ఈ వ్యాసాలను నిన్నా, మొన్నా చదివిన వాళ్ళల్లో కొందరు, ఫేస్ బుక్కుల్లోనూ, వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఒక వాదన చేస్తున్నారని తెలిసింది. ”రతన్‌టాటా, పెట్టుబడిదారుడే. అయినప్పటికీ ఉదారంగా విరాళాలు ఇస్తున్నాడు గదా? అదే, అదానీ, అంబానీ వంటి ఇతర పెద్ద పెట్టుబడిదారులు ఏమిస్తున్నారూ? అలాంటప్పుడు, టాటా దాతృత్వం మీద విమర్శ ఎందుకు?”అని ప్రశ్న! టాటాయే కాకుండా, ఇతర పెట్టుబడిదారులు కూడా వాళ్ళ లెక్కల ప్రకారం, వాళ్ళు ఇస్తారు. లేదా ఇవ్వరు. అయితే? రెండేళ్ళ కిందట అదానీ, తన 60వ జన్మ దినం సందర్భంగా 60 వేల కోట్లు రకరకాల దాతృత్వ కార్యాలకి ఇచ్చినట్టు వ్యాపార పత్రికల కధనం! దేశంలో వున్న ఇతర పెద్ద పెట్టుబడిదారులకి కూడా దాతృత్వ సంస్థలు వున్నాయి, ‘అదానీ ఫౌండేషన్’ అనీ, ‘రిలయన్స్ ఫౌండేషన్’అనీ, బిల్ గేట్ ఫౌండేషన్’ అనీ! (‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’కి అందే విరాళాలలో, 88శాతం, ఈ బిల్ గేట్ దాతృత్వ సంస్థనించే వస్తుందట! అయితే?) అయినా, ఇక్కడ ఎవడు ఎంత పెద్ద మొత్తాల్లో దానాలు చేస్తున్నాడో, చెయ్యడం లేదో అనికాదు. ఒకవేళ టాటా లాగే, మిగతా వాళ్ళు కూడా అంతే పెద్ద మొత్తంలో దానాలు చేస్తారనున్నా, అదా శ్రామికవర్గానికి కావలిసింది? ఒకడు ఎక్కువా, ఇంకోడు తక్కువా దానాలు చేసినా, ‘శ్రమ దోపిడీ’ అనే సమస్య తీరుతుందా? అలాంటి దాన ధర్మాలు, శ్రామిక జనాల్ని భ్రమల్లో ముంచడానికి తప్ప ఎందుకు పనికొస్తాయి?ఆ భ్రమలు శ్రామికులకు వర్గ చైతన్యం ఏర్పడకుండా అడ్డుకుంటాయి.ఈ వాదన ప్రమాదకరం. దేశంలో వున్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ, వాళ్ళ లాభాల్లో 60 శాతం దానంగా ఇస్తే, శ్రమ దోపిడీ పోతుందా? ‘పేదరికం పోతుంది’ అని పెద్ద పెద్ద ఫేసుబుక్కు మేధావులూ, యూనివర్శిటీ ప్రొఫెసర్లూ, పత్రికల్లో రాస్తూ వుంటే, ఏమనాలి? ‘చూడండి శ్రామిక జనులారా! టాటా ఎంత దయార్ధ హృదయుడో చూడండి! అదానీ, అంబానీలు చూశారా, ఎంత తక్కువ శాతం ఇస్తున్నారో!”- అని శ్రామిక జనాలని పెట్టుబడిదారీ దాతలకు భక్తులుగా మారుస్తారా?ఇదా జనాలకి నేర్పవలిసింది? దోపిడీదారుల మధ్య తేడాల గురించి కాదు. పెట్టుబడిదారులు ఇచ్చే విరాళాలుగానీ, ఆ వర్గ ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఇచ్చే ‘ఉచితాలు’గానీ, తీసుకోవద్దని చెప్పడం లేదు. కానీ, వాటివల్ల ఏర్పడే భ్రమల్లో పడకూడదని చెప్పితీరాలి! బిచ్చగాడికి గుప్పెడు బిచ్చం పడేస్తే? ఆ పూట బిచ్చం! రెండో పూట బిచ్చం! మూడో పూట బిచ్చం! అదా బిచ్చగాడికి రక్షణ? మరి, అతడూ మానవుడే! ఒకప్పుడు కష్టించిన కార్మికుడే! బిచ్చం గతి వచ్చింది! అతడికి ‘విముక్తి’ఎలాగ?అనేదే కీలక ప్రశ్న.
– రంగనాయకమ్మ