– కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న ప్రభుత్వాలు
– ఆశా వర్కర్లకు అండ ఎర్రజెండే
– సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తా : సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఆశా వర్కర్ల బస్సు జాతా గురువారం ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా జాతాకు సీఐటియూ కార్మికులు, ఆశా వర్కర్లు, ఇతర ప్రజాసంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి మంచికంటి భవనం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జే.మంగ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో తమ్మినేని మాట్లాడుతూ కాంగ్రెస్ తమ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిందన్నారు. ఆశాల ఓట్లతో గెలిచిందన్నారు. కానీ వారి సమస్యలు మాత్రం నేటికీ పరిష్కరించలేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దారికొచ్చి ఆశాల సమస్యలు పరిష్కరించాలని ఆశిస్తున్నామని, ఒకవేళ పరిష్కరించకపోతే ఎలాగైనా పోరాడి సాధిస్తామని అన్నారు. అలాంటి కృషి చేయడానికి ఐక్యతగా ఉండాలని, చీలికలు పెట్టడానికి పాలకులు ప్రయత్నం చేస్తారని, పార్టీలకతీతంగా ఆశాలు ఉండాలని కోరారు. యాత్ర ముగిసేలోగే ఈ సమస్యలు పరిష్కారం కావాలని ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్ల్టు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా నడుస్తున్నాయని విమర్శించారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చే సమస్యల పరిష్కారం కోసం కాకుండా గతంలో సాధించిన హక్కులను కోల్పోకుండా పోరాడాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్మికుల అణిచివేత…ఎలా దోపిడీ చేయాలి… కార్పొరేట్ సంస్థలకు ఎలా సహకరించాలనే ఆలోచనలే తప్ప కార్మికుల బతుకులను బాగుచేసే ఆలోచనలు చేయడం లేదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎందుకు సమర్థించామంటే కేంద్రంలో ఇంతకంటే పెద్ద బ్రహ్మ రాక్షసి బీజేపీ ఉందని తెలిపారు. బీజేపీ మత పార్టీ అని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ముక్కలు చేయాలని కోరుకునే ఫాసిస్ట్ పార్టీ అని అన్నారు. మైనార్టీలను అణగదొక్కాలనే పార్టీ బీజేపీ అని, అందుకే ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే కమ్యూనిస్టులకు శక్తి సరిపోదని, తప్పని పరిస్థితిలో కాంగ్రెస్‌ను సమర్థించాల్సి వచ్చిందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను ఉద్ధరిస్తుందని కాదని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలు ఒక్కటే మార్గమన్నారు. సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యాత్ర రథసారథి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల సమస్యలను, స్కీం వర్కర్ల, ఆశా వర్కర్లు సమస్యలను పరిష్కరించకుండా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్ తదితరులు మాట్లాడారు. కొత్తగూడెంలోనూ ఆశావర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించిన తరువాత సభ జరిగింది. ఇందులో సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడారు.