
ఎక్కడ ఏ ప్రమాదం జరిగిన ఎవరికి ఏ ఆపద వచ్చిన ముందుగా ఫోన్ చేసేది 108 వాహనానికే. అలాంటి 108 వాహనానికే ఆపద వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. నిత్యం ఎంతో మందిని ప్రమాదాల బారిన నుంచి కాపాడటానికి ఆస్పత్రికి తరలించే 108 వాహనమే మోరాయిస్తే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చేది ఎవరు? ప్రమాదాల బారిన పడిన వారి ప్రాణాలను రక్షించేది ఎవరు..?? దౌల్తాబాద్ మండల కేంద్రంలో 108 వాహనాలను మొరాయించడంతో వాహనాన్ని సిబ్బంది తోస్తున్నారు. ఈ చిత్రాన్ని చూస్తుంటే పాత సినిమాలోని “బండి కాదు మొండి ఇది సాయం పట్టండి” అనే పాట గుర్తుకు వస్తుంది. దౌల్తాబాద్, రాయపోల్ రెండు మండలాలకు కలిపి ఒకే ఒక్క 108 వాహనం ఉంది. అది కూడా ఇలా మొరాయించడంతో అత్యవసర సమయంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాయపోల్ మండలానికి 108 వాహనాన్ని కేటాయించాలని మండల ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. పలు పత్రికలలో వార్తలు కూడా ప్రచురించబడ్డాయి. అయినా రాయపోల్ మండలానికి నూతన 108 వాహనం మంజూరు కాలేదు. నూతన 108 వాహనం దేవుడెరుగు ఉన్న వాహనమైన పూర్తిస్థాయి కండిషన్ లో ఉండేటట్లు చూడాలని ప్రజలు వాపోతున్నారు.