రక్తదానం ప్రాణదానంతో సమానం

– ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రభు
– ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో కళాశాలలో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రక్తదానం ప్రాణదానంతో సమానమని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రభు అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 1,2, మరియు 3 ఆధ్వర్యంలో ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రభు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో తరచూ పాల్గొని సమాజ సేవ చేయాలని కోరారు. రక్తదానం చేయటం వల్ల ఎంతమంది ప్రాణాలను కాపాడవచ్చు అని, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం ఎలా ఉపయోగపడుతుందో వారిలో అవగాహన కల్పించారు. అన్ని దానాల కన్నా ప్రాణదానం మిన్న అనే నానుడిని కళాశాల విద్యార్థులు నిజం చేశారని చెప్పారు. విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 1,2 3 ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ మల్లికార్జున్‌, అనితరాణి, శ్రీను, అధ్యాపక బందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.