రష్యాపై దాడికి ఉక్రెయిన్‌ని నిందించొద్దు : మక్రాన్‌

పారిస్‌ : రష్యాలో 130మందికి పైగా మృతి చెందడానికి కారణమైన దాడి చేసింది ఇస్లామిక్‌ స్టేట్‌ అని తమ వద్ద సమాచారం వుందని, ఆ దాడికి కారణం ఉక్రెయిన్‌ అంటూ నిందలు వేయడం ద్వారా ఈ దాడిని ఉపయోగించుకోవద్దని ఫ్రాన్స్‌, రష్యాని హెచ్చరించింది. ఈ మేరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ విలేకర్లతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి కుట్ర పన్నింది, అమలు చేసింది ఇస్లామిక్‌ స్టేట్‌ అని ఫ్రాన్స్‌ వద్ద నిఘా వర్గాల సమాచారముందని అన్నారు. ఫ్రాన్స్‌లో కూడా ఈ తీవ్రవాద గ్రూపు అనేక దాడులకు పాల్పడిందన్నారు. ఈ దాడిని, సందర్భాన్ని ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని రష్యా భావిస్తే అందుకు వ్యతిరేకమైన ఫలితాలే వస్తాయని రష్యా అది గుర్తించాలని మాక్రాన్‌ హెచ్చరించారు.