– మోడీ, ఈడీ ఫార్ములా బీజేపీది
– నూకలు తినమన్న ఆ పార్టీతో నూకలు బుక్కించాలి
– రాష్ట్రంలో గత పదేండ్ల కిందటి పరిస్థితులు..
– కాంగ్రెస్‌వి 420 వాగ్దానాలు
– దళితబంధు ఇవ్వకపోతే సచివాలయం ఎదుట ధర్నా చేస్తా
– రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం..
– చేవెళ్ల బీఆర్ఎస్ను గెలిపించాలి : ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్
– నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మతం ముసుగులో భావోద్వేగాలు రెచ్చగొడుతున్న మత పిచ్చిగాళ్ల మత్తులో పడి ఆగం కావొద్దని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో బీజేపీ మోడీ, ఈడీ ఫార్ములాతో ఉందని, వస్తే బీజేపీలోకి రావాలి.. లేదంటే జైలుకు పోవాలన్న ఫార్ములాను అమలు చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ అసమర్థుల ఉచ్చులో నుంచి బయట పడాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు కేసీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సభ ద్వారా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో పదేండ్లు అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికైనా మేలు చేసిందా అని ప్రశ్నించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి .. మత పిచ్చిలేపడం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని తనపై బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి చేసినా రైతుల ప్రయోజనాల కోసం మీటర్లు పెట్టలేదన్నారు. దాంతో కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన రూ. 30 వేల కోట్లు ఇవ్వలేదన్నారు. ఎన్ని తిప్పలు పెట్టినా రైతులు ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని అడిగితే.. కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రజలకు నూకలు తినడం నేర్పించండి అని హేళన చేశారని గుర్తు చేశారు. నూకలు తినమన్న బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు బుక్కించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో గత పదేండ్ల కిందటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు. ‘తెలంగాణ రాకముందుకు కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్స్ తగలబడటం చూశాం, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తొలగించి రైతులకు నాణ్యమైన 24 కరెంట్ ఇచ్చాం. కేసీఆర్ పక్కకు పోగానే కరెంట్ ఎక్కడ పోయింది’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచం గర్వించదగ్గ మిషన్ భగీరథను చేపట్టి.. ఇంటింటికీ తాగునీరు అందించామని తెలిపారు. ఇప్పుడు ఎందుకు తాగునీటి కష్టాలు వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చిందన్నారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీ మరిచి లూటీ చేస్తోందని ఆరోపించారు. దళితులకు రూ. 12 లక్షల దళిత బంధు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దళితబంధు అమలు చేయకపోతే లక్ష మంది దళితలతో సచివాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. రైతులకు బోనస్ ఇవ్వకపోతే యుద్ధం చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలో బీజేపీకి, కాంగ్రెస్‌కు బుద్దిచెప్పాలన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అవసరమని.. ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వంపై కొట్లాడి హక్కులను సాధించుకోవచ్చాన్నారు. అందుకు లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపిస్తే.. బీసీల బతుకుల్లో మార్పు వస్తోందన్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులను ఈ ప్రాంత ప్రజలకు పరిచయం చేసిందే బీఆర్ఎస్ అని తెలిపారు. రంజిత్‌రెడ్డి పార్టీ మార్పుపై కేసీఆర్ విమర్శలు చేశారు. ఈ ప్రాంతం నుంచి మరోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీలు సూరభి వాణి, ఎగ్గె మల్లేష్, దాయనంద్ గుప్త, బీఆర్ఎస్ నాయకులు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.