
ర్యాగింగ్ అనే రాంగ్ రూట్ ల్ వెళ్తే ప్రమాదమే కాని ప్రయోజనం లేదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎస్.ఎస్.ఆర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యానభ్యసించే సమయాలలో ఇతరాత్ర సమయాలలో తోటి విద్యార్థులను వేధింపులకు గురిచేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. మానసిక, శారీరక హింసకు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. పాఠాశాలలో, కళాశాలలో విద్యను అభ్యసిస్తు ఉన్నతస్థాయికి ఎదగాలని ఉద్బోధించారు.ఒకవేళ ర్యాగింగ్ కు అలవాటు పడితే వారి భవిష్యత్ అంధకారబంధూరమేనని వివరించారు.విద్యతో విజ్ఞానం సమపార్జించుకోవాలని ఆ దిశగా విద్యార్థుల నడవడిక ఉండాలని ఆమె అన్నారు. పౌరుల దైనందిన జీవితం చట్టాలతో ముడిపడి ఉన్నదని చట్టబద్ధంగా నడవడిక ఉండాలని సూచించారు. న్యాయసేవ సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్,నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ మాట్లాడుతు విద్య విద్యార్థులను విజ్ఞానవంతులను చేస్తే ,ర్యాగింగ్ అధోగతి పాలుచేస్తుందని వివరించారు. ప్రతి విద్యార్థి చట్ట పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టపరిదిలో జీవన విధానం అలవర్చుకోవాలని వారు తెలిపారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్,విద్యార్థిని, విద్యార్థులు, లెక్చరర్లు పాల్గొన్నారు.