– కేసీఆర్ మదినుంచే ‘సీతారామ’ రూపకల్పన
– కొద్దిరోజుల్లోనే గృహలక్ష్మీ పథకం అమలు
– సత్తుపల్లికి మరో రూ.24కోట్లు సింగరేణి నిధులు
– సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
– కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-సత్తుపల్లి
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయనున్న సీతారామ ప్రాజెక్టు డిజైన్‌ను ఎవరూ రూపకల్పన చేయలేదని, ఆ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మదినుంచి వచ్చిన ఆలోచనలతోనే సీతారామ రూపుదిద్దుకుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. బుధవారం స్థానిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాలు ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర ప్రసంగించారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు అన్ని తీసుకొని శరవేగంగా త్వరలో పనులు మొదలు పెట్టడం జరుగుతుందన్నారు. మరికొద్ది రోజుల్లోనే 3వేల మందికి గృహలక్ష్మీ పథకం ద్వారా ఇండ్లు కట్టుకొనే కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఈ క్రమంలోనే మంజూరు పత్రాలను త్వరలో లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని సండ్ర తెలిపారు. సత్తుపల్లి అభివృద్ధికి మరో 24కోట్లు సింగరేణి నిధులు మంజూరయ్యా యన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సత్తుపల్లి నియోజకర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు.
నాలుగు ముఠాల కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు…
నాలుగు ముఠాలుగా ఏర్పడి పొంతనలేని కరపత్రాలను ముద్రించుకొని ఇంటింటికి పంచుకుంటూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే సండ్ర ప్రజలను కోరారు. 55యేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలను ఏ విధంగా ఉద్దరించారో విజ్ఞులైన ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు చేయలేని పథకాలను తెలంగాణలో అధికారమిస్తే చేస్తామంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 1000లకు మించి పింఛన్ పథకాలు లేవన్నారు. ఇక్కడిస్తామంటూ ప్రజలను నమ్మించాలనుకోవడం అవివేకమవుతుందన్నారు.
జిల్లాకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు ఇమ్మని కేసీఆర్‌ను కోరాం…
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో పంటలు ఎండకుండా ఉండేందుకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి నీళ్లను పాలేరుకు రప్పించి కనీసం రెండు తడులకన్నా నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరడం జరిగిందని సండ్ర తెలిపారు. ఈ నేపధ్యంలో జలవనరులశాఖ సీఈ వరంగల్ జిల్లా నుంచి పాలేరు జలాశయానికి నీళ్లని ఏ విధంగా తీసుకురావాలో కసరత్తు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ వనమా శ్రీనివాసుదేవరావు, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, కమిషనర్ కోడూరు సుజాత, తహసీల్దారు కూర్మా యోగేశ్వరరావు, నాయకులు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, రఘు, విజయనిర్మల, నడ్డి ఆనందరావు, అమరవరపు శ్రీకృష్ణారావు, గఫార్, మేకల నరసింహారావు, వేములపల్లి మధు పాల్గొన్నారు.