డాలర్ సంకెళ్లను త్రెంచుకునేందుకు బ్రిక్స్ దేశాలు సిద్ధం కావడం అమెరికాకు నిద్రపట్టనీయడం లేదు. ప్రపంచ ప్రజల సంపద దోచుకుంటూ కులుకుతున్న ఆ దేశం తన పెత్తనానికి ఎక్కడ ముప్పు వస్తుందోనన్న భయంతో వణికిపోతోంది. కొత్త అధ్యక్షుడిగా వచ్చే నెలలో కొలువుదీరనున్న పచ్చి మితవాది, శ్వేత జాతి దురహంకారి డోనాల్డ్ ట్రంప్ 2016లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు విశ్వమానవాళికి నష్టం చేకూర్చే అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకా పాలనా పగ్గాలు చేపట్టకుండానే ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేయడం మొదలు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే చైనాతోపాటు పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10, 25 శాతం చొప్పున పన్ను విధిస్తానని హెచ్చరించాడు. ఈ పద్ధతి అమలైతే ప్రతి కుటుంబం మీద 1900 నుంచి 7,600 డాలర్ల భారం పడటంతోపాటు ద్రవ్యోల్బణం 1.4 నుంచి 5.1 శాతానికి పెరిగిపోవడం యుఎస్‌ఎకే నష్టదాయకం.
అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని సృష్టించేందుకు ‘బ్రిక్స్’ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై వంద శాతం పన్నులు వేస్తానని తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన హెచ్చరికా అలాంటిదే. 2011లో ఏర్పాటైన బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు. ఈ ఏడాది ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యుఎఇ చేరాయి. ఈ దేశాలు… ప్రపంచ జనాభాలో దాదాపు సగం, జిడిపిలో 35 శాతానికిపైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మరో 34 దేశాలు చేరడానికి సిద్ధంగా ఉన్నాయి.
అమెరికా ఆధిపత్యం కొనసాగించడంలో ఐదు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయ మారకంగా డాలర్ పెత్తనంతోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మానవ విధ్వంసక ఆయుధాలు, సహజ వనరులపైనా, సాంస్కృతిక అంశాలపైనా ఆధిపత్యం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా డాలర్ గుత్తాధిపత్యానికి కళ్లెం వేయాలని, పరస్పర ప్రయోజనాల రీత్యా వ్యాపార, ద్రవ్య లావాదేవీలను సొంత కరెన్సీలో నిర్వహించుకోవాలనే అంశాలపై బ్రిక్స్ దేశాలు చర్చిస్తున్నాయి. ఈ పరిణామాలు అమెరికాకు కంటగింపుగా మారింది. 50 ఏళ్ల క్రితం డాలర్లలో చమురు విక్రయాలు జరిపేందుకు సౌదీ అరేబియా, అమెరికా మధ్య ‘పెట్రో డాలర్’ ఒప్పందం కుదిరింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం కుదిరిన ఈ ఒప్పందం ఆసరాగా యుఎస్‌ఎ చెలరేగిపోయింది. డాలర్ పెత్తనానికి అడ్డం తిరిగితే… పెద్ద దేశాలను ఆర్థిక ఆంక్షలతో ముప్పుతిప్పలు పెట్టడం, చిన్నదేశాలపై యుద్ధాలు చేసి పాలకులను అంతమొందించడం అమెరికాకు అలవాటుగా మారిపోయింది. ఐరోపా దేశాలు పాతికేళ్ల క్రితం ‘యూరో’ కరెన్సీని తీసుకురావడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో, అంతర్జాతీయ చెల్లింపుల్లో డాలర్ల ఆధిపత్యం కొద్దిమేర తగ్గింది. ఆ కరెన్సీలో లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధం కావడమే… ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌పై యుద్ధం చేసి, అంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. రూపాయి మారకంగా ఇరాన్‌తో కుదుర్చుకున్న లాభదాయకమైన చమురు కొనుగోలు ఒప్పందానికి మనదేశం తిలోదకాలివ్వడానికి అమెరికా ఒత్తిళ్లే కారణం. పెట్రో డాలర్ ఒప్పందాన్ని కొనసాగించడానికి సౌదీ ఇష్టపడకపోవడం, ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం చైనా, రష్యా, ఇండియా తదితర బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తుండడం అమెరికాకు గడ్డు పరిస్థితిని సృష్టిస్తోంది. ఈ తరుణంలోనే అమెరికా హూంకరింపులు పెరుగుతున్నాయి. తన విధానాల ద్వారా అమెరికా ఆర్థిక సార్వభౌమాధికారాన్ని పెంచుకోవచ్చుననేది ట్రంప్ వ్యూహం. వంద శాతం పన్నులు అమలులోకి వస్తే అది ప్రపంచ వాణిజ్య యుద్ధంగా మారిపోతుంది. ఈ పరిణామాలతో మొదట నష్టపోయేది అమెరికన్లే. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయక ఉత్పత్తులుసహా రోజువారీ అవసరాలైన అనేక సరుకుల ధరలు భారీగా పెరుగుతాయి. ఇతర దేశాల విడిభాగాలపై ఆధారపడినందున అమెరికా వ్యాపార సంస్థలు చేసుకునే దిగుమతులపై భారం పెరిగి, లాభాలు తగ్గిపోతాయి. అమెరికా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో వెలవెలబోతాయి. ఈ పన్నుల బాధిత దేశాలకు ప్రతి చర్యలకు పూనుకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. గతంలో అమెరికా చేసుకున్న అనేక అంతర్జాతీయ ఒప్పందాలు అర్థంలేనివిగా మారిపోతాయి. ఉద్రిక్తతలు మరింత పెరిగి, దేశాలతో సంబంధాలు, దీర్ఘకాలిక సహకారం దెబ్బతింటాయి. ఈ పరిణామాలు బ్రిక్స్ దేశాలకు మరిన్ని వర్ధమాన దేశాలను అక్కున చేరుస్తాయి. ట్రంప్ ఆచితూచి వ్యవహరించకపోతే… అమెరికాతోపాటు ప్రపంచానికి ముప్పు. ప్రపంచ దేశాలను సాధ్యమైనంత మేర లొంగదీసుకుని కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చాలన్న ట్రంప్ ఎత్తుగడ ఆ దేశానికే సంకెళ్లుగా మారే అవకాశం ఉంది.