బొమ్మల నవ్వులు

Dolls laughఒకప్పుడు ఆ బొమ్మలన్నీ పోట్లాడుకొనేవి, నవ్వుకొంటూ సరదాగా గడుపుకొనేవి. ఇప్పుడు అన్ని బొమ్మలు ఒకరినొకరు బాధగా చూసుకొంటున్నాయి.
”ఏనుగు బొమ్మా… ప్రతిరోజూ మనలో ఏదో ఒక బొమ్మను ఆ చిట్టి పాప తీసుకొంటే, ఆ బొమ్మ గర్వంతో నేనే గొప్ప అంటూ గర్వంగా అనడం మిగిలిన వారు సిగ్గుతో తల వంచుకోవడం జరిగేది. గత పది రోజులుగా ఆ చిట్టిపాప ఒక్క బొమ్మకూడా తాక లేదు” అంది పులి బొమ్మ.
”పులిబొమ్మా… అదంతా ఆ చిట్టిపాప మామయ్యా చేసిన మాయ. గొప్ప మాంత్రికుడులా వున్నాడు. ఆ చిట్టిపాప మనలని చూడటంలేదు” అంది ఏనుగు బొమ్మ.
”నా శరీరానికి శక్తీ వస్తే ఆ మాంత్రికుడిని కరకరమంటూ నమిలేస్తాను” అంది సింహం బొమ్మ.
”మనమందరం ఇక పనికిరాకుండా అయిపోయాం. ఇక మనల్ని మూటకట్టి అటక పైకి ఎక్కిస్తారు అనుకొంటాను” అంది కోతి బొమ్మ.
”అటక పైకి ఎక్కిస్తారా లేక పాతసామాన్ల వాడు వచ్చాడంటే వేసేస్తారేమో” అంది రాణి బొమ్మ.
”బొమ్మలారా నేను చెప్పేది వినండి. చెడు ఎన్నటికీ శాశ్వతంగా ఉండదు. తప్పకుండా మనకూ ఎప్పుడో ఒకసారి మంచిరోజులు వస్తాయన్న నమ్మకంతో గడుపుదాం. బాధపడకండి” అంది జింక బొమ్మ.
మూడు రోజుల తరువాత చిట్టిపాప మామయ్య వచ్చి అన్ని బొమ్మలను మూటకట్టి అటకమీద పడేసాడు.
”ఇంకా మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో గడపమంటావా జింక బొమ్మా”
”నమ్మకంతో గడపడం ఎంతో మంచిది” అంటున్న జింక బొమ్మ పైన అన్ని బొమ్మలు కోప్పడ్డాయి.
కొన్ని రోజులు గడిచాయి. బొమ్మలన్నీ బాధలో మాట్లాడుకొనడం మానేశాయి. జింక బొమ్మ ఎంత దైర్యం చెప్పినా వినక పోవడంతో వారిలాగా జింక బొమ్మ కూడా మౌనం వహించింది.
ఒక రోజు ఏదో ఒక వస్తువు ‘దబ్‌’ అంటూ ఆ బొమ్మల మూట మీద పడింది. మరికొంత సేపటికి చిట్టి పాప అమ్మ అటకపైనున్న బొమ్మల మూట కిందకు దించి మూట విప్పింది.
చిట్టి పాప ఆ బొమ్మల వైపు చూస్తూ ”సారీ బొమ్మలూ, మిమ్మల్ని కాదని మా మామయ్య తెచ్చిన సెల్‌ఫోన్‌తో ఆడుకోవడం వలన నాకు మంచి శిక్ష పడింది. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ వలన నా ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు చదువులో వెనుకపడ్డాను. మా అమ్మ ఆ సెల్‌ఫోనును అటకపైకి విసిరివేసింది. ఇక మిమ్మల్ని ఎప్పటికీ వదలను” అంది. చిట్టి పాప మాటలు విన్న ఆ బొమ్మలు సంతోషంతో నవ్వుకొన్నాయి.
– ఓట్ర ప్రకాష్‌ రావు, 09787446026