– ఏ చిన్న అవకాశాన్నీ వదలొద్దు…కాంగ్రెస్, బీజేపీలను ఏకిపారేయండి
– నేతలు,ప్రజా ప్రతినిధులకు గులాబీ బాస్ ఆదేశాలు
– వరస ప్రెస్‌మీట్లు..నిరసనలు,ధర్నాల పరంపర అందులో భాగమే
– ఎన్నికల దాకా బీఆర్‌ఎస్ వ్యూహమిదే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి…’ అనే నానుడిని ఎవరు ఎంత బాగా ఒంటపట్టించుకున్నారో తెలియదుగానీ… గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఈ సూత్రాన్ని పక్కాగా పాటిస్తున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ఎక్కడ దొరికితే అక్కడ ఏకిపారేయండంటూ ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారని తెలుస్తోంది. అది రాజకీయమైనా, ప్రజా సమస్యలైనా, విధానపర నిర్ణయాలైనా వదలకుండా ఆ రెండు పార్టీలను గుక్క తిప్పుకోకుండా చేయాలంటూ సీఎం సూచించారు. తనతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదలుకుని.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఇదే సూత్రాన్ని పక్కాగా పాటించి అమలు చేయాలంటూ కారు సారు ఆదేశాలు జారీ చేశారు. అందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించినట్టు వినికిడి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ఉచిత విద్యుత్‌పై ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన అక్కడి నుంచి రావటానికి ముందే, క్షణాల మీద స్పందించిన బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరస ప్రకటనలు, ట్వీట్లతో కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తే.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జంక్షన్‌లో ఏకంగా రాస్తారోకోకు దిగారు. ఆ పరంపరలో జిల్లాల్లో సైతం మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌తోపాటు మరికొందరు నిరసనలతో హోరెత్తించారు. ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మెన్లు సైతం అదే బాటలో తమకు అప్పగించిన పనులను పూర్తి చేశారు. ఆ తర్వాత మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితోపాటు దాసోజు శ్రావణ్‌లాంటి నాయకులు సైతం మీడియా సమావేశాలను నిర్వహిస్తూ వచ్చారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై తొలుత ఈనెల 11, 12 తేదీల్లో నిరసనలకు పిలుపునిచ్చి అమలు చేసిన బీఆర్‌ఎస్.. తాజాగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద సోమవారం నుంచి పది రోజులపాటు చర్చా వేదికలు నిర్వహించాలంటూ సూచించటం గమనార్హం. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా మంత్రి కేటీఆర్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు విభజన హామీల అమల్లో వైఫల్యాలపై, బీజేపీ విధానాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ బాస్ ఆదేశాల్లో భాగంగానే నేతలందరూ కాంగ్రెస్, బీజేపీలపై ఈ రకమైన ఎదురుదాడి చేస్తున్నారని తెలుస్తోంది. కర్నాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్నదనే చర్చ కొనసాగుతుండటం, అధికారంలోకి రాలేకపోయినా నడ్డా, మోడీలను రప్పించటం ద్వారా హడావుడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ ఈ రకమైన వ్యూహాన్ని రచించారని బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. ‘శాసనసభ ఎన్నికల దాకా ఈ ఎదురుదాడిని రోజూ కొనసాగించాల్సిందేనంటూ సారు చెప్పారు…’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు నేతలంతా అదే పనిలో పడటం గమనార్హం.