ఆరు గ్యారంటీలు చూసి మోసపోవద్దు

ఆరు గ్యారంటీలు చూసి
మోసపోవద్దు– 50 ఏండ్ల దారిద్య్రాన్ని పదేండ్లలో పోగొట్టాం
– ఇందిరమ్మ రాజ్యంలో ఏవర్గమూ బాగుపడలేదు
– కేరళ మాదిరి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా మార్చుచేయాలి
– ప్రజాస్వామ్య పరిణితితో ఆలోచించి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి : ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / జగిత్యాల / వేములవాడ/దుబ్బాక/ఖానాపూర్‌
”కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమంతో 50ఏండ్ల కాంగ్రెస్‌ పాలనా దారిద్య్రాన్ని పదేండ్లలో పోగొట్టుకున్నాం. మళ్లీ వాళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్నారు. ఆ రాజ్యంలో ఏ వర్గమూ బాగుపడలేదు” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో మాయమాటలు చెబుతూ వస్తున్న వారిని ప్రజాస్వామ్య పరిణితితో ఆలోచించి తిప్పికొట్టాలని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, ఖానాపూర్‌ నియోజకవర్గాలలో ఆదివారం జరిగిన ప్రజాఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి ఎక్కడా లేదని, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజాసామ్య పరిణితితో ఓట్లు వేస్తారని, ఇక్కడా అలాంటి వాతావరణమే రావాలని అన్నారు. తనకు పదవులపై ఆశలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన దానికంటే మించిన పదవి ఏముంటుందన్నారు. పేదరికం లేని తెలంగాణను చూడాలన్నదే తన కోరిక అని, ఆ దిశగా రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ వరుసగా పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగలేదని, తాను మాత్రమే ఉన్నానని తెలిపారు. కేరళలో మాదిరిగా వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను తయారు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులు.. అసలు ఆ రాజ్యంలో కరువు కాటకాలే తప్ప జనాలకు ఒరిగిందేమిటో చెప్పాలన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలోనే తన పెండ్లి జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడి ఎమ్మెల్యే రమేష్‌బాబు నిజాయితీపరుడని, అయినా ఆయనపై కోర్టులో ఉన్న దిక్కుమాలిన కేసు మూలంగా ఆయన స్థానంలో విద్యావంతుడు లక్ష్మినర్సింహారావుకు అవకాశం ఇచ్చామని తెలిపారు.
‘రైతుబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్‌. కాంగ్రెస్‌ది భూమాత కాదు.. భూ మేత. రఘునందన్‌కు ఏకాణా పైసా తెల్వదు. ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజల ఆయుధం. ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి. దుబ్బాక అభివద్ధి నేను చూసుకుంటా’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘దుబ్బాకను కాపాడే అవసరం ఉందనే కొత్త ప్రభాకర్‌ రెడ్డిని నిలబెట్టా. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే నెలలోపే ఆర్డీఓ ఆఫీసు, రింగ్‌ రోడ్డు, కళాశాలను మంజూరు చేస్తా’ అని అన్నారు. ఉప ఎన్నికల్లో నేను రాలే.. అందుకే ఓడిపోయాం.. నేను వచ్చుంటే రఘునందన్‌ పని వొడిషిపోవు.. నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చి ‘ఏకాణా పని చేయలేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై నిప్పులు చెరిగారు. మోసం చేసిన కాంగ్రెస్‌ కు ఓటేస్తే గోసపడతామన్నారు. కాంగ్రెస్‌ రూపొందించిన ఆరు గ్యారెంటీలను నమ్మి వారికి ఓటేస్తే మోసపోతారని ఖానాపూర్‌లో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఓటు వేసేటప్పుడు ఆగమాగం కావద్దని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దేశంలో రైతుబంధును పుట్టించింది తానేనని గుర్తుచేశారు..