– అధికారులు అప్రమత్తంగా ఉండాలి : వేసవి ప్రణాళిక సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారాల్ని ప్రజలు నమ్మవద్దనీ, ఇలాంటి ప్రచారాల పట్ల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మారిన క్రమంలో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వచ్చే వేసవిలో నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. బుధవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ వేసవి యాక్షన్‌ప్లాన్ అమలుపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిస్కంలు, జెన్‌కో, ట్రాన్స్‌కోలకు చెందిన ఉన్నతాధికారులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో మాట్లాడాలనీ, విద్యుత్ సమస్యలపై కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తూ, వినియోగదారుల కాల్స్‌ను రికార్డ్ చేయాలని ఆదేశించారు. అత్యధిక విద్యుత్ డిమాండ్ దృష్ట్యా సరఫరా, నిర్వహణ, ఓవర్ లోడ్‌తో ఇబ్బందులు వస్తున్నాయనీ, వీటిని సమన్వయం చేసుకొని పరిష్కరించాలని చెప్పారు. కమర్షియల్ ఏరియాల్లో విద్యుత్ నిర్వహణ పనుల కోసం రాత్రివేళ లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) తీసుకోవాలని సూచించారు. నిర్వహణ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తే, ఆ సమాచారాన్ని ముందుగా వినియోగదారులకు సంక్షిప్త సందేశాల రూపంలో తెలియజేయాలన్నారు. గత ఏడాదితో ఇప్పటి విద్యుత్ డిమాండ్‌ను పోలుస్తూ ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇచ్చి, ప్రచారం చేయాలని సూచించారు. గత పాలకులు తక్కువ పనిచేసి, ప్రచారం ఎక్కువ చేసుకున్నారనీ, అసత్యాలు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో దక్షిణ డిస్కం సీఎమ్‌డీ ముషారఫ్ ఫరూఖీ, ఉత్తర డిస్కమ్ సీఎమ్‌డీ కే వరుణ్‌రెడ్డి, టీఎస్ ట్రాన్స్‌కో జేఎమ్‌డీ శ్రీనివాసరావు, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.
బదిలీ వద్దు
టీఎస్ రెడ్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ డీ అమరేందర్ రెడ్డి బదిలీని నిలిపివేయాలని ఆలిండియా రెనువబుల్ ఎనర్జీ ఎంటర్‌ప్రైన్యూర్స్ ఆసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. బుదరవారం రాత్రి వారు రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి, ఆ మేరకు వినతి పత్రం సమర్పించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డిని బదిలీ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.16 కోట్ల సబ్సిడి నిధులు జాప్యం అవుతాయని తెలిపారు. రెడ్కో నుంచి కేంద్ర ప్రభుత్వంతో సబ్సిడి నిధులను రాబట్టేందుకు ఆయనే సమన్వకర్తగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ వివిధ దశల్లో జరుగుతున్న పనులను కూడా ఆయనే సమన్వయం చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్య ఘర్ యోజన పథకం, పీఎం కుసుమ్ అమలులో సైతం జాప్యం కలిగే అవకాశం ఉన్నందున కనీసం మూడు నెలలైనా బదిలీని నిలిపివేయాలని కోరారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఆసోసియేషన్ జనరల్ సెక్రటరీ చారుగుండ్ల భవాని సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీనాథ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు మోరంపూడి ప్రసాద్, సత్య, శ్రీకాంత్, ఆశోక్, గణేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.