చేసే పని మనమే చేసుకోవాలె గని ఇంకెవలో వస్తరని ఎదిరి చూస్తె పని కాదు, పోదు. అలా ‘ఎవరో వస్తరు ఏదో చేస్తరు’ అని గాకుండా ఉండే ఆలోచననే ‘ఆయనకు ఎసరు పెట్టుకుని కూసుంటె అయితదా’ అని అనుకుంటరు. పూర్వం అన్నం వండేందుకు నీళ్లు వేడి చేసి బియ్యం అందులో వేసి ఉడికించేవారు. ఆ వేడి చేస్తున్న నీళ్లనే ఎసరు అంటరు. ఇంట్ల బియ్యం లేవు. ఆయన అంటే మొగడు ఇగ తెస్తడని పొయ్యి మీద ఎసరు పెట్టుకొని కూర్చోవడం గూర్చి ఈ సామెత వివరిస్తుంది. ఆయనకు బియ్యం తెద్దామని ఉంటది గని పైసలు లేవు, పని లేదు. ఆయనది అంతా ‘ఆరాటమే గాని పోరాటం లేదు’ అని అంటరు. ఎంతని చెప్పుతం ఆ సట్టమే అంత అనుకుంట ‘ఆ తానులనదేనాయె ఈ పేల్క’ అని మదనపడుతరు. తాను అంటే పెద్ద బట్టల సుట్ట. అందులోని బట్ట అంత ఒక్క తీరే ఉంటదని అంటరు.
ఇలా శానిగ అలనివాల్లు ‘ఆ తాటి మొద్దులదే ఈ పేడు’ అంటరు. మొద్దుకు పోలిక చేసుకుని అందులోని పేడులన్నీ ఒక్క తీరే అనే అర్ధంలో వాడుతరు. సామెత చెప్పుతే విషయం పూర్తిగా అర్ధమైంది. ఇగ మరింత సాగదీసే ముచ్చట అవసరం లేని విషయం చెప్పవచ్చును.
కొందరు ప్రగల్బాలు బాగా చెప్పుకుంటరు. చిన్నగ ఏదైనా సహయం చేసి పెద్దగ ప్రచారం చేసుకుంటరు. ఇసొంటి వాల్లను ‘ఆలికి అన్నం పెట్టి ఊరంత ఉద్దరించినట్లు’ పోజు కొడతరు అంటరు. ఎవరి కుటుంబ సభ్యుల భోజనాలు వాల్ల బాధ్యత. కాని తన భార్యకే భోజనం పెట్టి ఊరంత అన్నం పెట్టినట్లు కొందరు ప్రచారం కానిస్తరు.
ఇయ్యాల రేపు పని కన్నా ఎక్కువ ప్రచారందే నడుస్తుంది.
– అన్నవరం దేవేందర్, 9440763479