నవతెలంగాణ-తలమడుగు
మండలంలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన రోడ్లపై కుక్కల బెడదతో మండల ప్రజలు జంకుతున్నారు. ఏ కుక్క ఎటు నుంచి వచ్చి కాటేస్తుందోనని బిక్కుబిక్కు మంటూ గ్రామాల్లోని రోడ్లపై జనాలు తిరుగుతున్నారు. వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి, ప్రేమేందర్, రాజన్న, సుభాష్ కుక్క కాటుకు గురికాగా కుక్కల భారీ నుండి కాపాడాలని రుయ్యాడి గ్రామస్తులు కోరుతున్నారు. కేవలం రుయ్యాడి గ్రామంలోనే 40 నుండి 50 కుక్కల వరకు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. గతంలో మండల కేంద్రానికి చెందిన ఐదు సంవత్సరాల బాబు రుత్విక్‌పై కుక్కలు దాడి చేసి పెదవులు, చెంపపై గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.