రాష్ట్రాన్ని మళ్ళీ దోపిడీ వర్గాలకు అప్పజెప్పొద్దు

నవతెలంగాణ-కోదాడరూరల్‌
రాష్ట్రానికి మళ్ళీ దోపిడీ వర్గాలకు అప్పజెప్పొద్దని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆవునూరి మురళి అన్నారు.జాగో తెలంగాణ ఆధ్వర్యంలో జిల్లాలో రెండువ రోజు కొనసాగుతున్న ఓటు చైతన్య యాత్ర కార్యక్రమం నియోజకవర్గకేంద్రానికి శనివారం చేరుకుంది.యాత్రకు వామపక్షనాయకులు, విద్యావంతులు, మేధావులు, ప్రజలు ఓటర్ల చైతన్య యాత్రకు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓటు అనే ఆయుధంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్న యువకులపై, ప్రజలపై పోలీసులు కేసులు పెట్టి భయపెడుతున్నారని, ఇలాంటి వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రభత్వ పాఠశాలలను చాలాచోట్ల విద్యార్థులు లేక మూసివేశారన్నారు.సీఎం కేసీఆర్‌కు ప్రజలపై ప్రేమ లేదని కుటుంబ స్వలాభమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.మన బిడ్డల జీవితాలు మారాలంటే నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధికల్పించే వాళ్లకే ఓటు వేయాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని సూచించారు.ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి పదేండ్లవుతున్నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాలు లేవన్నారు.పేపర్‌ లీకేజీలతో, పరీక్షల రద్దుతోనే కాలం దాటేస్తుంది తప్పా ఉద్యోగాల ఊసు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తలేదన్నారు.టీఎస్పీఎస్సీలో యువకులు,నిరుద్యోగులు 30లక్షల మంది అప్లై చేసుకున్నారని,కానీ కనీసం 50,000 మంది కూడా ఈరోజు వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జాగో తెలంగాణ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కమిటీ సభ్యులు వినాయకరెడ్డి, నైనాల గోవర్ధన్‌, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జేవీ.చలపతిరావు, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు, జేఏసీ కన్వీనర్‌ రాయపూడి చిన్ని, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హన్మేష్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, కేఎస్‌ ప్రదీప్‌, ఉదయగిరి, మట్టి మనుషులు పాండురంగారావు, డి.రవి, చందర్‌రావు,ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు తదితరులు పాల్గొన్నారు.