‘నాటకాలాడొద్దు.. తమాషాలు చేయొద్దు’

– అంగన్వాడీలపై ఎమ్మెల్యే భాస్కర్‌రావు అనుచిత వ్యాఖ్యలు
– అంగన్వాడీల ఆగ్రహం
నవతెలంగాణ-మిర్యాలగూడ
‘నాటకాలు ఆడొద్దు, తమాషాలు చేయొద్దు.. వినమ్మా వినూ’ అరటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే భాస్కరరావును కలిసి అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అంగన్వాడీలు కోరగా.. ‘ఆగమ్మ ఆగు.. నాటకాలాడొద్దు.. తమాషాలు చేయొద్దు.. వినమ్మ వినూ.. ఇదంతా నా దగ్గర నడవదు.. రైతుబంధు కావాలి, రైతు బీమా కావాలి, రుణమాఫీ కావాలి, పెన్షన్‌ కావాలి. ముఖ్యమంత్రికి అంతా తెలుసు. ఎవరికి ఏమి చేయాలో ఆయనే చేస్తారు. సంబంధిత మంత్రి ద్వారా అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు..’ అంటూ వ్యాఖ్యానించారు.కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైందని కాదని తాము ప్రతి ఎన్నికలోనూ కీలకంగా పని చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నాటకాలు ఆడటం లేదని, మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం తమ దగ్గరికి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు.