దొందూ దొందే

Dondoo, donde– ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌పై ఆదివాసీల వ్యతిరేకత
– తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం
– బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూపులు
రారుపూర్‌ : పదిహేను సంవత్సరాల బీజేపీ పాలనతో విసిగి వేసారిన ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాలు సైతం కాంగ్రెస్‌కే మద్దతు తెలిపాయి. ఆ పార్టీకే ఓటేసేలా ఆదివాసీలకు నచ్చచెప్పాయి. కాంగ్రెస్‌ పార్టీ అయినా తమ కష్టాలను కడతేరుస్తుందన్న కొండంత ఆశతో ఆదివాసీలు దాని వైపు మొగ్గు చూపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తానని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. పౌర సమాజం మద్దతుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ మంచి విజయాలు సాధించింది. నరేంద్ర మోడీ పాలనలో కాంగ్రెస్‌ ఘన విజయాలు సొంతం చేసుకున్నది ఈ రాష్ట్రంలోనే. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌ ఉత్తర ప్రాంతంలో వనరుల లభ్యత అధికంగా ఉన్న సుర్‌గుజా డివిజన్‌లో కాంగ్రెస్‌కు ఎదురే లేకుండా పోయింది. ఐదు ఆదివాసీ జిల్లాలతో కూడిన ఆ డివిజన్‌లోని మొత్తం 14 స్థానాలనూ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఐదు సంవత్సరాలు గడిచిపో యాయి.
కానీ ఆదివాసీల జీవితాలలో ఇంకా వెలుగులు కన్పించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ తమకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అక్కడి ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఏ సమస్యల పైన బీజేపీతో పోరాడి కాంగ్రెస్‌ను గెలిపించామో ఇప్పుడూ అవే సమస్యలు కళ్లెదుట కన్పిస్తున్నాయని గిరిజనులు వాపోతున్నారు. ఈ నెల 17న ఈ ప్రాంతంలో పోలింగ్‌ జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మినహా మరో బలమైన ప్రత్యామ్నాయం లేకపో వడంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
అటూ ఇటూ ఊగిసలాట
ఖనిజాల తవ్వకాలకు వ్యతిరేకంగా గత దశాబ్ద కాలంగా ఆ ప్రాంతంలో అనేక నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రకృతి సంపదతో అలరారే హస్‌దియో అరంద్‌ అటవీ ప్రాంతంలో అదానీ గ్రూపు మైనింగ్‌ చేపట్టినప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. మైనింగ్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళనకు అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ ప్రాంతంలో మరిన్ని మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు పచ్చజెండా ఊపింది.
ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగివచ్చింది. అడవుల్లో కేటా యించిన బొగ్గు గనులను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది. హస్‌దియో అరంద్‌ ప్రాంతంలో తాజా మైనింగ్‌ కార్యకలాపాలకు తాను వ్యతిరేకమని సుప్రీంకోర్టుకు తెలిపింది.
అయితే ఇదంతా కాంగ్రెస్‌ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ఇటు ప్రజలను, అటు మైనింగ్‌ సంస్థలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు.
బుద్ధి చెబుతాం
తవ్వకాల కారణంగా భూమి కంపిస్తోందని గిరిజనులు ఫిర్యాదు చేస్తున్నారు. పేలుళ్లు జరుగుతుంటే ప్రాణాలు పోతాయేమోనన్న భయం వెంటాడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కార్పొరేట్‌ శక్తులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. సీతాపూర్‌ నియోజకవర్గంలోని భటౌలీలో ప్రతిపాదిత అల్యూమినియం రిఫైనరీకి వ్యతిరేకంగా 2020 నుండి మహిళలు ఆందోళన సాగిస్తూనే ఉన్నారు. ‘మా నీరు, భూమి, అడవుల్ని కాపాడతామని హామీ ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు వాటిని బడా పరిశ్రమలకు ధారాదత్తం చేయాలని అనుకుంటోంది’ అని వారు ఆరోపించారు. ఇది పేదల ప్రభుత్వమని చెబుతుంటారని, కానీ దానికి భిన్నంగా పనిచేస్తుంటారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఉనికి, ఉపాధి కోల్పోయి…
భూమి పైన, అడవుల పైన నియంత్రణను కోల్పోతున్నామన్నది ఆదివాసీల ఆందోళన. ఎందుకంటే వారిలో అనేక మంది వాటి పైనే ఆధారపడి జీవితాలు నెట్టుకొస్తున్నారు. ఆ ప్రాంతంలో బొగ్గు, బాక్సైట్‌ వనరులకు కొదువ లేకపోవడంతో పలు పరిశ్రమలకు వాటిపై కన్ను పడింది. అవి ఆ ప్రాంతంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంతో ఆదివాసీలు ఉనికిని, ఉపాధిని కోల్పోయి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. బలరామ్‌పూర్‌లోని సమ్రి ప్రాంతంలో 1990 ప్రాంతంలో బాక్సైజ్‌ నిక్షేపాలను కనుగొన్నారు. అప్పటి నుండి అక్కడ మైనింగ్‌ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవు. కుదక్‌ గ్రామంలో ఇప్పటికీ అనేక ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం లేదు.
చట్టాలను నీరుకారుస్తూ…
పంచాయతీలను షెడ్యూల్డ్‌ ప్రాంతాల చట్టం పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు 1996లోనే పార్లమెంట్‌ ఆమోదం తెలిపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాని అమలుపై తగిన దృష్టి సారించడం లేదు. ఆదివాసీ గ్రామ కౌనిల్స్‌కు విశేషాధికారాలు కట్టబెడతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, చివరికి వాటికి సంప్రదింపులకు సంబంధించిన అధికారాలు మాత్రమే కల్పించింది. గిరిజన హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం నీరుకారుస్తోంది.
ఆదివాసీలను కేంద్రంగా చేసుకొని అనేక పార్టీలు ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపినప్పటికీ వారి ప్రభావం అంతంత మాత్రమేనని చెప్పాలి. అసలు అభ్యర్థులు ఎవరో కూడా ఓటర్లకు తెలియడం లేదు. ఏదేమైనా కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉన్నదని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.