– క్షుద్ర రాజకీయాల వలలో చిక్కుకోవద్దు
– మన పారిశుద్ధ్య కార్మికులు దేశానికే ఆదర్శం
– దేశంలోనే అత్యధిక వేతనాలు మన కార్మికులకే
– క్వాలిఫైడ్ కార్మికులను ఏపీఎస్‌లుగా గుర్తించే అంశాన్ని పరిశీలిస్తున్నాం
– పంచాయతీ కార్మికులు తమ ఆందోళనలను విరమించాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన పారిశుధ్య కార్మికులు దేశానికే ఆదర్శమనీ, దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక వేతనాలు మన కార్మికులకే దక్కుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఎవరి మాటలో విని కార్మికులు ఆగం కావొద్దనీ, క్షుద్ర రాజకీయాల వలలో చిక్కుకోవద్దని సూచించారు. పంచాయతీ కార్మికులు తమ ఆందోళలను వీడి వెంటనే విధుల్లో చేరాలని కోరారు. క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించే అంశాన్ని రాష్ట్ర సర్కారు పరిశీలిస్తున్నదనీ, మనసున్న మహారాజైన సీఎం కేసీఆర్ వారి విషయంలో సమయానుకూలంగా సానుకూల నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కార్మికులు తనకున్న మంచిపేరు చెడగొట్టుకోవద్దని హితవు పలికారు. మంగళవారం ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీ కార్మికులకు రూ.500, వెయ్యి రూపాయలు కూడా లేని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అయ్యాక వారి వేతనాన్ని రూ.8,500కి పెంచారని తెలిపారు. ఇటీవల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో వెయ్యి రూపాయలు పెంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పారిశుధ్య కార్మికులను అవమానకరంగా చూస్తున్నారని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్ లో రూ.5,200, ఆంధ్రప్రదేశ్‌లో రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో అసలు వేతనాలే ఇవ్వడం లేదనీ, గ్రామపంచాయతీల నుంచే ఇస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పెయిడ్ వర్కర్లుగా గుర్తిస్తూ కేవలం రూ.500 మాత్రమే ఇస్తున్నారని వివరించారు. కేరళలో కూడా సానిటేషన్ వర్కర్ల పేరుతో ఇంటింటికీ రూ.30 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఒక వార్డులో పని చేసే కార్మికునికి నాలుగైదు వేల రూపాయలకు మించి దక్కడం లేదని పేర్కొన్నారు. దేశమంతా ఇలా ఉంటే, మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో పారిశుధ్య కార్మికుల గౌరవాన్ని పెంచారని తెలిపారు. గ్రామాలను, పట్టణాలను స్వచ్ఛంగా మార్చి, దేశానికి ఆదర్శంగా నిలపడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్ వర్కర్ల పాత్ర అమోఘమని ప్రశంసించారు. పనికి మాలిన కొన్ని రాజకీయ పార్టీలు చేసే క్షుద్ర, స్వార్థ రాజకీయాల వలలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు పంచాయతీ కార్మికులకున్న పేరును చెడగొట్టుకునే విధంగా ధర్నాలు, ఆందోళనలకు దిగొద్దని కోరారు. కొందరు క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తింపు, తదితర డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టిలో అన్ని విషయాలున్నాయనీ, ఆయన స్పందించే వరకూ ఓపికగా ఉండాలని సూచించారు. వెంటనే ఆందోళనలు విరమించి విధుల్లో చేరాలని కోరారు.