ఈపీఎస్‌ చందాలతో కార్పొరేట్ల కడుపులు నింపొద్దు

Don't fill corporate bellies with EPS subscriptions– 8న హైదరాబాద్‌లో పెన్షనర్ల రాష్ట్ర సదస్సు : టాప్ర రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈపీఎస్‌ చందాలతో కార్పొరేట్ల కడుపులు నింపొద్దని తెలంగాణ ఆల్‌ పెన్షనర్లు, రిటైర్డ్‌ పర్సన్ల అసోసియేషన్‌ (టాప్ర) రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈపీఎస్‌ పెన్షనర్లు గౌరవంగా బతికేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల ఎనిమిదిన హైదరాబాద్‌లో ఈపీఎస్‌ పెన్షనర్‌ సంఘాల జాతీయ సమన్వయ కమిటీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు. అదేరోజు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈపీఎస్‌ పెన్షనర్ల రాష్ట్ర సదస్సును జరుపుతామని వివరించారు. పెన్షనర్ల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను చేస్తామన్నారు. టాప్ర ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి మాట్లాడుతూ కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెరిగే ధరలకనుగుణంగా కరువు భత్యం ఇవ్వాలని కోరారు. పెన్షన్‌ మంజూరు విషయంలో ప్రొరాటా పద్ధతిని రద్దు చేయాలన్నారు. ఈ విధానం వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని చెప్పారు.
పెన్షన్‌ లెక్కించడంలో వేతన సీలింగ్‌ ఎత్తేయాలని అన్నారు. కట్‌ ఆఫ్‌ తేదీతో సంబంధం లేకుండా అందరికీ హయ్యర్‌ పెన్షన్‌ను మంజూరు చేయాలని కోరారు. పెన్షనర్లందరి ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే చూసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో టాప్ర కన్వీనర్‌ ఎస్‌ బ్రహ్మచారి, కోశాధికారి నాగేశ్వర్‌రావు, ఎం జనార్ధన్‌రెడ్డి, ఎల్‌ దుర్గాప్రసాద్‌, కె వైకుంటరావు, శంకర్‌రావు, కె రాధాకృష్ణ, ఎం కృష్ణారావు, జి విజరుకుమార్‌, కె నర్సప్ప, జి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.