టాస్క్‌ఫోర్స్‌ బడి భోజనాన్ని గట్టెక్కించేనా!?

Will the task force provide school meals?పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి, ఫుడ్‌ పాయిజన్‌ అయి తరచూ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో భోజనాన్ని నాణ్యంగా వండటం, ఆహారం కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధివిధానాలను ప్రభుత్వం జారీచేసింది. జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్సు లను ఏర్పాటు చేసి నిరంతరం పాఠశాలలు, వసతి గృహా లను తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇంతకూ భోజనం కలుషితం కావడం కేవలం టాస్క్‌ఫోర్సు పర్యవేక్షణ లేకపోవడంతోనే జరుగుతుందా ? లేదా శుభ్రమైన, కలుషితం కాకుండా భోజనాన్ని వడ్డించడానికి కావలసిన క్షేత్రస్థాయి సౌకర్యాల మెరుగుకు ఏమైనా చర్యలు అవసరమా? అవేవీ లేకుండా కేవలం టాస్క్‌ ఫోర్సులను నియమించి, అదిరించి, బెదిరించి మంచి భోజనాన్ని వండి వడ్డించగలమా? సస్పెన్షన్లు చేస్తే సమస్యలు తీరిపోతాయనుకుంటే మాగనూరు పాఠశాలలో మూడోసారి కూడా మధ్యాహ్న భోజనం సమస్య ఏర్పడి ఉండేది కాదు. ప్రధానోపాధ్యాయున్ని, డీఇఓను సస్పెండ్‌ చేశారు. చివరకు మిడ్‌ డే మీల్స్‌ ఏజెన్సీ కూడా రద్దు చేశారు. అయినప్పటికీ వరుస ఘటనలు ఆగలేదంటే, కారణం మరేదో అని కదా ఆలోచించాలి. బడి భోజనం అమలులో ఉన్న ఇబ్బందులు, లోపాలను మూల కారణాలను అన్వేషిం చకుండా, పరిష్కరించకుండా కమిటీలను వేస్తేనో, భయభ్రాంతులకు గురిచేస్తేనో సమస్య పరిష్కరించ బడదు, పైగా మరింత జటిలమవుతుంది.
మొదటగా చూడాల్సింది కుకింగ్‌ కాస్ట్‌. వాస్తవికంగా ఉన్న మార్కెట్‌ ధరలకు, వాటిలో వచ్చే హెచ్చుతగ్గులకు అనుగుణంగా కుకింగ్‌ కాస్ట్‌ పెంచబడాలి. బహిరంగ మార్కెట్‌లో కోడిగుడ్డు ధర ఆరు నుంచి ఏడు రూపాయలు పలుకుతుంటే ‘నేను నీకు అయిదు రూపాయలు చెల్లిస్తాను,తప్పనిసరిగా కోడిగుడ్డు పెట్టాలి’ అంటే ఏ నిర్వహకుడు పెట్టడానికి ఇష్టపడతాడు, ముందుకొస్తాడు? దానికి ప్రధానోపాధ్యాయున్ని నిందించడం, శిక్షించడం సరైనదేనా ? దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ధరలను కేంద్రం పెంచింది. ఇప్పటివరకు వంట ఏజెన్సీ మహిళలు 1-5 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున చెల్లిస్తుండగా.. దాన్ని రూ.6.19కి పెంచారు. 6-8 తరగతుల పిల్లలకు రూ.8.17 చెల్లిస్తుండగా, రూ.9.29కు పెంచారు. కొత్త ధరలు డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చులో కేంద్రం 60, రాష్ట్రాలు 40 శాతం భరిస్తాయి. మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం అందజేస్తాయి. కూరల కోసం పప్పు, కూరగాయలు, నూనెలను వంట ఏజెన్సీ మహిళలు సమకూర్చుకుంటారు. కేంద్రం ఉత్తర్వుల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 9,10 తరగతులకు సొంత నిధులను వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
రెండోది, మధ్యాహ్న భోజనం ధరలను కేంద్ర ప్రభుత్వం 2022లో పెంచింది. వాస్తవానికి యేటా 7-8 శాతం పెంచాల్సి ఉండగా 2023లో పెంచలేదు. మధ్యాహ్న భోజనం నాణ్యత పెరగాలంటే కనీసం మరో 2శాతం అయినా పెంచాలి. గురుకులాల్లో ధరలకు సమానంగా ఉండేలా, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను భరించాలి. రెండోది నిర్వాహకులకు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి. ప్రతి నెలా పదోతేదీ లోపల అంతకుముందు నెలకు సంబంధించిన బిల్లులు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఏనాడు చెల్లించిన దాఖలాలు లేవు. బిల్లులన్నీ నెలలు తరబడి పెండింగులో ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు అందరూ సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే. రూ.వేలు, లక్షలు పెట్టుబడి పెట్టి వస్తువులు కూరగాయలు కొనుగోలు చేసి వంటచేసే శక్తి సామర్థ్యాలు వారికి ఉండవు. ఎస్సీ,ఎస్టీ, జనరల్‌లకు వేరువేరుగా బిల్లులు, కోడిగుడ్లకు మరో బిల్లు, 6-8 తరగతులకు ఒక బిల్లు, 9-10 తరగతులకు మరో బిల్లు, ఆనరోరియం పేరిట మరో బిల్లు ఇలా పదుల సంఖ్యలో బిల్లులు వస్తున్నాయి. ఇందులో ఏ బిల్లు వచ్చిందో, ఏ బిల్లు రాలేదో అర్థం కాక నిర్వాహకులు అయోమయానికి గురవుతున్నారు. వారిని సమన్వయం చేస్తూ, భోజనం సరిగా వుండేలా నిరంతరం ఆందో ళనలో ప్రధానోపాధ్యాయులు ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఒక్క బిల్లుతో ఏక మొత్తంగా ఎప్పటికప్పుడు చెల్లించడం ఉత్తమం.
మూడోది, చాలా పాఠశాలల్లో వారికి వంట చేయడానికి అవసరమైన సరైన వంట సామగ్రి కానీ, వంటగదులు కానీ, స్టోర్‌ రూమ్స్‌ కానీ లేనే లేవు. చాలా పాఠశాలల్లో చెట్ల కింద వంట చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. వంట చెరుకుగా కట్టెలు వాడుతున్నది కూడా వాస్తవమే. కట్టెల పొయ్యి మీద వంట చేసినప్పుడు పొగరాకుండా ఎలా ఉంటుంది ? ఒకవేళ ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగించాలనుకుంటే ముందుగా వారికి అవసరమైన వంట సామగ్రి ఇవ్వడం, వంటగదులు నిర్మించడం, సిలిండర్లు అందించడం లాంటి వాటిపై చర్యలు తీసుకోవాలి.
నాల్గవది, పౌర సరఫరాల శాఖ ద్వారా వచ్చిన బియ్యాన్ని మాత్రమే పాఠశాలల్లో వినియోగిస్తారు. పలు సందర్భాలలో బియ్యం తూకం తక్కువ రావడం ఆ విషయాన్ని పలు సందర్భాల్లో, పలు సమావేశాలలో ప్రధానోపాధ్యాయులు పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతున్నదే. కొత్త బియ్యం పంపిణీ చేసినప్పుడు ఆ బియ్యంతో వంట చేసిన ప్రతిసారి, ప్రతిరోజు పాఠశాలల్లో ఇబ్బందే ఉంటుంది. కొంచెం పలుకు మీద దింపితే అన్నం గట్టిగా ఉండి పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది. కొంచెం మెత్తగా ఉడికిస్తే అన్నం గుజ్జులాగా అయిపోయి మెత్తగా ఉండి పిల్లలు తినకుండా పారవేస్తారు. వండే అన్నంలో నూనె పోసినా కూడా ఈ సమస్య నుండి తప్పించుకోలేం. ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపించిన సందర్భంలో బియ్యం తొందరగా పాడైన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. బాగా పాత బియ్యం పంపించిన సందర్భాల్లో పురుగులతో కూడిన బియ్యం వచ్చిన సందర్భాలు లేకపోలేదు. బస్తా విప్పి చూస్తే కానీ లోపల బియ్యం ఎలా ఉంటాయోఎవరికి తెలియదు. కాబట్టి పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్ని పంపించాలి.
నిర్వాహకులకు చెల్లించే వేతనం గతంలో నెలకు రూ.వెయ్యి ఉంటే ఇప్పుడు 3 వేలకు పెంచారు. అంటే రోజుకు వంద రూపాయలు. బయట సాధారణ కూలీపనికి వెళ్తే రోజుకి 500 నుండి వెయ్యి వరకు చెల్లించబడుతుంది. మళ్లీ పాఠశాల పనిచేసే ఏ ఒక్కరోజు కూడా వారు సెలవు తీసుకోవడానికి వీల్లేదు. తప్పని సరిగా వంట చేయాల్సిందే, విద్యార్థులకు భోజనం అందించా ల్సిందే. కూలి పనికి ఇష్టముంటే వెళ్తారు, లేకపోతే మానేస్తారు. కానీ పాఠశాలలో వారికి ఆ అవకాశం కూడా ఉండదు. అయినా వారు పాఠశాలల్లో ఇంత తక్కువ మొత్తాలకు పని చేయడానికి ఏకైక కారణం ‘ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నాం గనుక ఏదైనా ఒక రోజు తమకు మేలు జరగకపోతుందా?’ అన్న ఆశతో మాత్రమే. కాబట్టి వారికి కూడా గౌరవప్రదంగా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడా కనీస వేతనాన్ని అందించాలి.
గురుకులాలు, కెజిబివి, ఆదర్శ పాఠశాలల్లో భోజనానికి చెల్లించే కుకింగ్‌ కాస్ట్‌ , భోజన వ్యవహారం వేరుగా ఉంటుంది. అక్కడ వంట చేయడానికి ప్రత్యేక వసతులు ఉంటాయి. వంట సరుకులు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లు సరఫరా చేస్తారు. అయితే సుమారు 800 గురుకులాలకు శాశ్వత భవనాలు లేవు. అద్దె భవనాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి ఒక సమాంతర వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది. పాఠశాల ప్రధానో పాధ్యాయుల బాధ్యతలను భోజనం చేసే విద్యార్థుల సంఖ్య తెలపడం వరకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని డైరెక్ట్‌గా అందించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయుల ప్రాథమిక విధి విద్యార్థులకు బోధన జరపడమే. ఈ ప్రాథమిక విధులకు విఘాతం కలిగించే బోధనేతర పనుల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలి. వీటన్నింటిపై సర్కార్‌ స్పందిస్తేగానీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందుతుంది.

– కె.వేణుగోపాల్‌, 9866514577