అన్నదాతలు అనాధలా?

‘బీఆర్‌ఎస్‌ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత రైతు సమితి. కేసీఆర్‌ అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు’ అని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు గాక. మరి ప్రతిరోజు ఎక్కడో ఓచోట రైతు ఆత్మహత్యల వార్తలను మనం ఎందుకు చూస్తున్నాం? ఈ ప్రశ్నకు బదులేది? అలా చూసి చూసి మన హృదయాలు కూడా మొద్దుబారు తున్నాయోమోనని భయం కొల్పుతున్నది కదూ. కాలం కలసిరాక, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సర్కా రులు, మార్కెట్‌ దళారులు, వ్యాపారులు, బ్యాంకులు, వడ్డీవాళ్లు చేసే మోసాలు తాళలేక అప్పులు బాధలు పెరిగి, అభిమాన ధనుడైన రైతు గత్యంతరం లేని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నాడనే విషయం అందరకూ తెలిసిందే. వడ్ల గింజలో బియ్యపు గింజలా ఇదో బహిరంగ రహస్యం.
భారతదేశం వ్యవసాయ దేశం కనుక దేశాభివృద్ధి ఏదైనా సరే రైతు కేంద్రంగానే సాగాలనే స్వరాజ్య లక్ష్యానికి అడుగడుగునా తూట్లు పడుతూనే ఉన్నాయి. 1990లో ప్రారంభమైన ప్రపంచీకరణ సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు ముమ్మరమవుతున్న కొద్దీ రైతు రోడ్డున పడటం తీవ్రమవుతున్నది. వ్యవసాయం మనదేశానికి ప్రాణప్రదమైన ఉపాధిరంగమే కాదు, మన భారతీయుల జీవన విధానం, సంస్కృతి. ఈ సత్యాన్ని దోపిడీ పాలకులు విస్మరించారు. అందుకే వ్యవసాయంపై మన పార్లమెంటులో స్థిరమైన ఓ శాస్త్రీయ చర్చ జరగాలన్న జాతీయ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ మాటలు అరణ్యరోదనగానే మిగిలాయి.
ఆగస్టు 15న అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉంటే, మనోజ్‌రాథోడ్‌(35) అనే మహారాష్ట్ర యువరైతు ఈ వ్యవసాయంతో నేను బతకలేకపోతున్నాను మొర్రో అంటూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఒక్క ఏడాదిలో మహా రాష్ట్ర విదర్భ ప్రాంతంలో 1565మంది రైతులు ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు వార్తలొచ్చాయి. ‘అయితే ఇదేం కొత్త సమస్య కాదు, ఎన్నో ఏండ్ల నుండి రైతులు ఇలా చచ్చిపోతునే ఉన్నారు. ఇది మామూలే’ అని సాక్షాత్తూ ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ చాలా తేలిగ్గా పెదవి విరిచారు.మనిషి ప్రాణానికి, అందునా అన్నంపెట్టే రైతన్న బలవన్మరణం పట్ల ఆ శాఖ మంత్రి హృదయ స్పందన ఇదా! రైతుకు ఇస్తున్న విలువ ఇదా? అని నివ్వెరపోవడం కొందరికే పరిమితమైపోయింది. అసహజ మరణం పట్ల మానవ స్పందన ఇంతగా జడత్వానికి లోనవడం విషాదమే కాదు, ఆత్మహత్యా సదృశ్యం కూడా అనేది మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణ.
2021లో దేశవ్యాప్తంగా 10,381 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు సమాచారం. 1995 నుండి దేశంలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు అంచనా. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. దేశ విస్తృత ప్రయోజనాలతో ముడిపడిన కీలకమైన సున్నితాంశంగా దీనిని పరిగణించాలని సుప్రీంకోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది. రైతు రక్షణకు తాత్సారం చేయక వ్యవసాయనికి సంబంధించి ఓ సమగ్ర జాతీయ విధానం రూపొందించాలని కూడా ఉద్ఘాటించింది. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక మన తెలంగాణలో ఈ పదేండ్ల కాలంలో 88వేల మంది రైతులు మృతిచెందినట్టు కాంగ్రెస్‌ నేత రేవెంతరెడ్డి విమర్శిస్తున్నారు. అంటే సగటున ఏడాదికి 8వేల మందికి పైగా మృతి. ఇది కూడా పెద్ద సంఖ్యే. కోట్లాది రూపాయల రైతు బంధు వంటి పథకాల దారి పథకాలదే. ఫలితాల దారి ఫలితాలదే అన్న చందంగా తయారైంది పరిస్థితి.
రైతు కోరుకుంటున్నది నేడు ప్రధానంగా వ్యవస్థాగత సాయం. ముందుగా కల్తీలేని విత్తనాల సరఫరా, సకాలంలో నీరు, విద్యుత్‌ సౌకర్యం, ఇబ్బందులు లేని పెట్టుబడి, కల్తీలేని ఎరువులు, పురుగుమందులు, సేంద్రీయ వ్యవసాయం అయితే తగు వనరులు, పనిముట్లు సరఫరా, అన్నింటికంటే ముఖ్యం. పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర, కొనుగోలు. రైతు ఖాతాలకు వెనువెంటనే డబ్బు జమ. ఇవేమీ రైతుకు పేరాశలు కావు. దక్కవలసిన న్యాయం. కానీ దక్కదు. వీటన్నింటికి కేంద్ర, రాష్ట్ర సర్కారులు రాజకీయ సంకల్పంతో పూచీపడకపోవడం వల్లనే రైతు పరిస్థితి నానాటికి విషమిస్తున్నది. పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడిలా జీవన పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎంతకాలం? రైతుల్నే కాదు, రైతు పక్షపాతి అయిన ప్రతిపౌరుడ్ని వేధిస్తున్న ప్రశ్న ఇది.
అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు కళ్ళముందే చేతికొచ్చిన పంట అతలాకుతలమై లబోదిబో అంటుంటే బీమాకింద ఇచ్చే సొమ్ము ముష్టిలా కన్పిస్తే అది అన్నదాతలను అవమానించినట్లు కాదా..? కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుబేరుల మొండి బకాయిలు పదమూడు లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ రైతుల రుణమాఫీ పట్ల పిల్లిగంతులు వేస్తుంది. ఇకపోతే భారత రైతు సగటు ఆదాయం రోజుకు రూ.277లు అని ఇటీవల ఒక సర్వే తెలిపింది. ఈ నామమాత్ర ఆదాయంతో కుటుంబాన్ని రైతు పోషించగలడా? పిల్లల్ని చదివించుకోగలడా? ఆలోచించాలి. ‘వాస్తవానికి భారతదేశంలో రైతే రాజు కానీ అతడ్ని మనం బానిసగా మార్చాం’ అని మహాత్మాగాంధీ ఏనాడో చెప్పిన మాటలు నిజం కాదా?
పాలకపార్టీలకు ప్రజానుకూలమైన ఏ సిద్ధాంతం లేకుండా పదవీవ్యామోహ రాజకీయాలే పరమార్థం అయినప్పుడు రైతుప్రాణం శ్రేయస్సుకన్నా రైతుల ఓట్లే మిన్న అన్న రాజకీయం ముందుకొస్తున్నది. అప్పుడు రైతు ఆత్మహత్యలన్నీ ఈ పాలనా వ్యవస్థ చేస్తున్న హత్యలగానే భావించడంలో తప్పేముంది? కాగా, ఇప్పుడు మన భారత రైతుపై కార్పొరేట్‌ పడగనీడ దట్టంగా కమ్ముకుంటున్నది. ఫలితంగా మూడుకోట్ల మంది వ్యవసాయాన్ని వీడి ఉపాధికరువై ఇతర రంగాలకు వలసపోయారు. కార్పొరేట్లకు అనుగుణంగా మూడు నల్లచట్టాలు మోడీ ప్రభుత్వం కరోనా కాలంలో అకస్మాత్తుగా తీసుకువస్తే, వాటికి వ్యతిరేకంగా ఏడాదిపాటు ఢిల్లీలో సమరశీల కిసాన్‌ ఉద్యమం నడవడం, 750మంది రైతులు బలికావడం తెలిసిందే కదా! ప్రస్తుతం మన రైతుల్లో నూటికి 86మంది సన్నా, చిన్నకారు రైతులు, మాగాణి-మెట్ట ఏదైనా 10 ఎకరాల్లోపే సాగు చేస్తుంటారు. వీరిలో సింహభాగం కౌలురైతులే. ఈ చిన్న కమతాల భూమి యంత్రీకరణ సాగుకు ఇప్పుడు అడ్డుగా ఉన్నద నేది కార్పొరేట్‌ యజమానుల వాదన. వ్యవసాయంలో యాంత్రీకరణ అమెరికలో 95శాతం, బ్రెజిల్‌లో 75శాతం, చైనాలో 60శాతం ఉంటే. మన దేశంలో 47శాతం మాత్రమేనని వారు వాపోతున్నారు.
ఇంతదాడి జరుగుతున్నా ఇప్పటికీ భారత ప్రజానీకం 55శాతం మంది వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.యాంత్రీకరణలో భాగంగా డ్రోన్‌లు, రోబోల పనివిధానం మన వ్యవసాయంలో కూడా ప్రవేశించింది కాదనలేం.కానీ ఆకాశాన్ని అంటే ఈ యాంత్రీకరణ ఖర్చులను మన చిన్న రైతు అందుకోలేడు. పైగా యాంత్రీకరణ వలన అనూహ్యంగా పెరిగే నిరుద్యోగాన్ని అంచనా వేయడంలోనూ, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడంలోనూ పాలకులు శ్రద్దచూపడం లేదు. ఎందుకంటే వారి దృష్టి అంతా కార్పొరేట్‌ రంగంపైనే. ఎన్నికల బాండ్ల రూపంలో కార్పొరేట్ల నుండి పాలక పార్టీలకు భారీ ఫండ్‌ సమకూరుతుంది మరి. ఈ కారణంగా ఒకనాడు వ్యవసాయంతో స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థగా భాసిల్లిన పల్లెలు శిథిలావస్థకు చేరుకుంటాయి. రైతేరాజు అనుకునే అన్నదాత తన భూమిపైనే బానిసగానో అనాధగానో మున్ముందు మారే పరిస్థితి ఏర్పడటం పట్ల ఆర్థికవేత్తలతో పాటు సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది.
కె. శాంతారావు
9959745723