వెనక్కి తగ్గం…

– జీపీ కార్యదర్శుల మానవహారం
– కొనసాగుతున్న సమ్మె
– ఉద్యోగాలు తీసేస్తామంటూ నోటీసులివ్వడంపై ఆగ్రహం
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. సమ్మె నిర్వీర్యానికి ప్రభుత్వం నోటీసుల పేరుతో బెదిరింపులకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మానవహారం, ప్రదర్శన రూపంలో నిరసన తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరాలో వైరా, కొణిజర్ల, సింగరేణి, ఏన్కూర్‌, తల్లాడ మండలాల కార్యదర్శులు ఎంపీడీఓ కార్యాలయం నుంచి మధిర రోడ్డులోని గురుకుల పాఠశాల వరకు ప్రదర్శన నిర్వహించారు. మధ్యలో క్రాస్‌ రోడ్డులో మానవహారం నిర్వహించారు. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించి ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, సీనియర్‌ నాయకులు పారుపల్లి కృష్ణారావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, చప్పిడి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కార్యదర్శుల ఉద్యోగం ఊస్టింగ్‌ అంటూ బెదిరింపులకు దిగటం, నోటీసులు ఇంటి తలుపులకు అంతించటం వంటి నిరంకుశ చర్యలను ఖండించారు. ఖమ్మం రూరల్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి నాయుడుపేట వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. మధిరలో జెడ్పీ చైర్మెన్‌ లింగాల కమల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లిలో వైస్‌ఎంపీపీ కొదుమూరు పుల్లారావు మద్దతు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల సమ్మె 12వ రోజు కొనసాగింది. ఆమనగల్‌ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షల్లో కందుకూరు, ఆమనగల్‌, మహేశ్వరం, కడ్తాల్‌, తలకొండపల్లి మండలాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. వారికి పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.