ఆత్మహత్యలొద్దు

Don't commit suicide– హక్కులు పోరాడి సాధించుకోవాల్సిందే
– నిరుద్యోగ సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
– మోడీ మౌనం…కేసీఆర్‌ కొర్రీలతో యువతరంలో నిరాశ
– విద్యార్థులు, ఉద్యోగార్ధులపై పెరుగుతున్న ఒత్తిళ్లు
– ప్రవళిక ఆత్మహత్య హెచ్చరికే!
‘పోరాడితే పోయేదేం లేదు…బానిస సంకెళ్లు తప్ప’ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ యువతరానికి స్ఫూర్తి నిచ్చే నినాదం. సమస్య ఏదైనా ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకోవాల్సిందే తప్ప, ప్రాణత్యాగాలు చేసి జీవితాల్ని అర్థంతరంగా ముగించడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఆ బలిదానాల త్యాగాన్ని రాబందులు పీక్కుతిని, బలుస్తాయే తప్ప, సామాన్యుడికి ఒరిగే ప్రయోజనం ఏముంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వమైనా, ఇంటికో ఉద్యోగం అంటూ యువతరానికి ఆశలు కల్పించి, ఉన్న ఉద్యోగాలు కూడా సక్రమంగా భర్తీ చేయకుండా ‘కొర్రీలు’ వేసి, కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వమైనా ‘దొందూ దొందే’…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న ప్రవళిక ఆత్మహత్య యువతరంలోని నైరాశ్యాన్నీ, జీవితంపై భయాన్ని చెప్పకనే చెప్తున్నది. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడొద్దనీ, వారి భవిష్యత్‌ తమకంటే మెరుగ్గా ఉండాలనే కాంక్షతో అప్పులు చేసి, సిటీల్లో పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రుల కడుపుకోతలు చూస్తుంటే హృదయం ద్రవించకమానదు. ఈ ఏడాదిలో రాజస్థాన్‌లోని కోటాలో పోటీ పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే కారకులు ఎవరు? రాష్ట్రంలో గ్లోబరీనా తప్పిదంతో ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే బాధ్యత తీసుకున్నది ఎవరు? ఈ పరిస్థితులుకు కారణాలు ఏంటనే దానిపై కదా చర్చ జరగాల్సింది. ఆ పాలకుల్ని కదా నిలదీయాల్సింది. యువతరం మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని కోల్పోతే ఓ తరం వెనుకబాటుకు గురవుతుంది. దీన్ని సరిదిద్దాల్సిందే. ఆత్మహత్యలు పరిష్కారం కాదనీ, పోరాడి ఉద్యోగాలు సాధించకుందామని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు నిరుద్యోగులకు పిలుపునిస్తున్నాయి. ప్రవళికది ఆత్మహత్య కాదనీ, అది ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేస్తున్నాయి.
నిరుద్యోగులకు శాపం… మోడీ మౌనం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నది. అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. పదేండ్లు అధికారం చలాయించినా, ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల్లో కలిపి 9.64 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 39.77 లక్షలు కాగా, వాటిలో ఏటా వందల సంఖ్యలో రిటైర్‌మెంటు అవుతున్నవారు ఉన్నారు. ఆ స్థానాల్ని భర్తీ చేయట్లేదు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,82,191 ఉద్యోగాలను భర్తీ చేసింది. అంటే ఏడాదికి లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇంకా 9.64 లక్షల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక 2021లో 13,089 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. 2020లో 12,526 మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు చనిపోయారు. ఏటా విద్యార్థులు, ఉద్యోగార్థుల మరణాల సంఖ్య పెరుగుతున్నది. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతేడాది 15 మంది చనిపోయారు. మోడీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొర్రీల కేసీఆర్‌….
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది. విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున దానిలో భాగస్వాముల య్యారు. 2014 జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. గడచిన తొమ్మిదేండ్లలో నియామకాల ప్రక్రియ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నది నిష్టుర సత్యం. తమ హయాంలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో గతేడాది ప్రకటించారు. అందులో దాదాపు 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 16,604 పోస్టుల భర్తీకి పోలీసు నియామక బోర్డు, 9.210 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఆథ్వర్యంలో రాతపరీక్షలను నిర్వహించారు. పోలీసు కొలువులకు అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయ్యింది. కానీ హైకోర్టు ఆదేశాలతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఉద్యోగాల భర్తీలో విఫలమై అభాసుపాలవుతున్నది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మొదటి సారి రద్దయ్యింది. ఆ తర్వాత నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో బయోమెట్రిక్‌ చేపట్టకపోవడం, ఓఎంఆర్‌లో అభ్యర్థుల వివరాలు పొందుపర్చకపోవ డంతో హైకోర్టు మరోసారి రద్దు చేసింది. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గ్రూప్‌-2, డీఎస్సీ రాతపరీక్షలు వాయిదా పడ్డాయి. అసలు నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడే ‘కొర్రీ’కి ఆస్కారమిచ్చేలా ఉంటున్నాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఫలితంగా సొంతూళ్లు వదిలి పట్టణాల్లో లక్షలు కట్టి కోచింగ్‌లు తీసుకుంటూ, నోటిఫికేషన్లు రద్దు, పరీక్షల వాయిదాలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. సమయం వృధా కావడం, తల్లిదండ్రులు పంపిన డబ్బులు అయిపోతుండడం, ఉద్యోగాలు రాకపోవడం వంటి కారణాలతో వారు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తలెత్తింది. ఎన్‌సీఆర్బీ నివేదిక ప్రకారం 2014 నుంచి 2021 వరకు తెలంగాణలో 3,600 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి : డీవైఎఫ్‌ఐ
ప్రవళికది ఆత్మహత్య కాదనీ, ప్రభుత్వ హత్యేనని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశ్‌ విమర్శించారు. గతేడాది 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేసింది తప్ప నియామకాలను చేపట్టలేదని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనలో టీఎస్‌పీఎస్సీ ఘోరంగా విఫలమైందని తెలిపారు. నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను గద్దెదించాలి : ఏఐఎస్‌ఎఫ్‌
రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే కేసీఆర్‌ను గద్దెదించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. ఆ ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.
నిరుద్యోగులను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌ : ఏఐవైఎఫ్‌
నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలీ ఉల్లా ఖాద్రీ, కె ధర్మేంద్ర విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పాలనంతా ఆత్మహత్యలు, కన్నీటి పర్యంతమేనని తెలిపారు. ప్రవళిక మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : ఏఐడీఎస్‌వో
ప్రవళిక ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐడీఎస్‌వో రాష్ట్ర కార్యదర్శి ఎ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అవినీతిమయమైన టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలనీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని తెలిపారు.
ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : ఎస్‌ఎఫ్‌ఐ
ప్రవళికది ఆత్మహత్య కాదనీ, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి నాగరాజు విమర్శించారు. నిరుద్యోగులపై హైదరాబాద్‌లో పోలీసులు లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని తెలిపారు. ఆమె కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని కోరారు. నిరుద్యోగులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.