– పుట్టెడు కష్టాల్లో సఫాయిలు
– అధ్వానంగా మారిన పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి
– జీతాల చెల్లింపులో ఉన్నతాధికారుల అలసత్వం
– నిధులు లేవని చేతులు దులుపుకుంటున్న వైనం
– మండలంలో రూ 8.16 కోట్ల మేర బకాయిలు
నవతెలంగాణ-పెద్దవంగర:
పని బారెడు వేతనం బెత్తడు’ అన్నట్లుగా మారింది గ్రామపంచాయతీ కార్మికుల పరిస్థితి. దీనికి తోడు సకాలంలో వేతనాలు అందక వీరు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని ఇన్ని కాదు. మండలంలో పారిశుద్ధ కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు ఏకంగా 19 నెలలుగా పేరుకుపోయాయి. కార్మికులకు వేతనాల చెల్లింపులో ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారని మండల వ్యాప్తంగా పలువురు చర్చించుకుంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సుమారు 8.16 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని జీపీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనాలే, అయినా అవి కూడా సంవత్సరాల తరబడి చెల్లించకపోవడంతో కార్మికులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి రోడ్డు మీద పడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు జీతాలు చెల్లించాలని వేడుకుంటున్నారు.
గ్రామం: కార్మికుల సంఖ్య: పెండింగ్ నెలలు:
1). అవుతాపురం 5. 4
2). బీసీ తండా. 2. 6
3). బావోజీ తండా 1. 5
4). బొమ్మకల్. 4. 5
5). చిన్నవంగర. 3. 6
6). చిట్యాల. 4. . 4
7). గంట్లకుంట. 6. 11
8). కాన్వాయిగూడెం 1. 13
9). కొరిపల్లి. 3. 0
10). ఎల్బీ తండా. 3. 05
11). మోత్య తండా. 2. 05
12). పడమటి తండా 1. 10
13). పెద్దవంగర. 8. 3
14). పోచంపల్లి. 8. 19
15). పోచారం. 2. 10
16). రాజామాన్ సింగ్ తండా 2. 7
17). రామచంద్రు తండా. 3. 05
18). రెడ్డికుంట తండా. 2. 10
19). ఉప్పెరగూడెం. 5. 5
20). వడ్డెకొత్తపల్లి. 4. 6
మొత్తం: కార్మికులు (69). నెలలు (139).
మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 69 మంది మల్టీపర్పస్ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో పారిశుధ్య కార్మికులు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాటర్ మెన్లు, డ్రైవర్లు ఉన్నారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పంచాయతీ సిబ్బందికి రూ.1000 వేతనం పెంచుతున్నట్లు అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. వేతనాల పెంపుతో కార్మికులు సంతృప్తి చెందలేదు. నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త పంచాయతీల ఏర్పాటు, జనాభా ప్రతిపాదికన పారిశుధ్య కార్మికుల నియామకం, వేతనాల పెంపు వంటి పరిణామాలు జరిగాయి. పంచాయతీల్లో డ్రెయినేజీలు, రోడ్లు శుభ్రం చేయడం, ఎవెన్యూ ప్లాంటేషన్ కు నీళ్లు పట్టడం, గుంతలు తవ్వడం వంటి తదితర పనులు జీపీ కార్మికులే చేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు, ఇతర ఖర్చులతో పంచాయతీ కార్మికులు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు సకాలంలో వేతనాలు అందకపోవడం వల్ల నానావస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
పోచంపల్లి కార్మికులకు 19 నెలలుగా జీతాలు లేవు..
మండలంలోని పోచంపల్లి గ్రామంలో 8 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. గ్రామ జనాభా సుమారు 2 వేల పైచిలుకు. వీరిలో గత పాలకుల నిర్లక్ష్యం, తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడడానికి ముందు నుంచే గ్రామంలో 8 మంది జీపీ కార్మికులు కొనసాగుతున్నారు. ఆ తదుపరి పోచంపల్లి గ్రామం నుండి పడమటి తండా, రాజామాన్ సింగ్ తండా నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఆ గ్రామ పంచాయతీలకు వీరిలో కొంత మందిని కేటాయించగా, తండా వాసులు అడ్డుకోవడంతో అప్పటి నుంచి నేటి వరకు పోచంపల్లి గ్రామంలో 8 మంది కార్మికులు కొనసాగుతున్నారు. వీరికి జీతం చెల్లించడం పంచాయతీ కార్యదర్శికి పెద్ద సవాల్ గానే మారింది. గ్రామంలోని పారిశుద్ధ కార్మికులకు అక్టోబర్ 2022 నుండి వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాగా 19 నెలలుగా జీతాలు అందక పోవడంతో అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, తమకు వెంటనే జీతాలు చెల్లించాలని వేడుకుంటున్నారు. కాగా కాన్వాయిగూడెం సిబ్బందికి 13 నెలల జీతం చెల్లించాల్సి ఉంది.
మండలంలో 8.16 కోట్ల వేతన బకాయిలు..
మండలంలో 29 వేల పైచిలుకు జనాభా కలదు. 20 గ్రామాల్లో మొత్తం 69 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరికి ఒక నెల వేతనాల చెల్లింపు కోసం సుమారు రూ. 5. 87 లక్షలు నిధులు అవసరం. కానీ మండల వ్యాప్తంగా ఏప్రిల్ నెల వరకు 139 నెలల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉండగా, 8.20 కోట్ల రూపాయలు మండలంలోని పారిశుద్ధ కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది.
జీతాలు వెంటనే చెల్లించాలి.
గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలి. కార్మికులకు ఇచ్చే వేతనాలు సకాలంలో చెల్లించని కారణంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలవుతున్నాం. గత 19 నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. అక్టోబర్ 2022 నుండి జీతాలు రావాలి. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు నెలనెలా చెల్లించేలా అధికారులు చొరవ తీసుకోవాలి.
———-ఓరుగంటి సోమనర్సయ్య (కారోబార్- పోచంపల్లి).
జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలి:
జీవో నెంబర్ 51 ప్రకారం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల మాదిరిగానే తమకూ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కారోబార్, బిల్ కలెక్టర్ వంటి ఉద్యోగాల్లో పంచాయతీ కార్మికులకు అవకాశం కల్పించాలి. తమను పర్మినెంట్ చేయడంతో పాటుగా, కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి.
———కసిరబోయిన కుమారస్వామి (సీఐటీయూ మండల అధ్యక్షుడు -పెద్దవంగర).
నిధులు లేకపోవడం వల్లే…
జీపీ కార్మికుల వేతనాల పెండింగ్ వాస్తవం. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. బదిలీల్లో భాగంగా ఇటీవలే మండలానికి ఎంపీడీవో గా వచ్చాను. సుమారు గత రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక నిధులు రాకపోవడం, కేంద్ర ఆర్థిక నిధులతో కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐ చెల్లింపు, శానిటేషన్ పనులు చేపడుతున్నాం. నిధులు ఉన్న జీపీ సిబ్బందికి జీతాలు క్రమంగా చెల్లిస్తున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సిబ్బంది జీతాల చెల్లింపుకు ప్రత్యేక చొరవ చూపుతాం.
– వేణుమాధవ్ (ఎంపీడీవో-పెద్దవంగర)