– ప్రజలకు ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యం విజ్ఞప్తి
– శంకుస్థాపనపై అయా గ్రామస్తుల అందోళనకు యత్నం
– పోలీస్ పహార మద్య నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-బెజ్జంకి
ఇథనాల్ పరిశ్రమ నిర్మాణంపై ఎవ్వరికీ అపోహలొద్దని, పరిశ్రమ నిర్మాణంలో అందరూ భాగాస్వాములవ్వాలని నర్సింహులపల్లి, ముత్తన్నపేట గ్రామాల ప్రజలకు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం మండల పరిధిలోని పోతారం శివారులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి యాజమాన్యం పోలీస్ పహార మద్య శంకుస్థాపన చేసింది. అంతకు ముందు యాజమాన్యం పరిశ్రమ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సమాచారం తెలుసుకున్న నర్సింహుల పల్లి, ముత్తన్నపేట గ్రామస్తులు అందోళన చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని ఎక్కడ వారిని అక్కడే నిర్భందించారు. యాజమాన్యం అయా గ్రామాల రైతులతో చర్చలు నిర్వహించింది.
మేము మీతో పాటు ఇక్కడే జీవనం సాగిస్తాం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం చేపడుతున్నామని, పరిశ్రమ వల్ల వాతావరణం, భూగర్భ జలాలు, రైతులు సాగు చేసే భూములకు, పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లదని నర్సింహుల పల్లి, ముత్తన్నపేట గ్రామాల గ్రామస్తులకు యాజమాన్యం ప్రతినిధులు సూచించారు. మీతో పాటు మేము ఇక్కడే జీవనం సాగిస్తామన్నారు. పరిశ్రమ నిర్మాణంపై అపోహలున్న అయా గ్రామాల గ్రామస్తులు ఇతర ప్రాంతాల్లో నిర్మించిన నిర్మాణాలను సందర్శించేల ఏర్పాట్లను చేస్తామని యాజమాన్యం సూచించారు.