– ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-దుబ్బాక
కాంగ్రెస్ పార్టీ లీడర్లకు బీఆర్‌ఎస్ మీద కోపముంటే తమతో కొట్లాడాలని, కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పొలాలు ఎండకముందే కాలువల్లో నీళ్లు ఇవ్వాలని కోరారు. బుధవారం మండల పరిధిలోని వెంకటగిరి తాండలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు రూ.20 లక్షలు, ఎంపీ లాడ్స్ నిధులు రూ.5 లక్షల వ్యయంతో శిలాజీ నగర్ గ్రామంలో ఎంఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులు రూ.20 లక్షల వ్యయంతో, అచ్చుమాయిపల్లి గ్రామంలో ఎమ్‌ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.13 లక్షలు, గ్రామపంచాయతీ నిధులు రూ.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను సర్పంచ్లు పాతులోత్ పెంటమ్మ బాలకిషన్, మాడూరి శ్రీనివాస్, సోమారపు స్వప్న స్వామి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, జడ్పిటిసి కడ్తాల రవీందర్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆదివాసి, లంబాడీలను పట్టించుకున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కారు మాత్రమేనని, కేసీఆర్ హయాంలోనే తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని గుర్తు చేశారు. ప్రపంచమే నివ్వెరపోయేలా కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించారన్నారు. నేటి కాంగ్రెస్ సర్కారు కూడవెల్లి వాగులో నీళ్లు విడుదల చేయమంటే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా పంటల సాగుకు మల్లన్న సాగర్ కాలువల ద్వారా నీళ్లు విడుదల చేయాలని ఇటీవలే మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశానన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతామన్నారు. మల్లన్న సాగర్ కాలువల్లో భూములు పోయే వారికి తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతి కష్ణ, పలువురు సర్పంచులు జనార్దన్ రెడ్డి, భాస్కర్, ఎంపిటిసి ఎల్.రాంరెడ్డి, ఉప సర్పంచ్‌లు మోహన్, శంకర్ నాయక్, పర్స దేవరాజ్ ముదిరాజ్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.