ప్రకటనలు నమ్మి మోసపోవద్దు

ప్రకటనలు నమ్మి మోసపోవద్దు– అప్రమత్తత తప్పనిసరి
– మార్కెట్‌లో నకిలీ ఎరువులు,విత్తనాలు
– అనుమానం వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి
పొలం మీది..కష్టం మీది..ప్రతిఫలం సైతం మీకే దక్కాలి. మీరు పొలం దున్నుతున్నారు అంటే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఎంపిక చేసుకుని పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొనుగోళ్లలో ఎంత జాగ్రత్త పాటిస్తే అంత దిగుబడి వస్తుంది. కొందరు మార్కెట్లో నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నారు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో పత్తి, కంది, మొక్కజొన్న, సోయాబిన్‌, ఇతర పంటలు కలుపుకొని మండలంలో 13 వేల ఎకరాలలో పంటలు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు 100 ఎకరాలలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నట్టు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. అన్ని రకాల పంటలకు 18వేల,556 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అని గుర్తించి, ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు. మండలంలో మొత్తం ఫర్టిలైజర్‌, పురుగుల మందుల, విత్తనాల దుకాణాలు దాదాపుగా 11 ఉన్నాయని అధికారులు తెలిపారు.
నవతెలంగాణ-దోమ
వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్‌ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. బిల్లుపై నెంబర్‌, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్‌ సంతకం ఉండేలా చూసుకోవాలని సూచించారు. మొలకెత్తి, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయాధికారులను సంప్రదించాలన్నారు. బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు. అధికారులు, శాస్త్రవేత్తలు సూచనల మేరకు పురుగుల మందులు వాడాలి. నిల్వ ఉంచిన మందులను వాడొద్దన్నారు. లైసెన్స్‌ ఉన్న దుకాణంలోనే కొనుగోలు చేయాలని సూచించారు. పురుగుల మందు డబ్బులపై చక్రపు ఆకారంలో పురుగుస్థాయిని తెలిపే రంగులు ఉంటాయని తెలిపారు. అత్యంత విషపూరితమైతే నీలం రంగు, స్వల్ప విష పూరితమైతే ఆకుపచ్చ రంగులు గుర్తుంటాయని సూచించారు. మిషన్‌ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులను మాత్రమే వాడాలని తెలిపారు. ఒకవేళ చేతి కుట్టుతో ఉంటే సీసం ఉందో లేదో చూసుకోవాలని తెలిపారు. కొనుగోలు సమయంలో డీలర్‌ రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలని పేర్కొన్నారు. నాణ్యతపై అనుమానాలు ఉంటే వెంటనే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
కల్తీ ఎరువును గుర్తించడం ఇలా..
యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్‌ వంటి ఎరువులు గుళికల రూపంలో ఉంటాయి. ఎరువులు ఇసుక రేణువుల రూపంలో పొటాష్‌, సూపర్‌ ఫాస్పెట్‌ ఫౌడర్‌ రూపంలో ఉంటాయి. ఐదు మిల్లీమీటర్ల నీటిలో చెంచా ఎరువును వేసి బాగా కలపాలి. ఇది స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియాను ఒక చెంచాను ఐదు మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా ఉన్నట్టు గుర్తించాలి. ఇలాంటి మెళుకువలు పాటిస్తే రైతులు మోసపోకుండా ఉంటారని అధికారులు చెబుతున్నారు.
అవగాహన కల్పించాలి
ఎరువులు, విత్తనాలు, మందుల ఎంపికలో రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలి. రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉంది. రైతులు పంటల సాగుకు అనుగుణంగా లైసన్స్‌ కల్గిన పర్టీలైజర్‌ యజమానుల సలహా, సూచనలు మేరకు ఎరువులు, మందులు కొనుగోలు చేసుకోవాలి.
గోపాల్‌ గౌడ్‌ బీఆర్‌ఎస్‌ దోమ మండలాధ్యక్షులు
జాగ్రత్తలు పాటించాలి
నాసిరకం విత్తనాలు కొనుగోలు చేస్తే పంట ఎదుగుదల లేక రైతు ఆర్థికంగా నష్టపోతారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మాయమాటలతో వ్యాపారుల మాటలు నమ్మి మోసపోవద్దు. తక్కువ ధరకే వస్తున్నాయంటే అందులో కచ్చితంగా మోసం ఉంటుంది. రైతులు ఎవరూ ప్రకటనలు నమ్మి మోసపోరాదు.
ప్రభాకర్‌ రావు ఏవో దోమ