హాలీవుడ్‌ని అనుకరించొద్దు : పవర్‌స్టార్‌

Don't copy Hollywood : Powerstarరామ్‌ చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జీ స్టూడియోస్‌, దిల్‌ రాజు ప్రొడక్షన్‌ బ్యానర్స్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఏపీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్యే బత్తుల బలరాం, ఎమ్మెల్సీ హరి ప్రసాద్‌, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌, కుడా చైర్మన్‌ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ ఈవెంట్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, ‘సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్‌ సినిమాలు తీస్తుంటారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను. రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించాడు. ఈ ‘గేమ్‌ ఛేంజర్‌’ ట్రైలర్‌ చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. సినిమాను సినిమాలా చూడండి. టికెట్‌ రేట్లు డిమాండ్‌ అండ్‌ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్‌ మీద జీఎస్టీ ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు. హాలీవుడ్‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. రామ్‌ చరణ్‌ మా బంగారం. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు కలగాలని బాబారుగానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నారు. రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ, ‘సినిమాలో నేను గేమ్‌ ఛేంజర్‌ని కావొచ్చు. కానీ ఈ రోజు ఇండియన్‌ పాలిటిక్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ రియల్‌ గేమ్‌ ఛేంజర్‌’ అని తెలిపారు.