ఉదాసీనత వద్దు

–  ఎన్నికలయ్యేదాకా నిరంతర శిక్షణ ఇవ్వాల్సిందే
– పోలీసులు, ఎన్నికల సిబ్బందికి కేంద్ర బృందం దిశానిర్దేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్నికల నిర్వహణ విధుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యోగులు ఎవరూ ఉదాసీనంగా వ్యవహరించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు అజయ్ వి నాయక్‌ మంగళవారం ఢిల్లీ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసులు, సిబ్బంది, అధికారులకు నిరంతర శిక్షణ ఇస్తూనే ఉండాలనీ, దీనివల్ల అప్రమత్తత పెరుగుతుందని సూచించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓట్ల వివరాలున్న ఈవీఎమ్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూముల్లో, మరే ఇతర ఈవీఎమ్‌లు భద్రపరచకూడదని హెచ్చరించారు. ఓటరు కార్డుల ముద్రణను ఈనెల 20వ తేదీకల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. మరో కేంద్ర ప్రత్యేక పరిశీలకులు (పోలీస్‌) దీపక్‌ మిశ్రా మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల విధులతో సంబంధంలేని వ్యక్తులు వృథా కాలక్షేపం చేస్తూ తచ్చాడటాన్ని అనుమమతించకూడదని చెప్పారు. నోటిఫై చేసిన పోస్టల్‌ ఓటర్ల తుదిజాబితా ముద్రిత ప్రతిని తప్పనిసరిగా అభ్యర్థులకు, రాజకీయపార్టీలకు ఇచ్చి, వారి నుండి పొందిన రశీదును భద్రపరచుకోవాలనీ, దీనివల్ల కొన్ని వివాదాలను, దురభిప్రాయాలను దూరం చేయవచ్చని సూచించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తేలికగా స్పందించడం లేదా అతిగా స్పందించడం క్షంతవ్యంకాదన్నారు. మరో కేంద్ర ప్రత్యేక పరిశీలకులు (వ్యయం) ఆర్‌. బాలకష్ణన్‌ మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చులపై తప్పనిసరిగా షాడో రిజిస్టర్లను నిర్వహించాలని ఆదేశించారు. పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు కేవలం సాంకేతిక కారణాలతో అనుమతులను తిరస్కరించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి అభ్యర్థులు ప్రజాభిప్రాయం కోరేందుకు అవసరమైన ప్రచారం చేసుకొనేందుకు అవకాశాలు కల్పించాలని చెప్పారు.
నామినేషన్ల సందర్భంగా దాఖలైన అఫిడవిట్లను పరిశీలించి వెంటనే అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు సీఈఓ లోకేష్‌ కుమార్‌, జాయింట్‌ సీఈఓ సర్ఫరాజ్‌ అహ్మద్‌, డిప్యూటీ సీఇఓ సత్యవాణి, డీజీపీ అంజనీ కుమార్‌, రాష్ట్ర నోడల్‌ అధికారి(వ్యయం) మహేష్‌ భగవత్‌, రాష్ట్ర పోలీసు నోడల్‌ అధికారి సంజరు కుమార్‌ జైన్‌ తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు, ఎస్పీలు, కమిషనర్లు పాల్గొన్నారు.
పట్టుబడిన సొత్తు రూ.518 కోట్లు
ఎన్నికల తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న సొత్తు రూ.518.90 కోట్లకు చేరింది. ఈ మొత్తం షెడ్యూల్‌ అమల్లోకి వచ్చిన అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 7వతేదీ ఉదయం 9 గంటల వరకు జరిగిన తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. గడచిన 24 గంటల్లో రూ. 3.21 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామనీ, దీనితో మొత్తం నగదు విలువ రూ.177.32 కోట్లకు చేరిందని వివరించారు. బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినంతో పాటు ఇతర ఆభరణాలు, అక్రమ మద్యం, ఉచిత పంపిణీ కోసం తరలిస్తున్న బియ్యం, చీరలు, కుక్కర్లు, క్రీడాసామాగ్రి వంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.ఈ మొత్తం విలువ రూ. 518 కోట్ల 90 లక్షల 13 వేల 033 ఉంటుందని అంచనా వేశామన్నారు.