”తల్లిపాలు గుడువ తనువొందు మోదమ్ము తల్లిపదము నుడువ తావినొసగు మాతభాష యందు మనదేశ సంస్కతి ఇమిడి యున్నదోయి పథ్వినిండ” అంటూ మాతభాష ఆత్మీయతను, గొప్పదనాన్ని పద్యములో పోతపోసారు ఓ మహాకవి. మాతభాష మాధుర్యాన్ని, తెలుగుభాష సౌరభాన్ని పద్యాలు, పాటల ద్వారా ఎందరో కవులు కీర్తిస్తూనే ఉన్నారు. మాతభాష ఆవశ్యకతను రచయితలు తమ కలాలతో సజిస్తూ, గళాలు విప్పుతూనే ఉన్నారు. అయినా మాతభాషకు ఆశించినంత అభివద్ధి జరగడం లేదనే చెప్పాలి. అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం సందర్భంగా… మాతభాష గూర్చి మరొక్కసారి ప్రస్తావించుకుందాం.
అమ్మ ఒడిని ముద్దాడిన క్షణం నుండి ఉంగాఉంగా అంటూ జిలిబిలి పలుకులు పలుకుతూ… తారంగం తారంగం అంటూ శరీరకదలికల ఆనందంతో… చందమామ రావే, జాబిల్లిరావే అనే పాటలను వింటూ, ఆకసాన జాబిల్లి సొగసులను చూస్తూ అమ్మచేతి కమ్మనైన గోరుముద్దలు తింటూ.. వానవాన వల్లప్పా యంటూ బుడిబుడి అడుగులతో చిందులు వేస్తూ.. జ్యోఅచ్యుతానంద జోజోముకుందా లాలిపరమానంద రామగోవిందా జోజో” లాంటి లాలిపాటల జోలలో హాయిగా నిదురలోకి జారుకుంటూ అమ్మభాషలోని ఆప్యాయతను, కమ్మదనాన్ని అనుక్షణం ఆస్వాదిస్తూనే ఉంటాం. ధ్వనులను వినడం, పలకడం అమ్మద్వారానే నేర్చుకుంటాం. మనం వినే మొదటిమాట అమ్మమాటే. అమ్మనే మనకు మొదటి గురువు కూడా. అమ్మ ఒడే మనకు తొలిబడి అని చెప్పుకోవచ్చు. అమ్మద్వారా పరిసరాలను తదనంతరం ప్రపంచాన్ని పరిచయం చేసుకునేది మాతభాషలోనే. ప్రకతిలో పులకిస్తూ, అనుభూతులను ఆఘ్రాణిస్తూ, అనుబంధాలను పెనవేసుకుంటూ జీవనగనమం సాగించేది మాతభాష వల్లే. మాతభాషకు అంతటి మహత్వం ఉంది.
”తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
ఎల్లనపుల గొలువ ఎరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స” అంటూ.. తెలుగుభాష వైభవాన్ని అద్భుతమైన భావాలతో ఎలుగెత్తి చాటారు ‘శ్రీకష్ణదేవరాయలు’ ఆముక్తమాల్యదలో.
”తెనుగుదనము వంటి తీయదనము లేదు/ తెనుగు కవులవంటి ఘనులు లేరు/ తెనుగుతల్లి సాధుజన కల్పవల్లిరా/ లలిత సుగుణజాల తెలుగుబాల” అంటూ తెలుగుభాషా మాధుర్యాన్ని తెలియజెప్పారు జంధ్యాల పాపయ్యశాస్త్రి.
వేలయేండ్ల నుండి వెలుగొందుతూ సూక్తులు, సామెతలు, పొడుపుకథలు, కవితలు, కథలు, ఛందస్సు, అలంకారాలు, యతులు, ప్రాసలు, పద్యాలు, గేయాలు, కావ్యాలతో అత్యంత రమణీయతను సంతరించుకొని రసరమ్యమైన పదపల్లవములతో వీనులకు విందైన, పసందైన తేనె కన్నా తియ్యనైన తెలుగుభాష సౌందర్యం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. మన మాతభాషను మనం గౌరవించుకుందాం. గుండెకు హత్తుకొని ప్రణమిల్లుదాం.
భాష అంటే ఏమిటి?
మనసులోని భావనలను ఇతరులకు తెలియపరిచే సాధనమే భాష. మన అభిప్రాయాలను సహజసిద్ధంగా ప్రకటించడానికి భాష అవసరం. మనలోని ఆలోచనలను బహిర్గతపరుస్తూ వాటికి ఒక రూపమివ్వడానికి భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అనుభవాలను పంచుకునేందుకు భాష ఒక సంకేతం.
‘భాష సాంస్కతిక వైభవాన్ని కాపాడుకోవడం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలమని’ యునెస్కో అభిప్రాయం. 1999 నవంబరు 17న ఫిబ్రవరి-21ని అంతర్జాతీయ మాతభాషాదినోత్సవంగా యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుండి ప్రపంచ దేశాలు అంతర్జాతీయ మాతభాషాదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించాయి.
మాతభాష దినోత్సవ ఉద్దేశం :
భాషాసంపద, సాంస్కతిక వైభవంపై అందరికీ అవగాహన కల్పిస్తూ భాషా వైవిధ్యాన్ని పరిరక్షిండమే దీని ఉద్దేశం. ప్రపంచీకరణ ప్రక్రియవల్ల కొన్ని భాషలు ముప్పులో ఉండటమో, ఉనికిని కోల్పోయి కనుమరుగయ్యే ప్రమాదమో లేకపోలేదు. భాషలు అంతరించిపోతున్న కొద్దీ ప్రపంచంలోని ఆచారవ్యవహారాలు, చరిత్ర, సాంస్కతిక వైవిధ్యం క్షీణించే అవకాశం ఉంది. సంప్రదాయాలు, ఆలోచనా విధానాలు, భావవ్యక్తీకరణ దేశభవిష్యత్తును నిర్ణయించే వనరులు తగ్గిపోతాయి. ప్రపంచంలో మాట్లాడే 6000 భాషల్లో దాదాపు 43% భాషలు అంతరించిపోతున్నాయని ఐకరాజ్యసమితి గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతరించిపోతున్న భాషలను కాపాడుకోవడం కోసం, అన్ని భాషల పరిరక్షణ కోసం అంతర్జాతీయ మాతభాష దినోత్సవాన్ని ప్రతియేట నిర్వహించుకుంటున్నాం.
నేపథ్యం:
1947 సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ విభజన జరిగింది. ఆ తర్వాత 1948 సంవత్సరంలో పాకిస్తాన్ ఉర్దూ భాషను జాతీయ భాషగా ప్రకటించింది. బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్థాన్)లో బెంగాలీ మాట్లాడేవారే అధికంగా ఉండటం చేత బెంగాలీభాష గుర్తింపుకై అక్కడి ప్రజలు భాషా ఉద్యమం చేపట్టారు. 1948 ఫిబ్రవరి లో ‘నరేంద్రనాథ్ దత్త’ రాజ్యంగసభలో బెంగాలీ భాషకు ప్రాముఖ్యత కల్పించాలని డిమాండ్ చేసారు. ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసనలు, ఉద్యమాలు ముమ్మరం చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికి ఢాకా నగరంలో 144 సెక్షన్ విధించి, ర్యాలీలను నిషేధించింది. 1952 సంవత్సరం ఫిబ్రవరి-21 న ఉద్యమంలో పాల్గొన్న ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు విద్యార్థులు మరణించారు. కొంతమంది గాయపడ్డారు.
1954 సంవత్సరం మే 8న పాకిస్తాన్ రాజ్యాంగసభలో బెంగాలీ భాషను రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. ఈ విధంగా వారి మాతభాషకు గుర్తింపు లభించింది. ప్రజల మాతభాష కోసం ప్రాణాలర్పించిన అపూర్వ ఘట్టంను (బంగ్లా భాషోద్యమం), మానవభాష సాంస్కతిక హక్కులను పురస్కరించుకొని యునెస్కో ఫిబ్రవరి-21ని ‘అంతర్జాతీయ మాతభాష దినోత్సవం’గా ప్రకటించింది. అలా… మాతభాషయొక్క పరిరక్షణ జరిగింది.
మాతభాష విశిష్టత :
అమ్మనుండి మొట్టమొదటగా మనం నేర్చుకునే భాషే మాతభాష (అమ్మ భాష). ఒకప్రాంతంలోని వారందరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే భాష ఆ ప్రాంతీయభాషగా పరిగణించబడుతుంది. మాతభాష ఆ ప్రాంతంలోని ఆచారాలు, జీవన విధానాలు, సంస్కతి, కళలను ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి అప్రయత్నంగా, సహజసిద్ధంగా స్పందించేది మాతభాషలోనే. మాతభాష ద్వారా మనసుల మధ్య మమకారం పెరిగి వ్యక్తుల మధ్య అన్యోన్యత సిద్ధిస్తుంది.
మాతభాష ఉపయోగాలు:
మన యొక్క రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు, వ్యాపార లావాదేవీల పురోగతికి, సజనాత్మక ఆలోచనలను పంచుకోవడానికి, భావప్రకటనకు, భావప్రసరణకు, సమాచార సేకరణ-వితరణకు మాతభాష ఉపయోగపడుతుంది.
సమాజ అభివద్ధిలో, హక్కుల సాధనలో, నాణ్యమైన విద్యను పొందడంలో, జ్ఞాన సమాజాన్ని నిర్మించడంలో, సాంస్కతిక వారసత్వాన్ని కాపాడుకోవటంలో భాషలు ముఖ్యపాత్ర వహిస్తాయి. మానసిక వికాసానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి భాష ఉపయోగపడుతుంది.
2024-థీమ్ :
అంతర్జాతీయ మాతభాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో నిర్వహించుకుంటాం. ఈ థీమ్‌ను ప్రతియేడాది యునెస్కో ప్రకటిస్తుంది.
2022సంవత్సరంలో ‘బహుభాషా అభ్యాసం కోసం సాంకేతికత ను ఉపయోగించడం’ అనే థీమ్, 2023 సం.లో ‘బహుభాషా విద్య – విద్యను మార్చాల్సిన అవసరం’ అనే థీమ్, ఈ ఏడాది (2024) ‘అంతరించిపోతున్న భాషలను సంరక్షించడం, బహుభాషా విధానాన్ని ప్రోత్సహించడం, భాషా వారసత్వాన్ని కొనసాగించడం కోసం లక్ష్యాలను నిర్దేశించడం’ అనే థీమ్‌తో నిర్వహించుకుంటున్నాం.
మాతభాష పరిరక్షణ:
మాతభాష పరిరక్షణ మనందరి బాధ్యత. ఒక జాతి నాగరికత, సంస్కతి, జీవనవిధానాన్ని ప్రతిబింబించేది మాతభాష. మాతభాషలో ప్రావీణ్యం సంపాదించిన వారు ఇతర భాషలను, విషయ పరిజ్ఞానాన్ని తొందరగా అర్థం చేసుకొని నేర్చుకోగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతభాషలో బోధన జ్ఞాన సముపార్జనకు దోహదం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి స్నేహపూర్వక వాతావరణంలో విద్యాభ్యాసానికి అనుకూలిస్తుంది. చదువు పట్ల అభిరుచిని పెంచి విద్యాలయం వైపుగా అడుగులు వేయిస్తుంది. చిన్నప్పటినుండే పిల్లలకు కథలు చెప్పడం, బాలగేయాలు నేర్పడం, మాతభాషలోనే మాట్లాడటం ద్వారా ఇంటినుండే మాతభాష విలువను ఇనుమడింపజేయవచ్చు. మాతభాష దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, వివిధ కార్యాలయాలో భాషపై సజనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మాతభాష ప్రాముఖ్యతను చాటిచెప్పొచ్చు. నేటి యువతకు మాతభాషపై ఆసక్తిని రేకెత్తించి, మాతభాష వినియోగం పై దష్టిని మరల్చవచ్చు. విదేశీ పర్యటన, విజ్ఞాన సముపార్జన కోసం అన్యభాషలు ఎన్ని నేర్చినా, మాతభాషను ఎన్నటికీ మరువవద్దు. అమ్మ భాష అమ్మపాల వంటిది. అమ్మపాలు ఆరోగ్యానికి ఎంత శ్రేష్టమో అమ్మభాష సమాజశ్రేయస్సు మూలస్తంభం. ప్రభుత్వ కార్యకలాపాలు, పరిపాలన నివేదికలు, తదితర విషయాలలో మాతభాషను ఉపయోగించడం, ఇంట్లో మాతభాషనే మాట్లాడటం ద్వారా భాషను పదిలంగా కాపాడుకోవచ్చు. మాతభాష విశిష్టతను, ప్రయోజనాలను భావితరాలకు తెలియజేస్తూ…
మాతభాష లోనే సంభాషిద్దాం
మనభాషకు పునరుజ్జీవం పోద్దాం.
– అయిత అనిత, 8985348424