– కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి
– రైతులను మోసం చేస్తూ పాలన : రైతు దీక్షలో బీఆర్‌ఎస్ నేతలు
– రెండు పిల్లర్లు కుంగితే రాజకీయం చేస్తారా? : కేటీఆర్
– నా ప్రాణం అడ్డుపెట్టైనా కార్యకర్తలకు అండగా నిలుస్తా : హరీశ్‌రావు
నవతెలంగాణ- విలేకరులు
కాంగ్రెస్, బీజేపీ రైతులను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నాయి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలి.. మోసపూరిత హామీలతో రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చలేదు. రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు రూ.15వేలకు పెంచడంలాంటి ఏ హామీనీ నెరవేర్చకుండా.. రైతులను మోసం చేస్తున్నది.. లక్షల ఎకరాల్లో పంటలు ఎండి పోతున్నా.. కనీసం పట్టించు కోవడం లేదు.. ఎకరాకు రూ.25వేల పరిహారం అందించాలి” అని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ‘రైతు దీక్షలు’ చేపట్టారు.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో పంటలు ఎండి రైతులు నష్టపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ వద్ద రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ నుంచి రోజు 200క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం జలాలను ఎలా సద్వినియోగం చేయాలో తెలియక, నీటిని వదలక పోవడంతోనే పంటలు ఎండిపోయాయని అన్నారు. కాళేశ్వరంలోని 300 పిల్లర్లలో రెండు పిల్లర్లు ఇసుకలో కుంగితే రిపేరు చేయకుండా రాజకీయాలు చేయడం వల్లే పంటలు ఎండే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు బోనస్ ఇవ్వాలని అనుకుంటున్నామని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా అడ్డుకోకుండా తాము కూడా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని తెలిపారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నష్టం చేస్తున్నదన్నారు. రైతు దీక్ష తరహాలోనే త్వరలోనే నేతన్నల దీక్ష చేపడతామని వెల్లడించారు.
తమ కార్యకర్తలపై కేసులు పెడుతూ బెదిరింపులు
సంగారెడ్డిలో రైతు దీక్షలో, అలాగే జహీరాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడారు. తమ పార్టీని, తమను తిట్టడం తప్పా.. కాంగ్రెస్ వారికి అభివృద్ధి గురించి ఆలోచన లేదని విమర్శించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా రైతులకు రుణమాఫీ, మద్దతు ధర ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అంటూ విమర్శించారు. తమ కార్యకర్తలపై కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని.. ఏ ఒక్కరూ భయపడొద్దని, తమ ప్రాణాలను అడ్డుపెట్టైనా కార్యకర్తలకు అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన బి.బి పాటిల్.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన కంటే కుట్రలు, కుతంత్రాలకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వాణిజ్యభవన్ సెంటర్ వద్ద జరిగిన రైతుదీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా అధికార పార్టీ యంత్రాంగం మొత్తం క్రికెట్ మోజులో నిమగమయ్యారని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు గజ దొంగల్లా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
రైతుల పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటూ రూ. 500 బోనస్‌ను చెల్లించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. ఏ రైతును కదిలించినా కన్నీరే వస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన రైతు దీక్షలో అన్నారు.
ఖమ్మం జిల్లా కల్లూరులో మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు నలుగురు, కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు ఉన్నారని ఏనాడూ తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడిన దాఖలాలు లేవని విమర్శించారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతు దీక్ష చేపట్టారు.
జైలుకు పోత కానీ పార్టీ మారను : ఎర్రబెల్లి
పాలకుర్తి దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. తాను జైలుకు పోత.. కానీ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. హామీల అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీని టీఆర్‌ఎస్‌గా మార్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు.