ట్యాంక్‌బండ్‌పై పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు

Don't immerse Pov idols on tankbund– ప్రత్యేక నీటికుంటల్లోనే వేయాలి : హైకోర్టు
నవతెలంగాణ – హైదరాబాద్‌
ట్యాంక్‌ బండ్‌, ఇతర చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కృత్రిమ నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలను ప్లాస్టిక్‌ విగ్రహాలను నీటి వనరుల్లో నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు చర్యలు ఉండాలని చెప్పింది. ఆ హామీని అమలు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, నగర పోలీస్‌ కమిషనర్‌ కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలు నివేదికను మూడు వారాల్లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. చెరువుల్లో నీరు కలుషితం కాకుండా ఉండాలంటే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దనీ, ఆ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని మరోసారి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగానే ఈసారి కూడా నిమజ్జనం చేయాలని సూచించింది. మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే ట్యాంక్‌బండ్‌, ఇతర చెరువుల్లో నిమజ్జనానికి అనుమతించాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి హైకోర్టు ఉత్తర్వుల అమలుపై నివేదిక అందజేయాలని ప్రభుత్వానికి, కాలుష్య నియంత్రణ మండలికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పీసీబీ నిబంధనలకు తీసుకువచ్చిన సవరణలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ గణేష్‌ మూర్తి కళాకార్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మరో ఎనిమిది మంది గతేడాది దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
నోటరీ స్థలాలను రెగ్యులరైజ్‌ చేయవద్దు : హైకోర్టు
నోటరీ జాగాలు, ఆ జాగాల్లోని ఇండ్లను రెగ్యులరైజ్‌ చేయాలనే జీవో నెంబర్‌ 84 అమలుపై హైకోర్టు స్టే విధించింది. జీవో చట్ట వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడిన హైకోర్టు స్టే ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ జీవో అమలును నిలిపేస్తున్నట్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ సోమవారం చెప్పింది. ‘ఆ జీవోలోని సెక్షన్‌ తొమ్మిదికి భిన్నంగా ఉంది. జీవోలోని 10వ నిబంధన ప్రాపర్టీ ట్రాన్సఫర్‌ యాక్ట్‌-1882, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1989లకు విరుద్ధం. నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణ చేయొద్దు. ఈ మేరకు ఈఏడాది జులై 26న ప్రభుత్వం జారీ చేసిన జీవోనెంబర్‌ 84పై స్టే విధిస్తున్నాం’ అని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవోనెంబర్‌ 84ను కొట్టేయాలని కోరుతూ భాగ్యనగర్‌ సిటిజన్స్‌ వెల్ఫేÛర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె శ్రీనివాస్‌ వేసిన పిల్‌పై విచారణను వాయిదా వేసింది. ఆ జీవో వల్ల నోటరీ పేరుతో ఇతరుల జాగాలు, ఇండ్లను కూడా రెగ్యులరైజ్‌ చేసుకునే ప్రమాదముంటుందనీ, ఫలితంగా సివిల్‌ వివాదాలు పెరుగుతాయనీ, వెంటనే జీవోను కొట్టేయాలని పిటిషనర్‌ లాయర్‌ వాదించారు. నిషిధ్ధ భూముల విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకునీ, వాటిని క్రమబద్ధీకరణ చేయకుండా చర్యలు తీసుకుని పేదలకు, ఏళ్ల తరబడి ఉన్న వాళ్లకు న్యాయం చేసే విధంగా జీవో ఇచ్చామని ప్రభుత్వం చెప్పింది. వాదనల తర్వాత హైకోర్టు స్టే ఇచ్చి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సింగరేణి ఎన్నికలను వాయిదా వేయబోం : హైకోర్టు
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. గత నాలుగేండ్లుగా సంఘానికి ఎన్నికలు జరగలేదని గుర్తు చేసింది. గతంలో ఆదేశించిన మేరకు అక్టోబర్‌ నాటికి ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్‌ బి విజయసేన్‌ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నాలుగేండ్లుగా గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని సంఘం తరఫు లాయర్‌ చేసిన వాదనను సమర్ధించింది.