దోపీడీకి గురికావద్దు

– ఎంఎన్‌జేకు రండి…అంతా ఉచితమే : ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అవగాహన లేకపోవడంతో క్యాన్సర్‌ పేరుతో జరిగే దోపిడీకీ ప్రజలు బలవుతున్నారని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కొన్ని చోట్ల చేస్తున్న రోగ నిర్ధారణ పరీక్షలకు కనీసం విలువ ఉండటం లేదని చెప్పారు. అవసరం లేకపోయినా పెట్‌-సీటీని సూచిస్తూ చేయిస్తున్నారని చెప్పారు. ప్రసార మాధ్యమాల్లో క్యాన్సర్‌ రోగ నిర్ధారణ అంటూ తప్పుడు ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని హెచ్చరించారు. ఇంటర్నెట్‌లో దొరికే సమాచారంలో ఏది తప్పు? ఏది సరి? నిర్ధారించుకోలేక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆమోదిత వాస్తవిక సమాచారంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్‌ రోగ నిర్దారణ, చికిత్సకు సంబంధించి ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలున్నప్పటికీ కొంత మంది ప్రయివేటు వైపునకు వెళుతున్నారని తెలిపారు. అక్కడికి వెళ్లి మొత్తమంతా గుల్ల చేసుకున్నాక ….చివరి దశలో ఎంఎన్‌జేకు వస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు మీలా జయదేవ్‌, డైరెక్టర్‌ సంగీత తదితరులు పాల్గొన్నారు.