుగా ప్రభుత్వం ఏం చేస్తుంది..?
– ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల పరిశీలన చేయాలి
– ఎన్నికల్లోపు ఇండ్లు ఇవ్వకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం : సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా సర్వే చేయకుండా ఏం చేస్తుందని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా సర్వే చేసి నిజమైన లబ్దిదారులను గుర్తించి ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌ పరిధిలో ప్రస్తుతం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు మాత్రమే పరిశీలిస్తూ.. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పూర్తిగా విస్మరించారన్నారు.
దీని కారణంగా కలెక్టర్‌ ఆఫీసులో అందజేసిన ఆఫ్‌లైన్‌ దరఖాస్తుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ జిల్లాలోనే కలెక్టర్‌ ఆఫీస్‌కు నేరుగా 2,84,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరంతా ఇండ్ల సర్వేలో భాగస్వాములు కాకుండా దూరంగా ఉంచారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు అప్పట్లో పేదలు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని, అప్పుడు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అంటూ ప్రభుత్వం చెప్పలేదన్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ దరఖాస్తులను మాత్రమే సర్వే చేయడం వల్ల 2.84లక్షల మంది పేదలకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు. అఫ్‌లైన్‌లో నేరుగా రెవెన్యూ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తులన్నిటినీ తక్షణమే పరిశీలన చేయాలని కోరారు. గ్రేటర్‌ పరిధిలో మూడేండ్ల కిందట నిర్మించిన లక్ష ఇండ్లకు సంబంధించి త్వరగా అర్హులను గుర్తించి కేటాయించాలని, వీలైనంత త్వరగా సర్వే చేసి లబ్దిదారులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు.కొల్లూర్‌లో కట్టిన 16వేల ఇండ్లకు ఇటీవల సీఎం కేసీఆర్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించి.. నేటికీ లబ్దిదారులకు కేటాయించకుండా మర్చిపోయారని విమర్శించారు. మరోవైపు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవ్వాల.. రేపు అంటూ నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్నార న్నారు. రాజీవ్‌ గృహకల్ప స్కీం కింద ఇండ్లు ఇస్తామని 2005లో అప్పటి ప్రభుత్వం ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి వసూలు చేసి.. నేటికీ ఇండ్లు ఇవ్వలేదన్నారు. వీరికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపులో అవకాశం కల్పించకపోవడం సమంజసం కాదన్నారు. రాజీవ్‌ గృహకల్ప లబ్దిదారులకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలల్లోపు ఇండ్ల కేటాయింపు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో కొంతమంది దళారులున్నారని.. డబుల్‌ ఇండ్ల కేటాయింపు పేరుతో లక్షల్లో వసూలు చేస్తున్నారని, అలాంటివి నమ్మి మోసపోవద్దని పేదలకు సూచించారు. దీనిపై కలెక్టర్‌, సంబంధిత అధికారులు దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.నాగలక్ష్మి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మురికివాడలు లేకుండా చేస్తానని.. అందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు.
ఇండ్ల కోసం అవసరమైతే మరో పోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మహేందర్‌, ఎం. దశరథ్‌ మాట్లాడుతూ.. తహసీల్దార్‌, ఆర్డీవో ఆఫీసుల్లో పెట్టుకున్న దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని, రెండు నెలల్లో వాటిని పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు.అనంతరం సీపీఐ(ఎం) ప్రతినిధులు కలెక్టర్‌రేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావు, కె.ఎన్‌.రాజయ్య, సభ్యులు ఎం.అజరు బాబు, ఆర్‌.వెంకటేష్‌, సి.మల్లేష్‌, ఎన్‌.మారన్న, జి.కిరణ్‌, ఆర్‌.ఆశోక్‌, ఏ.పద్మ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.