గురునానక్‌, శ్రీనిధిలో సిబ్బందికి అన్యాయం చేయొద్దు

– ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రికి టీపీటీఎల్‌ఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గురునానక్‌, శ్రీనిధి ప్రయివేటు విశ్వవిద్యాల యాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అన్యాయం జరగ కుండా చూడాలని తెలంగాణ ప్రయివేటు టీచర్లు, లెక్చరర్ల ఫెడరేషన్‌ (టీపీటీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రిని సోమవారం ఆ సంఘం కన్వీనర్‌ ఎ విజరుకుమార్‌, నాయకులు సిద్దార్థ్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. అనుమతి లేకుండానే గురునానక్‌, శ్రీనిధి విద్యాసంస్థలు ప్రవేశాలు చేపట్టిన నేపథ్యంలో సిబ్బందిని తీసేయ కుండా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బోధించడానికి లెక్చరర్లు, ప్రొఫెసర్లను నియ మించాయని తెలిపారు. వారి ఉద్యోగాలను తీసేసే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే సెలవు లిచ్చారని తెలిపారు. మరికొంత మందికి సగం జీతమే ఇస్తున్నారని వివరించారు. చాలా మంది లెక్చరర్లు, ప్రొఫెసర్ల జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గురునానక్‌, శ్రీనిధి విద్యాసంస్థలు తప్పుడు పద్ధతుల్లో వ్యవహరించి ఉన్నత విద్యాశాఖను, విద్యార్థులను మోసం చేశాయని విమర్శించారు. కాబట్టి ఆ యాజమాన్యాలే సిబ్బందికి బాధ్యత వహించాలని తెలిపారు. వారికి అన్యాయం చేస్తే అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు.