కాకూడదు…సం’క్షామం’

Can't be... 'Peace'‘సంక్షేమం, అభివృద్ధి… ఈ రెండూ మా ప్రభుత్వానికి రెండు కండ్లు. వాటిని జోడెద్దుల్లాగా పరుగులు పెట్టిస్తాం…’ సరిగ్గా 20 ఏండ్ల క్రితం కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్న మాటలివి. తెలంగాణ ఏర్పడ్డాక దశాబ్ద కాలంపాటు అధికార పీఠానికి దూరంగా ఉన్న ఆ పార్టీని గద్దెమీద కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తొమ్మిది నెలల క్రితం అవే మాటలను వల్లెవేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షేమం, ప్రజా పాలనలో అందరి సమస్యలనూ పరిష్కరిస్తామంటూ ఆయన భరోసానిచ్చారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ (ప్రగతి భవన్‌)తో పాటు జిల్లాల్లోనూ ‘ప్రజావాణి’ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి విదితమే. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించటం, వాటిని కంప్యూటరీకరించటం, మెసేజ్‌ల రూపంలో రశీదు (ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌) లనివ్వటం వరకూ ఓకే.
కానీ ఆ తర్వాతే కథ ముందు కు సాగటం లేదని వినికిడి. రేషన్‌ కార్డులకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఓ నిర్ణయమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. రేవంత్‌ సర్కారు కొలువుదీరిన కొత్తలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ తదితరాంశాల కోసం నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించిన విషయం మనకు ఎరుకే. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణి ద్వారా మొత్తం 55 వారాల్లో 5.30 లక్షల దరఖాస్తులు అందినట్టు సర్కార్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ఆ కార్యక్రమానికి ఇప్పటి వరకూ 66 వేల అర్జీలు వచ్చాయన్నది అధికారిక వర్గాల లెక్క. వీటిలో అత్యధికం ఇండ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఉపాధి కల్పనకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఆయా దరఖాస్తుల్లో లక్షకు పైగా పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని అదే అధికారులు విడుదల చేసిన బులెటిన్‌ చెబుతోంది. పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు… ఉన్న దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా మీనమేషాలు లెక్కిం చటం విడ్డూరం. అక్టోబరులో రేషన్‌ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామంటూ మంత్రివర్గ ఉపసంఘం చెప్పటం మరీ హాస్యాస్పదం. అంటే ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులను ఇంతవరకూ చూడలేదా? చూసినా వాటిని ఏం చేయాలో తెలియలేదా? అనే సందేహాలు రాకమానవు. డిసెంబరు ఏడో తేదీ నాటికి కాంగ్రెస్‌ కొలువుదీరి ఏడాది పూర్తి కాబోతున్న స్థితిలో… ఇంకా కమిటీలు, కాలయాపనలు అంటే జనంలో విశ్వసనీయతను తమంతట తాము తగ్గించుకున్నట్టే.
గత పదేండ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీ(టీ)ఆర్‌ఎస్‌… ఆ కాలంలో ఒక్కటంటే ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వకుండా పేదల సహనానికి పరీక్ష పెట్టింది. దీంతో ఆ కార్డు ప్రాతిపదికగా ఉన్న అనేక ప్రయోజనాలను వారు పొందలేకపోయారు. ఇప్పుడు రేవంత్‌ సర్కారు కూడా అదే రకమైన పోకడపోతే… ప్రజల్లో అసంతృప్తి పెరగటం ఖాయం. కేసీఆర్‌ జమానాతో పోలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం, ఆందోళనలు చేసుకునే హక్కు, ప్రజా ప్రతినిధులను, ఇంకా చెప్పాలంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రినే కలిసేందుకు అపాయింట్‌మెంట్లు దొరకటం హర్షించదగ్గ విషయాలే. కానీ ప్రజా ప్రతినిధులను కలిసినంత ఈజీగా ప్రజల సమస్యలకు పరిష్కారాలు దొరక్కపోవటమే ఇబ్బంది కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ కుర్చీని లాక్కుని, ఆ సీటు మీద తాను కూర్చోవాలన్నట్టు వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌ చెప్పినంత తీవ్ర స్థాయిలో కాకపోయినా అనేకానేక సమస్యలు రాష్ట్రంలో పేరుకుపోయాయి.
గురుకులాల్లోని టీచర్లకు రెండు నెలలుగా వేతనాలు రాకపోవటం, పిల్లలకు నాణ్యమైన, పౌష్టికాహారం అందక పోవటం, మహిళల ఉచిత ప్రయాణానికి బస్సులు సరిపోక పోవటం, ఆస్పత్రుల్లో వైద్యులకు సరైన భద్రత లేకపోవటం, బదిలీల్లో సీనియర్లను జిల్లాలకు పంపించటం, అక్కడ సరైన మౌలిక వసతులు, సదుపాయాలు లేకపోవటం, 33 జీవో వల్ల వైద్య కళాశాలల్లో అడ్మిషన్లలో జాప్యం జరగటం వీటిలో ముఖ్యమైనవి. ఇవిగాకుండా రైతు రుణమాఫీ అసంపూర్ణం, రైతు భరోసా ఇంత వరకూ ఇవ్వకపోవటం, ఎన్నికల్లో హామీనిచ్చిన విధంగా సామాజిక పింఛన్లను పెంచకపోవటం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ముచ్చటే లేకపోవటం కూడా రేవంత్‌ సర్కార్‌ను అప్రదిష్ట పాల్జేస్తున్నాయి. ఇవన్నీ పేదలు, రైతులకు సంబంధించిన కీలకాంశాలు.. వారి సంక్షేమానికి చెందిన విషయాలు. ఆయా పథకాలు, కార్యక్రమాలను విస్మరిస్తే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తెరిగితే దానికే మంచిది.