ఒక్కసారైనా రక్తదానం చేయండి : గవర్నర్‌ తమిళిసై

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
దాతలను అభినందించి సర్టిఫికెట్లను అందజేసారు. అత్యధికసార్లు రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు.ఇందుకోసం అపోహలు తొలగించి అవగాహన కల్పించడం ఆవశ్యమని స్పష్టం చేశారు. రక్తదానమే జీవనదానమని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కార్యదర్శి కె. సురేంద్రమోహన్‌, రెడ్‌ క్రాస్‌ రాష్ట్ర చైర్మెన్‌ అజరు మిశ్రా తదితరులు పాల్గొన్నారు.