తెలంగాణ దేవరగట్టు కారాదు. కర్నూలు జిల్లాలో అదొక నమ్మకం. విజయదశమి రోజు రక్తం చిందేలా జనం ఒకరి తలలు ఒకరు పగులకొట్టుకుంటారు. ఆ రక్తం శివుడికి అభిషేకమవుతుందని, ఆ విధంగా తమకి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని వారి ఆశ. నమ్మకమూను. దాన్లో గెలుపోటములుండవు. ఏ ఆటకైనా, పాటకైనా, చివరికి ‘జల్లికట్టు’లోనైనా ఎద్దు మూపురం పట్టి ఆపగలిగిన యువకుడిని గెలిచినట్టు ప్రకటిస్తారు. దేవరగట్టులో ఆడే ‘దేవరకర్ర’ వీటన్నింటికీ భిన్నం.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఆడుతున్న ఆటను రాష్ట్ర ప్రజానీకం అనుమతిస్తే తెలంగాణ దేవరగట్టవుతుంది. ప్రజలు, ప్రజాసమస్యలు వెనక్కిపోయాయి. దీనికి పరాకాష్ట పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ) పేర జరుగుతున్న లొల్లి. గోడదూకిన ‘పుంజు’ మెడలో వరమాల వేయడం సరైందా? కాదా? అని రేపు కోర్టులు తేలుస్తాయి. సాంప్రదాయాలకు భిన్నమైందా కాదా కూడా తెలుస్తుంది. 2023 డిసెంబరులో తగిలిన షాక్ నుండి తాను తేరుకునేలోగా పోగేసిన ఆ 38 మందిలో నుండి ఎవరూ గోడదూకకుండా చూసుకునేందుకు కేసీఆర్ అవలంభించిన తేలిక పద్ధతి – రేవంత్ సర్కార్ వారమని ఒకసారి, నెలరోజుల్లో పడిపోతుందని ఒకసారి చెప్తూ వచ్చారు. దానికి కారణం ”గ్రాండ్ ఓల్డ్ పార్టీ” (కాంగ్రెస్) ఆకర్షణకు లోనుకాకుండా చూసుకోవడమే! అయినా, పదవులు, దాంతో సంప్రాప్తించే పైసల కోసం దేనికైనా దిగజారేవారు బూర్జువా పార్టీల్లో కావల్సినంత మంది కదలాడే రోజుల్లో కదా వున్నాం మనం.
2014లో ఒకసారి టీఆర్ఎస్కు గెలిచిన స్థానాలకంటే వాపొచ్చింది. 2018లో కేసీఆర్ టీడీపీ తరఫున గెలిచిన వారందరిని గుటకాయ స్వాహా చేశారు. కాంగ్రెస్‌ని 19 నుండి ఆరుకు తెచ్చారు. అప్పుడు టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎంకి పీఏసీ చైర్మెన్ పదవి ఇచ్చారు.
నాడు టీడీపీ తరఫున గెలిచి గులాబీ కండువా కప్పుకున్న ఈ అరెకపూడి గాంధీ ‘మహాత్ముడే’ నేడు గులాబీ వనంలో నుండి హస్తం గూటికి చేరాడు. ఈయనకు ముందూ, వెనుకా గోడదూకేసిన జంప్ జిలానీలున్నారు. కొందరు ‘గోపి’లుగా నిలబడి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం అసలా పార్టీకి భవిష్యత్ ఉంటుందా అన్న సందేహం. దానికి కారణం – రాష్ట్రంలో వరదలొచ్చి – జిల్లాల్లోని – మండలాలు ప్రభావితమైనా మూల విరాట్ ఫామ్‌హౌస్‌లో నుండి బయటికి రాకపోవడం. గతంలో చేసిన సహస్ర చండీయాగాలు నిరుపయోగమూ, నిష్ప్రయోజనమూ కాగా తాజాగా మరో యాగానికి సిద్ధమయ్యారు తప్ప, ప్రజల్లోకి మాత్రం రావటం లేదు.
ఈ పది నెలల్లో వీరికి ప్రజా సమస్యలు పట్టలేదు. కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదని అడగాలంటే పదేళ్ళు నువ్వేం చేశావని కార్మికులు అడగరా? ఆర్టీసీ కార్మికుల్ని అణగదొక్కేస్తున్నారనాలంటే నువ్వేగా ఆ పని చేసిందని టీఆర్ఎస్ అభిమానులు సైతం ఆర్టీసీలో కారాలు, మిరియాలు నూరుతున్నారు. రుణమాఫీ గురించి కాంగ్రెస్‌పై నానాయాగీ చేసే బీఆర్ఎస్ నేతలు ఆ విషయంలో తన రికార్డు ఒకసారి చూసుకోవడం మంచిది. ఒకేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించి నాలుగో ఏడాది రూ.99,999లు రుణమాఫీ పూర్తిచేసింది. అయితే దీన్లో కాంగ్రెస్ ఉద్ధరించింది కూడా ఏమీ లేదు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. మూడు వందల రోజులైనా ఇంకా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పేదానికి ఇతర మంత్రులు చెప్పేదానికి వ్యత్యాసాలున్నాయని అన్ని పార్టీలు, రైతు సంఘాలు మొత్తుకుంటున్నాయి. అసలిదొక బ్రహ్మపదార్థంలా తయారైంది.
కార్మికుల సమస్యలూ, రైతాంగ సమస్యలూ, కౌలు రైతుల, వ్యవసాయ కూలీల సమస్యలూ లేవనెత్తి ఆందోళన చేయగల సత్తా బీఆర్ఎస్కుగాని, బీజేపీకిగాని రాష్ట్రంలో లేదు.
తమ పదేళ్ల పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉంటే ఈ పది నెలల్లో భ్రష్టుపట్టి పోయినట్టు హిజ్ మాస్టర్స్ వాయిస్‌లో పుంఖానుపుంఖాలుగా వార్తలు, వ్యాసాలు వండి వారుస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన కుల దురహంకార హత్యలు రాష్ట్రంలో ఎన్నడూ చూసెరుగం. శ్రుతి, సాగర్ల ఎన్‌కౌంటర్‌తో ప్రారంభమై అనేకచోట్ల ఎన్కౌంటర్లు, ఖమ్మంలో మరియమ్మ హత్య, కోదండరామ్ సార్ ఇంటి తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు ఆయనకు అరదండాలు వేయడం రాష్ట్రం ఆశ్చర్యపోయి చూసింది. కొన్ని సంఘాల హాల్ మీటింగులను సైతం నిషేధించారు. నేరెళ్ళలో దళితులపై ఇసుకమాఫియా దాడి రాష్ట్రం మరిచిపోలేదు. రోహిత్‌వేముల ఆత్మహత్య, మధుకర్, ప్రణరు హత్య వంటివి చూసిన తర్వాత కూడా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలకనిపించడం ఆశ్చర్యకరం. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలువేసి రోడ్లపై నడిపించిన ఘటన రైతాంగాన్ని కలచివేసింది.
రాష్ట్రంలో మత ఘర్షణలు జరగకుండా ఆపటం మంచి విషయమే. కాని ప్రజలపై సాగిన నిర్బంధం, చివరికి ధర్నాచౌక్ రద్దు వంటి వాటిపై కేసీఆర్ అండ్ కో ఏమి సమాధానం చెప్తారు? అంతమాత్రం చేత కాంగ్రెస్ పాలనేదో గొప్పగా ఉందని చెప్పలేం. కాంగ్రెస్ ఇచ్చిన, ఇస్తున్న వాగ్దానాలనేకం ఇంకా అమలుకు నోచుకోకపోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల దశ, దిశ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.